Thursday, January 23, 2025

జివో 46 రద్దు చేయండి – ధర్నాచౌక్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్ సర్కార్ తక్షణమే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు శనివారం ఆందోళనకు దిగారు. జీవో నెంబర్ 46 వల్ల నష్టపోయిన కానిస్టేబుల్ అభ్యర్థులు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కానిస్టేబుల్ విద్యార్థుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు. టిఎస్‌ఎస్‌పి నియామకాల్లో మంటలు రేపుతున్న జీవో నెంబర్ 46 విషయంపై రాష్ట్ర మాజీ హోంమంత్రికే అవగాహన లేకుండా బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు చేసిన తప్పిదం వల్ల అనేకమంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని పలువురు అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 46 రద్దుచేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని అభ్యర్థులు విన్నవించారు హైదరాబాద్‌లో ఉంటున్నవారికి తక్కువ మార్కులు వచ్చినా వారికి ఉద్యోగాలు వస్తున్నాయని, గ్రామాల్లో ఉంటున్న అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం రావడం లేదని అభ్యర్థులు వాపోయారు. గ్రామాల్లో పుట్టడమే పాపమా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ప్రజలు మాత్రమే ఓట్లు వేశారా, గ్రామీణ ప్రాంతాల ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయలేదా అని నిలదీశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరారు. ‘జీవో 46ను రద్దు చేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గత ఆరు నెలలుగా ఈ జీవోను రద్దు చేయాలని కోరుతున్న పట్టించుకోవడం లేదు సీఎం రేవంత్ వెంటనే స్పందించి రద్దు చేయాలని కోరుతున్నాం. దీని వల్ల చాలామంది అభ్యర్థులు నష్టం పోతున్నారు. ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం రావడం లేదు అభ్యర్థులను చర్చలకు పిలిచైనా న్యాయం చేయాలి’ – అని కానిస్టేబుల్ అభ్యర్థులు వేడుకున్నారు.

మూడు జిల్లాలకు వారికి 53శాతం ఇచ్చి మిగతా జిల్లాలకు 47శాతం రిజర్వేషన్ ఇవ్వడం గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సిడి1, సిడి 2 ప్రకారం ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా జీవో నెంబర్ 46 రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి 46 జీవోను రద్దు చేయాలని కోరారు. జీవో నెంబర్ 46ను గత ప్రభుత్వానికి తెలియనివ్వకుండా దాచిపెట్టిన బోర్డు చైర్మన్ శ్రీనివాసరావుపై 420 చీటింగ్ కేసు పెట్టాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని, తెలంగాణ గ్రామాల్లో ఉన్న యువకులు స్థానికేతరులుగా జీవో నంబర్ 46 వల్ల సమస్య ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించారని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News