ఆరోగ్య పరిరక్షణ సిబ్బందిపై అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ : పూర్తి స్థాయిలో కొవిడ్ టీకా పొందినప్పటికీ మళ్లీ కరోనా మహమ్మారి సోకిన ఉదంతం ఆందోళన కలిగిస్తోంది. కరోనా లోని డెల్టా వేరియంట్ వల్లనే ఈ విధంగా ఇన్‌ఫెక్షన్ జరుగుతోందని ఢిల్లీ లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ (ఐటిఐబి) మాక్స్ హాస్పిటల్స్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఇది బయటపడింది. కరోనా టీకా పూర్తిగా పొందినప్పటికీ ఆరోగ్య పరిరక్షణ సిబ్బందిలో 25 శాతం మందికి కరోనా మహమ్మారి సోకినట్టు అధ్యయనంలో పరిశోధకులు కనుగొన్నారు. ఢిల్లీలో డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న సమయంలో టీకా పొందినప్పటికీ కొవిడ్ బారిన పడిన వారు (బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్లు ) ఊహించినదాని కన్నా ఎక్కువ గానే ఉన్నారని ఇందులో తేలింది. అయితే ఇలాంటి వారిలో వ్యాధి తీవ్రత తక్కువ గానే ఉందని వెల్లడైంది. అందువల్ల టీకాలతో ఇన్‌ఫెక్షన్ తీవ్రతను తగ్గించుకోవచ్చని మరోసారి రుజువైంది. బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్ల లోని 25 శాతం కేసుల్లో వ్యాధి లక్షణాలు బయటకు కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడంలో మాస్కులు చాలా కీలకమని చెప్పారు. కొవిషీల్డ్ టీకా రెండు డోసులు పొందిన 95 మంది ఆరోగ్య సిబ్బందిపై ఈ అధ్యయనం జరిపారు.