మూకదాడులకు మరణశిక్ష.. మహిళలపై నేరాలకు కఠిన దండన
న్యూఢిల్లీ: ఇకపై ఎవరైనా దేశ సార్వభౌమత్వానికి, లేదా సమగ్రతకు భం గం కలిగించే విధంగా ప్రవర్తిస్తే గరిష్ఠంగా జీవిత ఖైదును విధిస్తారు. అలాగే మూకదాడి చేసి చంపేయడం, మైనర్ బాలికపై అత్చారానికి పాల్పడితే గరిష్ఠంగా మరణ శిక్ష విధిస్తారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను ప్రక్షాళన చేయడంలో భాగంగా శుక్రవారం లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి ప్రవేశపెట్టిన మూడు కొత్త బిల్లుల్లో ఈ అంశాలను చేర్చారు.1860 నాటి భారతీయ శిక్షాస్మృతి(ఐపిసి)తో పాటుగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సిఆర్‌పిసి),ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాలను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఐపిసి స్థానంలో భారతీయ న్యాయసంహిత, సిఆర్‌పిసి స్థా నంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ స్థా నంలో భారతీయ సాక్షా చట్టాలను తీసుకు వచ్చారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను ప్రక్షాళన చేస్తున్నామని, కొత్త చట్టాలతో 90 శాతం నేరగాళ్లకు శిక్షలు తప్పనిసరని బిల్లులను ప్రవేశపెడుతూ అమిత్ షా చెప్పడం గమనార్హం.
ముఖ్యంగా మహిళలు, పిల్లలపై నేరాలు పెరిగి పోతున్న నేపథ్యంలో ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించే విధంగా ఈ బిల్లుల్లో నిబంధనలను చేర్చడం గమనార్హం. కొత్త చట్టాల ప్రకారం హత్యా నేరానికి మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది. అలాగే అత్యాచారానికి పాల్పడిన వారికి కనిష్టంగా పదేళ్ల జైలు లేదా జీవిత ఖైదు శిక్ష విధిస్తారు.అలాగే సామూహిక అత్యాచారం నేరానికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు. అవసరమయితే నేరానికి పాల్పడిన వ్యక్తి మిగతా జీవితకాలమంతా కూడా జైలు శిక్ష విధించేందుకు కూడా ఈ కొత్త చట్టాల్లో వీలుంది. అలాగే అత్యాచారానికి గురయిన మహిళ అత్యాచారం తర్వాత చనిపోతే, లేదా జీవించి ఉన్నా నిస్తేజ స్థితిలోకి చేరుకుంటే నేరానికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్లకు తక్కువ కాకుండా కఠిన శిక్ష విధించవచ్చు. అయితే ప్రత్యేక సందర్భాల్లో ఈ శిక్షను జీవితకాలం శిక్షగాకూడా పొడిగించవచ్చు. ఇక 12 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారికి కూడా 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష లేదా జీవితకాలమంతా జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఈ కొత్త చట్టాల వల్ల కలుగుతుంది.
భారతీయ నాగరి క్ సురక్షా సంహిత్ చట్టం ద్వారా దేశద్రోహ చ ట్టాన్ని రద్దు చేయాలని భావిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. అయితే దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం దీన్ని కొత్త అవతారంలో తీసు కు వస్తుండడం గమనార్హం. ఉద్దేశపూర్వకంగా( ఏదైనా రూపంలో)సాయుధ తిరుగుబాటుకు ఉసిగొల్పడం, విధ్వంసకర కార్యకలాపాలను ప్రేరేపిం చే ప్రయత్నాలు, వేర్పాటువాద కార్యకలాపాల ప్రోత్సహించడం ఈ కొత్త చట్టం కింద నేరం.అది భారతీయ సార్వభౌమత్వాన్ని, ఐక్యతా, సమగ్రతలను ప్రమాదంలో పడవేస్తుంది. కనుక ఇలాంటి నేరాలకు పాల్పడినా, పాలు పంచుకున్నా జీవిత ఖైదు లేదా ఏడేళ్ల జైలు శిక్షతో పాటుగా జరిమానా కూడా విధిస్తారు.
సిఆర్‌పిసిలో 300కు పైగా మార్పులు
ఇక క్రిమినల్ ప్రొసీజర్‌లో 300కు పైగా మార్పులు చేశారు. ఇకపై ఎక్కడినుంచైనా ఇఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు. కేసుల సత్వర పరిష్కారం కోసమే ఈ మార్పులు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. అయితే మరణ శిక్షను మాత్రం అలాగే ఉంచారు. మరో వైపు వివిధ నేరాలకు జరిమానాలు, శిక్షలను కూడా పెంచారు. చిన్నచిన్న నేరాలకు సమాజ సేవ వంటి శిక్షలను కూడా విధించే వీలు కల్పించారు. మరో వైపు పోలీసులు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిందితులు ప రారీలో ఉన్నా వారిపై విచారణ జరిపే నిబంధన ను చేర్చారు. పోలీసులు చేసే సెర్చ్ పరేషన్స్‌లో వీడియోగ్రఫీ, ఏడేళ్లు, అంతకన్నా ఎక్కువ శిక్షలు పడే కేసుల్లో నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం వెళ్లి పరిశీలించడం తప్పనిసరి చేయడం వంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ బిల్లులను తీసుకు రావడంలో ప్రభుత్వ ఉద్దేశం దోషులను శిక్షించడం కాదని, బాధితులకు న్యాయం అందించడమని అమిత్ షా అంటూనే శిక్ష అనే ది నేరాన్ని అపడమనే సెంటిమెంట్‌ను కల్గించడం కోసమేనని అన్నారు. బ్రిటీష్ వాళ్లు చేసిన చట్టాల నిండా బానిసత్వ సంకేతాలు ఉన్నాయని, తమ పాలనను వ్యతిరేకించే వారిని శిక్షించడమే లక్షంగా వాటిని రూపొందించారని ఆయన అన్నారు. తీర్పుల రేటును 90 శాతానికి తీసుకెళ్లడమే ఈ బిల్లుల లక్షమని చెప్పారు. కాగా బి ల్లు లు అత్యంత కీలకమైనవి కనుక సూక్ష్మ పరిశీలన కోసం హోంశాఖకు చెందిన పార్లమెంటు స్థాయీ సంఘానికి పంపించాలని స్పీకర్‌ను కోరా రు. శుక్రవారంతో పార్లమెటు వర్షాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లులు చట్టాలుగా మారే అవకాశం ఉంది.