Friday, November 15, 2024

కాంతిపరావర్తనం

- Advertisement -
- Advertisement -

About Ammangi Venugopal poetry

 

Art is an effort to create beside the real world, a human world అన్న మాటలు అమ్మంగి గారి కవిత్వం ఆసాంతం చదివినప్పుడు గుర్తుకొస్తయి. తనదే అయిన సాహిత్య ఆవరణాన్ని సృష్టించుకున్న సృజనశీలి ఆయన. సమిష్టిగొంతుకగా ‘సామాన్యుని’ స్వరాన్ని వినిపిస్తున్న కవి. కవిగా యే చట్రాల్లోకి ఒదిగిపోకుండా మనిషిగా స్వేచ్ఛగా సరళంగా సంభాషించడం ఆయన కవిత్వాన్ని నడిపించే శక్తి. వ్యక్తిగా ఆయన జీవితంలోని ‘సరళ స్వభావం’ కవిత్వంగా తర్జుమా అవడం వల్లే ఆయన కవితలు పఠితులను కవి ఆవరణంలోకి అలవోకగా నడిపిస్తయి. రెండు ప్రపంచయుద్ధాలు నేపథ్యం దాటి, తొలిభారత స్వాతంత్య్రపోరాటాన్ని ఆవాహన చేసుకొని కొత్త ఆశలతో ప్రజాస్వామ్యాన్ని కలగంటున్న తెలంగాణలో కళ్లు తెరిచిన తరం కవి ఆయన.

అందుకేనేమో ఆయన వ్యక్తిత్వానికైనా, కవిత్వానికైనా ప్రజాస్వామిక దృక్పథమే పునాదైంది. అభ్యుదయాన్ని దాటి దిగంబరంగా వెల్లువెత్తి విప్లవాన్ని నినదిస్తున్న తెలుగు కవిత్వ ‘సమయం’లో తెలంగాణ వలెనే అమ్మంగి సైతం ‘ప్రకృతి పాపాయి కట్టిన పిచ్చుక గూడు వంటి’ ఊర్లను కలగంటూ ‘పొలాలను కాపలా కాయడానికి చేతుల్ని నరికి ఇస్తున్న తుమ్మచెట్ల వంటి’ సామాన్యులున్న సామాజిక వాస్తవికతలో కవిగా మేల్కొన్నడు. 1970 నాటికి దేశవ్యాప్తంగా చుట్టు ముసురుకుంటున్న చీకట్లలో తన ‘బతుకునీడ’ ను దేవులాడుకుంటున్న తెలంగాణ (అంధ) జీవిత స్నేహంలో కవిత్వమై మొలకెత్తిన వారు అమ్మంగి. దేవుడే రుణపడిన సామాన్యుల వ్యధార్థ జీవితాలను అనుభూతించి, ఉద్వేగాన్నీ, ధర్మాగ్రహాన్నీ సంతరించుకుంటున్న కాలంలో ఆయనకి ‘మిణుగురు’ దారి దీపమైంది. గొప్ప ఆశావాదిగా సామాన్యుని స్వరమై నిలదొక్కుకోవడానికి కవిత ‘భరోసా’ అయింది.

ఇక అవిశ్రాంత కవిగా ఆయన ఆగిందేలేదు. సామాన్యులలో సామాన్యునిగా తన వ్యక్తిగత జీవితంలోని అనుభూతులను పబ్లిక్ జీవితంతో పేనుతూ కవిత్వాన్ని పండించే రైతు అయ్యారు. ‘సూర్యుని గుండెలోంచి చీకటి సిరలలోకి దూకే కాంతి జలపాతం’ వంటి ‘కవిత’ ను అనుభూతించి అనుభవించి చెమ్మగిల్లిన తేటనీటి ‘చెలిమె’ గా ఊహను విస్తరించుకున్నరు. ‘మురికి కాల్వలో సైతం ప్రతిఫలించే ఆకాశం’ గా కవితను ఆవాహన చేసుకొని మానవత్వపు ‘కంటితడిని’ రికార్డు చేసే చరిత్ర కారుడయ్యారు. మొత్తంగా రెండింతల పీడనలో ప్రజాస్వామ్యపు కుంటినడక’ను చూసిన తెలంగాణలో ‘క్రూరుడు నరికి యెండేసిన కట్టె రహస్యంగా దాచుకున్న శ్వాసలాగా’ మంచి గంధపుపరిమళమై ఒదిగున్న అపురూప కవిగా అమ్మంగి తెలంగాణా ఆత్మీయ స్వరమయ్యారు. ఎలాంటి సంకోచాలు లేకుండా ‘షుగర్ పేషంట్’ గా తన సొంత గొడవను ఎట్లా పంచుకుంటారో అంతే సీదాగా రైతు ‘రక్తపాదముద్ర’లను చూసి కన్నీరు నింపే స్నేహితునివలె స్పందించడం కవిగా ఆయన నైజం.

అందుకే తన తరం కవులు పబ్లిక్ జీవితాన్ని ఉద్దేశిస్తూ అయితే బోధకులుగానో లేదంటే కార్యకర్తలు గానో చీలిపోయిన సందర్భంలో పబ్లిక్ జీవితంలో తన వ్యక్తిగత అనుభూతులను అనుసంధానిస్తూ కాళోజీ ధోరణులను అచ్చంగా అందుకున్న వారసుడు అమ్మంగిగారు.

అమ్మంగిగారితో నా తొలిములాఖాత్ అప్పుడెప్పుడో ఏదో పత్రికలో, చదివిన ఆయన కవితలోనే మొదలైంది. నేను ఆయన్ని ముఖతా కల్సింది మాత్రం చాలా ఆలస్యంగానే. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనే. ఆయనతో నా తొలిపరిచయం కవిత్వంతోనే కాబట్టి కవిత్వంలోంచి ఆయన్ని నేనెట్లా పరిచయం చేసుకున్నానో ఆ స్నేహం గురించి తొలుత పంచుకోవడం సమంజసమనుకుంటున్న. ఆయనతో నా స్నేహం ‘నీకూనాకూ నడుమ’ అన్న కవితతోనే మొదలైంది. చాలా సాదాసీదా భాషలో నాలుగంటే నాలుగు పాదాల్లో ప్రపంచ/ దేశ రాజకీయాలను వ్యాఖ్యానించడం, అదీ ఎలాంటి పరిభాష లేకుండా తన ఆలోచనల సారాన్ని సూటిగా అందించడం వల్లేనేమో ‘నీకూ నాకూ నడమ దేశం’ అన్న ఆ కవితాపాదాలు నాకు గుర్తుండిపోయినై. యాదృచ్ఛికంగానే అయినా ఆ రోజుల్లోనే నేను చదివిన ఆడెన్ (19071973, ఆంగ్లకవి) రాసిన ‘ The unknown citizen’ అనే కవితలో కన్పించే ‘కవిత్వ రహస్య’ మేదో అమ్మంగిగారి కవితలో పొడగట్టినట్లు జ్ఞాపకం.

నిజానికి ఆడెన్ రూపుగట్టిచ్చిన ‘పౌరుని’కీ, అమ్మంగి దృశ్యమానం చేసే ‘సామాన్యుని’కీ దేశానికీ భూమికీ వున్నంత తేడాలున్నాయన్నది ఇప్పటి అవగాహన. ఐనా వారిద్దర్నీ అనుసంధానించే సూత్రమేదో వుందనిపించింది. గతవారం రోజులుగా అమ్మంగిగారి కవిత్వంలో మనసుదీరా మునకలేస్తున్నప్పుడు వెనుకటి జ్ఞాపకం వెలుగులో వరకు బోధపడింది. పాఠకులను తన కవిత్వ ఆవరణంలోకి కొంత అలవోకగా నడిపించే Poetic diction వారిద్దర్నీ కల్పేసూత్రమని అర్థమైంది. వస్తువులో, వ్యక్తీకరణలో, శిల్పంలోనే కాకుండా ఆధునికత అందించిన సహేతుకత, పరిజ్ఞానం పట్ల ఆరాధన, ప్రజాస్వామిక విలువలపట్ల గౌరవం, బూజు పట్టిన చరిత్రను సామాన్యుని కేంద్రంగా తిరగరాయాలనే కాంక్ష. చమత్కారపు చురకలు వంటి విషయాలు సైతం అమ్మంగి గారిని ఆడెన్‌కు దగ్గరచేసే అంశాలు. ఇద్దరు భిన్న భాషల/ ప్రాంతాల/ కాలాల కవులను (సరి) పోల్చడం అనవసరమే అయినప్పటికీ తమతమ రాజకీయ సామాజిక వ్యవస్థల్లో ప్రజాస్వామ్యం మలుపు తిరుగుతున్న దశలో వేరువేరు కాలాల ప్రాంతాల కవుల ఊహలు ‘సామాన్యున్ని’ ఎలా తమ కవిత్వ గమనంగా మార్చుకున్నాయో అర్థంచేసుకోవడానికి ఈ పోలిక పనికొస్తుంది.

పబ్లిక్ జీవితం అతలాకుతలం అవుతున్నప్పుడు పాఠకులకు ‘ఆత్మిక వాతావరణాన్ని’ అందించడంలో ఈ ఇద్దరూ సమ ఉజ్జీలే. అయితే ఆడెన్ చిత్రించిన The Unknown citizen కంటే ఒకడుగు ముందుకేసిన అమ్మంగి సామాన్యున్ని ‘చరిత్రధారి’గా నిల్పే ప్రయత్నం కన్పిస్తుంది. ఆడెన్ ప్రభుత్వ (ఆధార్) కార్డుల్లో నెంబర్ కింద మారిన ‘సిటిజన్’ వాస్తవికతనూ వంచితునిగా స్థితిని వివరిస్తే, ‘కావ్య పిసాసి, కళాభిలాషి, సమైక్యశక్తి, దాస్యవిముక్తి, శాస్త్ర దాహం, చరిత్ర సారం యుద్ధాలను ఢీకొన్న సంకల్ప బలం’ సామాన్యుడే అంటూ అమ్మంగి చరిత్రను తిరగరాసే బాధ్యతను ఎత్తుకోవడమేగాక, సామాన్యుని చైతన్యశక్తిగా చూపటం కన్పిస్తుంది. ప్రజాస్వామ్య చరిత్రలో నెంబరుగా రూపాంతరమైన ‘పౌరుని’ గురించి ఆనాటి ఇంగ్లీషు కవి రాస్తే చరిత్రలో ఆధిపత్య శక్తులకు తిరగబడి ‘అమరులై’ చరిత్ర సృష్టించినట్టు జనం గురించి ఈ తెలంగాణ కవి రాయడం చూడొచ్చు.

అంతెందుకు, ఈనాటి అత్యాధునిక “అభివృద్ధి” వ్యవస్థలో ‘జనం’ ‘అమరులు’ గా మారుతున్న వైనాన్ని (2013 ల నాటికి తన అనుభవాల్లోంచి) అమ్మంగి మరింత స్పష్టంగా వివరించడం ‘సకలజనుడు’ లో చూడొచ్చు. తెలంగాణా ఉద్యమంలో ఒక నిర్దిష్ట సందర్భం గురించి రాసినా సార్వజనీనతను సాధించిన కవిత ఇది. అట్లాగే సామాన్యుడు పౌరునిగా, భూమిదేశంగా మారుతున్న క్రమంలో ప్రజాస్వామ్య విలువలను కొనసాగించాలంటే నీకూనాకు నడుమ రావాల్సిన సుహృద్భావన గురించి అద్భుతంగా ప్రకటించడంలో సైతం అమ్మంగి ప్రతిభ కన్పిస్తుంది.
“నీకూ నాకూ నడుమ దేశం
అనురాగం చూపితే అన్నదమ్ములం
ఆగ్రహిస్తే యుద్ధ ఖైదీలం”
వంటి కవితా పాదాలు ప్రస్తుతం ‘పౌరసత్వచట్ట సవరణ’ బిల్లు ద్వారా రాజ్యాంగ విలువలు ప్రమాదం అంచుకుచేరుతున్నాయనే ఆందోళన దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న సందర్భంలో మరింత ప్రాసంగికతను సంతరించుకున్నయి. ఇక విధాన నిర్ణేతల చేతుల్లో గల్లంతైన రాజ్యాంగ ఉద్దేశ్యాల గురించి చెప్పే ‘వ్యాకరణం’ కావొచ్చు, “రక్తంతో మతగ్రంధం మీద సంతకం చేయాల్సి” వస్తుంది అన్న ‘మరణవాంగ్మూలం’ కవితలో కావచ్చు. ఈనాటి పరిస్థితిని ఆనాడే ఊహించగల్గిన కవి దార్శనికతకు నిదర్శనంగా కన్పిస్తయి.

ఇంతేకాదు, ‘దేశం అనేమాట అగ్రరాజ్యానికే వర్తిస్తుంది, మిగిలిన దేశాన్నీ మార్కెట్లుగా చలామణి అవుతయి’ అన్న ప్రపంచ రాజకీయార్థిక అవగాహనతో పాటుగా 150 యేళ్లు పూర్తిచేసుకున్న ప్రథమ భారతస్వాతంత్య్ర సంగ్రామంలో ‘151వ కథ’ అంటూ ప్రస్తుత దేశకాల పరిస్థితులను ‘తూచినట్టు’ 2008 నాటికే అంచనా వేయడం చూడొచ్చు. (ఆజాదీ అన్నమాట సామాన్యుల నినాదంగా ప్రస్తుతం ప్రతిచోటా మార్మోగడం మనం చూస్తూనే వున్నం) మొత్తానికి ప్రాంత దర్శిత్వంతో ‘సామాన్యుడే వేగుచుక్క’ అని ప్రకటించడంతో ఆగకుండా ప్రజాస్వామ్యంలో ‘అధికారం’ అంటే ‘పెత్తనం’ (domination) కాదు ‘సమిష్టి బాగు’ (empowerment) అంటూ ప్రజాకీయాలను స్త్రీవాద దృక్కోణాల్లోంచి intutiveగా పునర్వచించిన కవి అమ్మంగి. అంతర్గత వలసలో ఉన్నప్పటి తెలంగాణ ‘ప్రజల’కు పెద్దన్నగా ‘భరోసా’నిచ్చిన ద్రష్ట. అక్కడితో ఆగిపోకుండా “ if we reject science, we reject common man” అన్న అవగాహనతో తెలంగాణా పునఃనిర్మాణానికి పునాది సూత్రాన్ని అందిస్తూ ‘అణచివేయబడ్డ వాళ్ళను ప్రజలంటారు, బలైపోయిన తర్వాత బతికేవాళ్లను అమరులంటారు’ అంటూ అణచివేత, తిరుగుబాటు డైనమిక్స్‌ని సాదాసీదాగా సూచించిన ఉద్యమకారుడీయన.

అతి (excess) అన్నది అమ్మంగి గారి స్వభావానికి విరుద్ధం. “హృదయంలో గడబిడా అంత అతిగా వాగుడు లేకుండా వుంటే నేను చూసిందే మీరూ చూసేవారు, నేను విన్నదే మీరూ వినేవారు” అన్న సూఫీ కవి మాటలు ఈ కవికీ ఆయన కవిత్వానికీ సరిగ్గా సరిపోతై. మచ్చుకి ‘సముద్రం’ అన్న కవిత జీవితం లోతును తడిమి చూసే కవి ప్రయాసను ఎలాంటి గడబిడలులేకుండా అద్భుతంగా వివరిస్తుంది. మనం వినగలగాలి అంతే. అప్పుడు ‘చెట్టు ఆత్మఘోష’ అంటూ కల్లోలాలను దాటడానికి తన స్వీయగత అనుభవాల ఆవరణాన్ని పునఃసృష్టించి పాఠకులను ఆదరంగా అందులోకి, చేయిపట్టి ఆహ్వానిస్తున్న కవిని అనుసరించాలె. అప్పుడు అమ్మంగి అంటేనే ఆదరం ఆత్మీయత అంటూ ఆయన్ని ముఖతా కలవని వాళ్లు సైతం గ్రహించేట్టు చేసే ‘ఆత్మిక భాష’ ఆయన కవిత్వానికి ఎట్లా ప్రాణవాయువైందో కూడా అర్థం చేసుకోగలం. ఐతే తన స్నేహితుల ఆత్మీయ స్వభావం ఆయన కవిత్వ శైలి అయిందో లేక ఆయన శైలి తన ఆత్మీయుల స్వభావంగా రూపాంతరించిందో ఆయన జీవిత భాగస్వామి విజయలక్ష్మీగారు ప్రాణస్నేహితులైన ప్రొ.చెన్నకేశవరెడ్డి, వేణుసంకోజు, ప్రొ.లక్ష్మీనారాయణ గార్లు మాత్రమే చెప్పాల్సి వుంటుంది.

మొత్తానికి అమ్మంగి కవితాసంపుటాల్ని బహుళత్వాలను గౌరవించే, భిన్నత్వాలను మనసారా అంగీకరించే కవి అంతరంగపు నైజాన్ని పట్టిచూపేవే. వైవిధ్యభరితమైన వస్తువులు ఆయన కవిత్వానికి ప్రేరణలయినయి. ఆయన కవితలన్నీ కవిలో బహుముఖకోణాలుగా విస్తరించిన వివేచనను పాఠకుల దృష్టికి తెస్తయి. కానీ ఇంతటి వైవిధ్యభరితమైన కవితలను ఉద్యమకవిత్వం, సామాజిక కవిత్వం అంటూ విడదీసి పాఠకులకు అందించే దృష్టి కృతకమైందని నా ఉద్ధేశ్యం. కవి ఉద్వేగాలను, ప్రేరణలను, అనుభవాలను విడదీయలేనట్టుగనే భిన్న అనుభూతుల సమాహారమైన కవిత్వాన్ని చట్రాల్లో బిగించి చూడలేం. అమ్మంగిగారి కవిత్వాన్ని సమస్త అనుభూతుల నిర్దుష్ట అనుభవాల సమాహారంగా ఆస్వాదిస్తే తప్ప అందుకోలేం. అదే ఆయన కవిత్వానికి భవిష్యద్దర్శనాన్ని సైతం అందించింది.

ఉదాహరణకి ‘తమను తాము కోల్పోయినంత మేరా వచ్చి చేరిన ఎడారులకు మహారాణులుగా మారిన’ తల్లుల గురించి మాట్లాడినా, ‘చీకట్లో ఒక దీపం నిర్భయంగా దూసుకుపోతున్నట్లుందని’ వంచిత స్త్రీల గురించి చెప్పినా, ‘రక్తపాద చిహ్నాలను ఆనవాలుగా వదిలి నడుస్తూ ఎవరైనా కన్పించారా నీకు’ అన్న కవి ప్రశ్న విన్నా ఆనాడు అమ్మంగి సాధించుకున్న భవిష్యత్ దర్శనానికీ విభిన్నజీవితాలను గాఢంగా అనుభూతించిన వైనానికే ఈనాటి మనం విస్మయంతో అబ్బురపడవలసిందే. (ఇది రాస్తున్నప్పుడు ఆ మధ్య ముంబై రైతు అఖండ పాదయాత్రలో చితికి రక్తాలు కారుతున్న రైతు పాదాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం గుర్తొస్తున్నది. అమ్మంగిగారు 1980 లలోనే రైతుని ఉద్దేశించి రాసిన ‘బిచ్చగాడు’ అన్న కవితలో ఆ పదచిత్రం 2018 నాటికి నిజమవడం గొప్పవిషాదం) Political discourseకీ మధ్య సమతూకం సాధించిన కవిగా అది ఆయనకు సాధ్యమయింది. అదే ఆయన కవిత్వానికి ప్రత్యేకమైన శైలీశిల్పాలను కూర్చిందనిపిస్తుంది.

‘సమతూకం’ అనేది ఆయన వ్యక్తిత్వ భావం. కవిత్వ భాషకీ రాజకీయ సందర్భానికీ సమతూకం సాధించిన వ్యక్తీకరణగా అమ్మంగి కవిత్వాన్ని నెలబెట్టింది ఆయనలోని ఈ వ్యక్తిత్వ భావనే. అదే ఆయన Poetric diction అయింది. ఉదాహరణకి సైన్స్ కీ లాజిక్ కీ సృజనను జోడించి చెప్పటమంటే గాల్లో తాడుపై గెడకర్ర సాయంతో నడిచే బాలికలోని నైపుణ్యాన్ని వొడిసిపట్టుకోవడం వంటిదే. సమతూకం లేకపోతే అభాసుపాలు కావడం అనివార్యం. ఇలాంటి సందర్భాల్లో సైతం అమ్మంగిగారు కించిత్తు, కూడా తొట్రుపడని వ్యక్తిత్వంతో గంభీరమైన చమత్కారాన్ని (wit) జోడించి పఠితల పెదవులపై నవ్వులు పూయించడం చూడాలంటే ‘సినిమా’ వంటి కవితలు చదవాల్సిందే. “పగటి అణిచివేతకు రాత్రి అనుసృజన అవుతుంది” అంటూ ‘కల’ గురించి మొదలుపెట్టి ‘మరో కొత్త సినిమా మొదలైంది’ అన్న ముగింపుతో కలనుసినిమాగా మన కళ్లముందు దృశ్యం చేస్తరు.

నిజానికి చమత్కారధోరణి (wit) అమ్మంగిగారికున్న గొప్ప బలం. అది ఆయన వ్యక్తిత్వంలో భాగం. పాఠకులనైనా, తనచుట్టున్న వారినైనా అయస్కాంతంలా తనవైపు లాక్కునే ఈ శక్తి అమ్మంగి గారి భాషలోను స్వభావంలోను అంతర్భాగం. ఈ విషయం నేను ఆయనతో కల్సి తెలంగాణా ఎన్నారై అసోషియేషన్ (TENA) వాళ్ళు ప్రారంభించిన ‘తెలంగాణా పునరుజ్జీవన అవార్డ్స్’ కమిటీలో పనిచేస్తున్నప్పుడే నాకు అనుభవానికొచ్చింది. నా మట్టుకు నాకు కాళన్నను గుర్తుచేసుకోగానే కరుణారుణ కన్నీటి జడిలో తడిసినట్లవుతుంది. అమ్మంగి గారిని జ్ఞప్తికి తెచ్చుకుంటే నవ్వులు పువ్వులుగా వికసించటం గుర్తుకు వస్తుంది.

అమ్మంగి గారితో అలాంటి అపురూప క్షణాలను గడిపే అవకాశం నాకు 2012లో TENA Awards commitee వల్ల కలిగింది. నిజానికి ఈ సంకలనం కోసం (నిర్వాహకులు) నన్ను రాయమని కోరిన వ్యాసం TENAతో అమ్మంగిగారి అనుబంధం గురించి. కానీ సమతూకం సాధించిన అరుదైన కవిగా, శిల్పరహస్యాలను ఆకళింపు చేసుకున్న కావ్యకళావేత్తగా నాకు పరిచితమైన కవిని సాహిత్య ప్రేమిగా మనస్ఫూర్తిగా అభినందన కరచాలనం చేయాలనే లౌల్యం నన్ను తొలుత ఆయన కవిత్వం గురించి మాట్లాడేటట్టు చేసింది. అంతమాత్రం చేత మలిదశ ఉద్యమంలో ఆయనతో కల్సి పనిచేసిన క్రమంలో బోధపడిన లేదా హత్తుకున్న అంశాలను, క్షణాలను తక్కువ చేయడం నా ఉద్దేశంకాదు. కవిత్వమంత విస్తృతమైందీ

ఉద్యమజీవిత అనుభవం. పుస్తకాలిచ్చిన జ్ఞానాన్ని పరిపుష్టం చేసే పాఠాలు కొన్ని పాఠకురాలిగా నేనందుకోలేని ఉద్వేగాలను అందిచ్చిన అనుభూతులు మరికొన్ని. మానవస్పర్శలేని ‘మార్మిక’ భావావరణాలను బద్దలుకొట్టే అనుభవాలు ఒకెత్తు. అందరికోసం ఒక్కరై ఒక్కరికోసం అందరమై నిల్చిన ప్రేమోత్తుంగ ఉద్యమ తరంగాలు మరొకెత్తు. ఎన్నెన్ని అనుభవాలు ఏం రోజులవి! ఏవీ ఆ రోజులు!! ఏం రోజులవి? ఏం రోజులు??

                                                                                           ఏ. కొల్లాపురం విమల

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News