కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో వారసత్వ రాజకీయాలు అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భారీ కుంభకోణానికి దారితీస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోడీ తాను చెప్పే నీతులు ముందుగా ఆచరించి చూపాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మేనల్లుడైన లోక్‌సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ ట్విట్టర్ వేదికగా ఎదురుదాడి చేశారు. అంతేకాదు.. బిజెపి అగ్ర నాయకుల పిల్లలు వారసత్వంగా ఏఏ పదవుల్లో ఉన్నారోవివరిస్తూ వారి ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు.
రోజ్‌గార్ మేళా సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఒక వర్చువల్ సమావేశంలో ప్రసంగిస్తూ పశ్చిమ బెంగాల్ పేరును నేరుగా ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నిమాకానికి రేట్ కార్డులు పెట్టిన ఒక రాష్ట్రం ఉందంటూ వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రంలో డబ్బుకు ఉద్యోగం కుంభకోణంపై జరిపిన దర్యాప్తులో అక్కడ పారిశుధ్య సిబ్బంది నుంచి క్లర్కుల వరకు అన్ని ఉద్యోగాలకు రేట్ కార్డు ఫిక్స్ అయిందని ప్రధాని అన్నారు. డబ్బు చెల్లించకుండా అక్కడ ప్రభుత్వ ఉద్యోగం లభించదంటూ ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీ ఏ రాష్ట్రం పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో కోట్లాదిరూపాయల నియామక కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు సాగిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ప్రధాని వ్యాఖ్యలు సంచలనంగా మారిన నేపథ్యంలో టిఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆయనపైనే నేరుగా ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నీతులు చెప్పే ముందు వాటిని పాటించి చూపాలంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి అభిషేక్ వ్యాఖ్యానించారు. ఒక్కోసారి సొంత సలహాను కూడా స్వీకరించే పరిస్థితి వస్తుంటుంది మోడీజీ&మీరు ఇతరులకు చెప్పే ముందు వాటిని పాటించి చూపండి అంటూ ఆయన సూచించారు. సంఘ్ పరివార్ వారసుల ఫోటోలను కూడా ఆయన ట్వీట్‌కు జతచేశారు.