వింగ్ కమాండర్ కు అరుదైన గౌరవం
న్యూఢిల్లీ: బాలాకోట్ విమానదాడుల్లో సాహసం చూపి, పాకిస్థాన్ చేతిలో బందీగా చిక్కి హీరోగా నిలిచిన వింగ్ కమాండర్ అభినందన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయన ఇప్పుడు వింగ్ కమాండర్ నుంచి వైమానికదళ గ్రూప్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. జమ్మూకశ్మీర్‌లో సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహమ్మద్ దాడికి నిరసనగా 2019 ఫిబ్రవరి 27న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై 51 స్కాడ్రన్ తరఫున అభినందన్ బాంబుల వర్షం కురిపించాడు. అంతేకాక పాత తరహా మిగ్-21తో పాక్ అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాన్ని పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలో ఆయన పాకిస్థాన్ బలగాలకు చిక్కి దెబ్బలు కూడా తిన్నారు. ఆయన వారి చేతిలో బందీగా ఉన్నప్పటికీ రహస్యాలేవి బయటపెట్టలేదు. పైగా తాను భారత వింగ్ కమాండర్‌ని అని ధైర్యంగా చెప్పుకున్నారు. కేంద్రం కలుగజేసుకుని, వ్యూహాత్మకంగా వ్యవహరించి అతడిని పాక్ చెర నుంచి విడిపించగలిగింది. అభినందన్‌కు ఇప్పటికే శౌర్యచక్ర దక్కింది.