100 పర్సంటైల్ సాధించిన 23 మందిలో ఏడుగురు తెలంగాణ వారే
మరో ముగ్గురు ఏపికి చెందిన వారు
ఫలితాలు విడుదల చేసిన ఎన్ టిఎ
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్ష ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల్లో మొత్తంగా 23 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) వెల్లడించింది. వారిలో తెలుగు విద్యార్థులు 10 మంది 100 పర్సంటైల్ సాధించారు. తెలంగాణకు చెందిన రిషి శేఖర్ శుక్లా, పబ్బ రోహన్ సాయి, ముతవరపు అనూప్, హుందేకర్ విదిత్, మదినేని వెంకట సాయి తేజ, కల్లూరి శ్రియాషస్ మోహన్, తవ్వ దినేశ్ రెడ్డి, ఆంధ్రప్రదేశకు చెందిన షేక్ సూరజ్, తోట సాయి కార్తిక్, అన్నారెడ్డి వెంకట తనీశ్ రెడ్డి 100 పర్సంటైల్ స్కోరు సాధించారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన జెఇఇ మెయిన్ తొలి విడత పేపర్ -1 పరీక్షకు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరైన విషయం తెలిసిందే. ఆ ఫలితాలను మంగళవారం వెల్లడించారు.
పరీక్ష రాసిన 11,70,048 మంది విద్యార్థులు
జెఇఇ మెయిన్ – 2024 తొలి విడత పరీక్షలను ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు దేశవిదేశాలలో 291 నగరాలలో 544 పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు. వివిధ తేదీల్లో జరిగిన రాసేందుకు దేశ వ్యాప్తంగా 12,21,624 మంది దరఖాస్తు చేసుకోగా, 11,70,048 మంది(95.8 శాతం) మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్ 1 (బిఇ/బి.టెక్ కోర్సులు) పరీక్ష రాసేందుకు 11.70 లక్షల మంది హాజరు కాగా.. వీరిలో 3,81,808 మంది పైగా అమ్మాయిలు, 7,88,238 మంది అబ్బాయిలు ఉన్నారు. జెఇఇ మెయిన్ చివరి విడత (సెషన్ 2) ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్‌టిఎ ప్రకటించింది. తొలి విడత రాసిన విద్యార్థులు.. రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకుంటారు. జెఇఇ మెయిన్ అర్హత సాధించిన వారిలో టాప్ 2.2 లక్షల మంది విద్యార్థులకు జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు
1. ఆరవ్ భట్(హర్యానా)
2. రిషి శేఖర్ శుక్లా(తెలంగాణ)
3. షేక్ సూరజ్(ఆంధ్రప్రదేశ్)
4. ముకుంద్ ప్రతీష్ ఎస్(తమిళనాడు)
5. మాధవ్ బన్సాల్(ఢిల్లీ)
6. ఆర్యన్ ప్రకాశ్(మహారాష్ట్ర)
7. ఇషాన్ గుప్త (రాజస్థాన్)
8. ఆదిత్య కుమార్(రాజస్థాన్)
9. రోషన్ సాయి పబ్బ(తెలంగాణ)
10. పరేఖ్ మీట్ విక్రమ్‌భాయి(గుజరాత్)
11. ఆమోఘ్ అగర్వాల్(కర్ణాటక)
12. శివాన్ష్ నాయర్(హర్యానా)
13. తోట సాయి కార్తీక్(ఆంధ్రప్రదేశ్)
14. గజారె నీల్‌కృష్ణ నిర్మల్‌కుమార్(మహారాష్ట్ర)
15. దక్షేష్ సంజయ్‌కుమార్(మహారాష్ట్ర)
16. ముతవరపు అనూప్(తెలంగాణ)
17. హిమాన్షు తాలోర్(రాజస్థాన్)
18. హుందేకర్ విధిత్(తెలంగాణ)
19. వెంకటసాయి తేజ మదినేని(తెలంగాణ)
20. ఇప్సిత్ మిట్టల్(ఢిల్లీ)
21. అన్నారెడ్డి వెంకట తనీష్ రెడ్డి(ఆంధ్రప్రదేశ్)
22. శ్రియాషస్ మోహన్ కల్లూరి(తెలంగాణ)
23. తవ్వ దినేష్ రెడ్డి(తెలంగాణ)
కష్టపడితేనే ఫలితం : రిషి శేఖర్ శుక్లా
కష్టపడితేనే ఫలితం లభిస్తుందని జెఇఇ మెయిన్‌లో 100 పర్సంటైల్ సాధించిన తెలంగాణ విద్యార్థి రిషి శేఖర్ శుక్లా అన్నారు.జెఇఇ మెయిన్ సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధమయ్యానని పేర్కొన్నారు. ప్రతిరోజు ఒక్కో సబ్జెక్టు దాదాపు మూడు గంటల చదివానని తెలిపారు. పరీక్షలకు ప్రిపేరవుతున్న సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్, యోగా చేశానని చెప్పారు.