ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. నిన్న రాత్రి పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ పలు రికార్డులు తన పేరున లిఖించుకున్నాడు. ఐపిఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్ గా నిలిచాడు. గతంలో, ఈ రికార్డు కెఎల్ రాహుల్ పేరిట ఉండేది. 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాహుల్.. అజేయంగా 132 పరుగులు చేసిన రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు. నిన్న ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో పెను విధ్వంసం సృష్టించాడు.
కేవలం 55 బంతుల్లోనే 14 ఫోర్లు, 10 సిక్సులతో 141 పరుగులు చేశాడు. దీంతో అత్యధిక పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ గా, మొత్తంగా మూడో ప్లేయర్ గా ఈ ఘనత సాధించాడు. తొలి స్థానంలో క్రిస్ గేల్ 175 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. బ్రెండన్ మెకల్లమ్ 158 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు. దీంతోపాటు SRH క్రికెటర్ చేసిన రెండవ వేగవంతమైన సెంచరీ కూడా అభిషేక్ దే. ఛేజింగ్ లో హైయ్యేస్ట్ స్కోరు చేసిన క్రికెటర్ గానూ అభిషేక్ రికార్డు నెలకొల్పాడు. అలాగే, ఐపిఎల్ లో అత్యధిక స్కోరును ఛేదించిన రెండో జట్టుగా ఎస్ఆర్ హెచ్ జట్టు నిలిచింది.
కాగా, నిన్న జరిగి మ్యాచ్ లో పంజాబ్ జట్టుపై ఎస్ఆర్ హెచ్ పెను తుఫానులా విరుచుకుపడింది. ఓపెనర్స్ అభిషేక్ శర్మ(141), ట్రావిస్ హెడ్(67)లు తొలి వికెట్ కు 171 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 18.3 ఓవర్లలోనే ఎస్ఆర్ హెచ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 247 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.