Wednesday, January 22, 2025

విఆర్ఎస్ వ్యవస్థ రద్దు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన విఆర్‌ఎ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విఆర్‌ఎలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సి ఎం తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ సిఫారసుల మేరకు, నిబంధనలను అనుసరించి విఆర్‌ఎల అర్హతల ప్రకారం, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఇం దుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవా రం నాడు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సిఎం ఆదేశించారు. సామాజిక పరిణామ క్రమం లో మార్పులకనుగుణంగా, ప్రజల అవసరాలను అనుసరించి పాలకులు నిర్ణయం తీ సుకోవలసి ఉంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బా ధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వ విధానమని, ఈ విధానాన్ని అనుసరించే విఆర్‌ఎ వ్యవస్థను రద్దు చేస్తున్నామని సిఎం వివరించారు.రాష్ట్రంలో విఆర్‌ఎల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై డాక్టర్ బి.ఆర్.అంబేద్క ర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సిఎం కెసిఆర్ ఆదివారం నాడు ఉన్నతస్థాయి స మీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయం అభివృద్ధి చెంది సాగునీటి విధానం అమల్లోకి వచ్చిన నాటి కాలంలో ప్రతి గ్రామంలో నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంతో పాటు గ్రామ రెవిన్యూ తదితర అవసరాల కోసం ఏర్పాటయిన గ్రామ సహాయకుల వ్యవస్థ నేటి విఆర్‌ఎలుగా రూపాంతరం చెందిందని అన్నారు. అట్లా తర తరాలుగా సామాజిక సేవ చేస్తున్న విఆర్‌ఎల త్యాగపూరిత సేవ గొప్పదని సిఎం కొనియాడారు. కాగా నేటి మారిన పరిస్థితుల్లో విఆర్‌ఎల వృత్తికి ప్రాధాన్యత తగ్గిన నేపథ్యంలో, వారికి రెవిన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పించి, పర్మినెంట్ చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని సిఎం స్పష్టం చేశారు.
ఇది సమాజానికి చేస్తున్న సేవగా భావిస్తున్నాం
తరతరాలుగా సమాజానికి సేవ చేస్తున్న గ్రామ సహాయకులకు (విఆర్‌ఎలు) రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయం వారి వ్యక్తిగతంగా మాత్రమే కాదని, ఇది సమాజానికి చేస్తున్న సేవగా భావిస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలతో, శ్రమతో సమాజ శ్రే యస్సు కోసం పనిచేసే వారి కోసం తమ ప్రభు త్వం మానవీయ కోణంలో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటుందని సిఎం పునరుద్ఘాటించారు. ఇప్పటికే ఎవరూ అడగకుండానే సమాజానికి సేవలు చేస్తున్న ఉద్యోగ వర్గాలకు జీతాలు పెంచి వారి సంక్షేమానికి పాటుపడిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. ‘సఫాయన్నా..నీకు సలామన్నా..’ అంటూ ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని సిఎం చెప్పారు.
విఆర్‌ఎల క్రమబద్దీకరణ సర్దుబాటు విధానం
రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది విఆర్‌ఎలు పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. వీరిలో నిరక్షరాస్యులు, ఏడవ తరగతి పాసైనవారు, పదవ తరగతి పాసైనవారు, ఇంటర్మీడియేట్ వరకు మాత్రమే చదివి పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారని తెలిపారు. వీరి విద్యార్హతను బట్టి ప్రభుత్వం ఉద్యోగ కేటగిరీలను నిర్ధారిస్తుందని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో వారిని భర్తీ చేస్తామని సిఎం తెలిపారు. ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారికి అందుకనుగుణమైన పోస్టుల్లో భర్తీ చేయనున్నట్టు సిఎం వెల్లడించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టి, విధివిధానాలు ఖరారు చేసి, సోమవారం ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.
61 ఏండ్లు పైబడిన విఆర్‌ఎల వారసులకు కారుణ్య నియామకాలు
రాష్ట్రంలో 61 ఏండ్లు పైబడిన విఆర్‌ఎల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు సిఎం కెసిఆర్ నిర్ణయించారు. అదేవిధంగా… 2 జూన్ 2014 అనంతరం 61 ఏండ్లలోపు ఉండి ఏ కారణం చేతనైనా విఆర్‌ఎ విధులు నిర్వహిస్తూ మరణించిన విఆర్‌ఎ వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని అన్నారు. కాగా, చనిపోయిన విఆర్‌ఎల వారసుల వివరాలు, వారి విద్యార్హతలు త్వరలో సేకరించాలని అధికారుల విఆర్‌ఎ జెఎసి నేతలకు తెలిపారు. వీరికి కూడా నిబంధనలకు అనుసరించి అర్హతల మేరకు, ఆయా శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్దుబాటు చేయాలన్నారు.ఈ సమావేశంలో.. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధు, ఎంఎల్‌ఎలు బాల్క సుమన్, ఎ.జీవన్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, రోహిత్ రెడ్డి,మదన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు సోమేష్ కుమార్, సిఎస్ శాంతి కుమారి, సిఎంఒ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.నర్సింగ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఎయుడి అరవింద్ కుమార్, సిఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, దాసోజు శ్రవణ్, విఆర్‌ఎ జెఎసి నేతలు చైర్మన్ రాజయ్య, కో చైర్మన్ రమేశ్ బహదూర్, సెక్రటరీ జెనరల్ దాడే మీయా, విజయ్ రవి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
సిఎం కెసిఆర్‌కు విఆర్‌ఎ జెఎసి నేతల ధన్యవాదాలు
మస్కూరు తదితర పేర్లతో తమను తరతరాలుగా వెంటాడుతున్న సామాజిక వివక్షతో కూడిన విధుల నుంచి తమకు విముక్తి కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేసి, తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మీకెంతో రుణపడి ఉంటామని విఆర్‌ఎ జెఎసి నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News