Friday, November 15, 2024

అబార్షన్‌కు మరింత వెసులుబాటు

- Advertisement -
- Advertisement -

Abortion to 24 weeks in special cases

 

పిండ దశలోని గర్భస్థ శిశువులో అసాధారణ లక్షణాలు, మితిమించిన లోపాలున్నట్టయితే 24 వారాల తర్వాత కూడా వైద్యుల సలహాతో అబార్షన్ చేయించుకోడానికి అవకాశమిస్తూ 2020లో రూపొందించిన బిల్లుకి రాజ్యసభ మంగళవారం నాడు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు 2020 మార్చిలో లోక్‌సభ ఆమోదాన్ని పొందింది. ఇది ప్రగతిశీల బిల్లు అనడానికి ఏ మాత్రం వెనుకాడవలసిన పని లేదు. చాటుమాటుగా గర్భాలను తొలగించుకోవలసిన దుస్థితికి స్వస్తి చెబుతూ తగిన శిక్షణ కొరవడిన నకిలీ వైద్యుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసిన దుర్గతికి తెర దించుతూ చట్టబద్ధ గర్భస్రావానికి అవకాశం కల్పించడం అందులో పిండస్థ శిశువు వయసు పై ఉన్న పరిమితులను తొలగించుకుంటూ మహిళలకు తగినంత స్వేచ్ఛనివ్వడం ప్రగతిశీల సమాజాల లక్షణం. తన గర్భంలోని శిశువును కనడమా, వదిలించుకోడమా అనేది మహిళల స్వయం నిర్ణయాధికారానికి లోబడి ఉండడం వారి ఇష్టానికే దానిని వదిలివేయడం అనేది సంపూర్ణ స్వేచ్ఛాయుత సమాజాల ప్రత్యేకత.

కాని ఇప్పటికీ చాలా దేశాల్లో మత దృష్టితో గర్భస్రావాన్ని దోషంగా పరిగణించడం కొనసాగుతున్నది. అది మహిళకు ఎంత క్షోభ కలిగిస్తుందో గర్భాన్ని తొలగించుకునే స్వేచ్ఛను ఆమె నుంచి హరించడమనేది హక్కులపరంగా ఎంతటి దుర్మార్గమైనదో చెప్పనవసరం లేదు. 24 వారాలకు మించిన గర్భాన్ని కూడా తొలగించుకునే అవకాశం ఇచ్చే బిల్లును రాజ్యసభ ఆమోదించడం ఎంతైనా ఆహ్లాదకరమైన పరిణామం. దేశంలో వైద్యుల సలహా మేరకు అబార్షన్ చేయించుకునే అవకాశం తొలిసారిగా 1971లో కలిగింది. అప్పటి బిల్లుకు మెరుగైన సవరణలు చేస్తూ ప్రస్తుత బిల్లు అవతరించింది. ఇప్పుడు అమల్లో ఉన్న పద్ధతిని బట్టి 12 వారాల లోపు అబార్షన్లకు ఒక వైద్యుని సలహా లేదా అనుమతి సరిపోతుంది. 12 నుంచి 20 వారాల్లోనైతే ఇద్దరు వైద్యుల అనుమతి అవసరం. కొత్తగా ఆమోదించిన బిల్లు ప్రకారం 20 వారాల లోపు అబార్షన్‌కు ఒక డాక్టర్ సలహా సరిపోతుంది.

కొన్ని రకాల మహిళలు 20 నుంచి 24 వారాల గర్భాన్ని తొలగించుకోడానికి ఇద్దరు వైద్యుల అనుమతి పొందాలి. ఆ పైన పిండ దశలోని శిశువులో అసాధారణ లోపాలు ఉన్నట్టయితే రాష్ట్ర స్థాయి వైద్యుల బోర్డు అనుమతి తప్పనిసరి. అయితే ఇంత మంచి బిల్లులో కూడా వేలెత్తి చూపించవలసిన లోపాలు లేకపోలేదు. దేశంలోని వైద్య వ్యవస్థలో తగినంత మంది వైద్యులు లేరన్న విషయం సుస్పష్టం. అటువంటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వైద్యుల సలహా, సర్టిఫికేషన్ సునాయాసంగా లభించదు. అందువల్ల చాలా మంది మహిళలు నకిలీ వైద్యులను ఆశ్రయించక తప్పని పరిస్థితుల్లో కొనసాగుతారు. అలాగే అన్ని దశల్లోనూ అబార్షన్ కోసం వైద్యుల మీద, వైద్యుల బోర్డుల మీద ఆధారపడవలసి రావడం స్త్రీకి అత్యంత ఇరకాటమైన పరిస్థితిని కలిగిస్తుంది. ఈ కారణంగా ఈ బిల్లు అవసరం ప్రాతిపదికగా అబార్షన్ స్వేచ్ఛను ఇచ్చేదిగానే పరిగణన పొందుతుంది. కాని హక్కులపరమైన అబార్షన్ స్వేచ్ఛను ఇస్తున్న బిల్లుగా దీనిని పరిగణించలేము అని నిపుణులు భావిస్తున్నారు.

బిల్లు రూపొందించినప్పుడు సంబంధిత వ్యక్తులను, సంస్థలను సంప్రదించలేదని కాంగ్రెస్ నాయకురాలు అమి యాజ్ఞిక్ రాజ్యసభలో ఆక్షేపణ తెలియజేశారు. మెడికల్ బోర్డులో నిపుణులైన వైద్యులు ఉండాలి. కాని ప్రభుత్వ సమాచారాన్నే పరిశీలిస్తే వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తున్నదని ఆమె అన్నారు. గర్భిణి తన కడుపులోని బిడ్డ తన ప్రాణానికే ముప్పు తెస్తుందని ఆ బిడ్డ పుడితే ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని భావించినప్పుడు అబార్షన్‌కు ఆమె ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా, ఇందులో ప్రభుత్వం ప్రమేయం ఎందుకు అని కూడా ఆమె ప్రశ్నించారు. ఒక మహిళ ముఖ్యంగా తనలోపల మరో జీవి ఉన్నదనే తెలుసుకున్నప్పుడు అబార్షన్ నిర్ణయం తీసుకోడం ఎంతో క్లిష్టతతో కూడుకున్న వ్యవహారం.

అటువంటి స్థితిలోని మహిళ మెడికల్ బోర్డు అనుమతి కోసం వెళ్లవలసి రావడమనేది ఆమెను ఎంతో వేదనకు గురి చేస్తుంది. అది ఆమె గోప్యత హక్కుకు భంగకరమని శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం ప్రక్రియ అధికార వర్గం సృష్టించే అవరోధాలకు దారి తీస్తుంది. మహిళ తన ఇష్ట ప్రకారం నిర్ణయించుకునే అవకాశాన్ని ఆమెకు కలిగించడం లేదు. ఆమె ఒక మెడికల్ బోర్డును అర్థించవలసిన అవసరం ఏముంది అని కూడా ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. మొత్తం మీద చూసినప్పుడు ఈ బిల్లు సంప్రదాయ రీతిలో రూపొందిన ప్రగతిశీల పత్రమేగాని మహిళల హక్కులను గుర్తించి, గౌరవించి తీసుకువచ్చినది కాదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News