కాంగ్రెస్ నేత సింఘ్వీ పిలుపు
కొల్‌కతా : సమస్యల పక్కదారికి, భారతీయ సమాజంలో విభజనరేఖలకు బిజెపి పావులు కదుపుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మనూ సింఘ్వీ విమర్శించారు. అనుచితం కృత్రిమమైన హిజాబ్ వివాదం ఇప్పుడు హిందీ జాతీయ భాష వంటి అంశాలతో సమాజంలో వేర్వేరు కేంద్రాల స్థాపనలకు యత్నిస్తోందని ఈ విధంగా భారతీయులను విడగొట్టే విధంగా బిజెపి వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలు ఈ దశలో ఆద్యంతం అప్రమత్తంగా ఉండాలి. కాషాయపార్టీ కవ్వింపులకు లొంగి తమలో తాము కలహించుకోరాదని పిలుపు నిచ్చారు. దేశంలో బిజెపి వ్యతిరేక వేదిక దిశలో పశ్చిమ బెంగాల్ సిఎం, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ కీలకం, అవిభాజ్యపు వ్యక్తిగా మారారని తెలిపారు.
అయితే బిజెపిని ఎదిరించే ప్రతిపక్ష శక్తికి ఆమె ఒక్కరే ప్రతీక అనే వాదనతో తాము ఏకీభవించడం లేదని పిటిఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో స్పష్టం చేశారు. టిఎంసి కాంగ్రెస్ సంబంధాలపై బెంగాల్ నుంచి ఎంపి అయిన ఆయన నేరుగా జవాబివ్వలేదు. గోవా, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోణంలో ఈ పార్టీ కాంగ్రెస్‌పై రాజకీయ దాడికి దిగి ఉంటుందని, అయితే 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని, అప్పటివరకూ వేచి చూడాల్సి ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు అవసరమే, అయితే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేయిపట్టుకుని తమ పార్టీ నడవాల్సిన అవసరం లేదన్నారు. బిజెపి కలుషిత జలాలలో చేపలు పట్టే బాపతుగా మారిందని విమర్శించారు.