Monday, December 23, 2024

గౌడన్నల జీవన చిత్రం

- Advertisement -
- Advertisement -

About goud caste in telugu

ఆదిమానవుడు గీత కార్మికుడుగా ఎదిగిన తీరును చిత్రకారుడు కాన్వాస్ పై చిత్రించినట్లుగా పాటలో అద్భుతంగా ఆవిష్కరించాడు అంబటి వెంకన్న. వీ రు కవిగా, గాయకుడిగా, వ్యాసకర్తగా సాహితీలోకానికి సు పరిచితులు. వాగ్గేయకారుడిగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఉద్యమకారుడు. అంబటి వెంకన్న గత సాహిత్యా న్ని పరిశీలించినా ఆయన కవిత్వ వస్తువు పూర్తిగా పల్లె జీవితమే. ప్రత్యేకించి సబ్బండ వృత్తుల జీవితాలను తన సాహిత్యంలో ఆవిష్కరించారు. ఇప్పుడు కల్లుపాటతో గీత కార్మికు ల జీవన సంస్కృతిని మన కళ్ల ముందు నిలిపారు. గ తంలో గీత వృత్తిపై అనేక పాటలు వచ్చి ఉండవచ్చు. కానీ ఇంత సుదీర్ఘమైన సవివరమైన పాట తెలుగు సాహిత్యంలో రాలేదనే చెప్పాలి. ఇది దీర్ఘ కవితను పోలిన పాట. నూట ఎనిమిది చరణాలతో శతక ప్రక్రియ సొబగులను అద్దుకున్నది.
తాళ్ళో ఎన్నియలో ఈదులో ఎన్నియలో
తాటి వనమున్న పల్లె చూడచక్కదనమల్లో… అనే పల్లవితో మొదలయ్యే ఈ పాటలో తాటి చెట్టును గరళం మింగిన శివుడు తో పోలుస్తారు. పవిత్ర గంగా జలాన్ని ప్రజలకు అందిస్తున్నదంటాడు. ఆదిమానవులు ఆహార అన్వేషణలో తాటి చెట్లపై చిలుకలు తేనెటీగలను చూసిన తర్వాత తాను కల్లు గీయడం నేర్చుకున్నాడని పాటల్లో అద్భుతమైన చరిత్రను చెప్పారు.
‘ఉట్టేటి కల్లుకు వాడు
ఊగేటి ముంతయ్యినాడు
ఎంత దారాడిన గొంతు దడువక వాడు ఎట్లనో బొట్లకు లొట్లేసి కట్టిండు‘
గెలలకు ఉట్టుతున్న కల్లుకు ఆదిమానవుడి మనసు చలించింది. దానిని కవి ఊగే ముంతతో పోల్చడం అద్భుతమైన చమత్కారం. ఇట్ల రాతి యుగంలో నుండి లోహ యుగంలోకి మారిన తర్వాత క్రమంగా కల్లు గీసే పరికరాలను తయారు చేసుకున్నడు. గీత కత్తి, కోత కత్తి, మారు కత్తి, లేత కత్తి, సిన్న కత్తి, గడ్డ కత్తి వంటి గౌడన్న పరికరాలను పరిచయం చేస్తాడు. అడవిలో సాయుధుడై సంచరిస్తున్న గౌడును వీరుడితో పోలుస్తాడు. ఏలె లక్ష్మణ్ అన్నట్లు అంబటి వెంకన్న కవిత్వంలో గొప్ప ఇమేజెస్ పాఠకుడి మనోఫలకంపై కదలాడుతాయి. గౌడన్న రూపాన్ని మన ముందు నిలిపిన విధానం చూడండి…
‘మెరిసేటి కత్తుల్లో గౌడు
ముస్తాదు గట్టిండు సూడు
ఒంటి నిండా సెమట పూలెన్నో బూయంగ ఒడుపుతోని మోకులేసేటి మొనగాడు‘ అంటూ గౌడు రూపాన్ని మనముందు నిలుపుతాడు. అడవికి గౌడ్ కు అవినాభావ సంబంధం ఉంది. ఓకే గౌడన్నను అడవితల్లికి పెద్ద బిడ్డగా అభివర్ణిస్తాడు . యజ్ఞ యాగాలు చేసే కాలంలో సకల దేవతలు సురాపానం పేరుతో కల్లును సేవించారని కల్లు గొప్పదనాన్ని ఎరుక పరుస్తారు . పోద్దాడు కల్లు, పరువు తాడు కల్లు, కర్రల కల్లు, పందాళ్ల కల్లు… ఇట్లా కాలాన్ని బట్టి కల్లు రకాలను తెలియజేస్తారు. స్నేహితులతో కలిసి తాళ్లల్ల గుగ్గిళ్ళు తింటూ కల్లు తాగిన అనుభూతులను మన ముందుంచుతారు. ‘సేదు నాదు కల్లు సెప్పకుండ తాగాలే’ ‘ఈ ఆకు రాలినా ఈతాకు రాలదు’ వంటి జన వ్యవహారంలో ఉన్న సామెతలు పాట ప్రవాహంలో అలవోకగా దొర్లుతాయి. గుబురు మీసాల వారు కళ్ళు తాగితే పీసు కూడా అవసరం లేదు అనే హాస్యస్ఫోరక మాటలు అత్యంత సహజంగా పాటలో ఇమిడిపోయాయి. కల్లులో ఫ్లోరోసిస్ వ్యాధికి విరుగుడు ఉంది అని, కానరాని వైరస్ ను కూడా కల్లు ఖతం చేస్తుంది అని అంటారు.
గ్రామాల్లో సాయంత్రం అయితే ఊరి జనమంతా తాళ్లల్లనే కనిపిస్తారు. తాటి చెట్లకు కూడా సావిత్రి జమున శ్రీదేవి జయసుధ వంటి సినిమా హీరోయిన్ల పేర్లు పెట్టి పిలుస్తుండటం గమనించవచ్చు. ఇవిగాక వంక తాడు, ఒంపుల తాడు, గడ్డమీది తాడు మొదలైన పేర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కల్లు పాటలో చూపించి పాఠకులను బాల్య స్మృతుల లోకి తీసుకు వెళ్తాడు కవి.
కల్లు పాటలో గౌడ వృత్తిదారుల సంస్కృతి ప్రతిబింబిస్తుంది. గౌడు కల్లు ఒడిసి తాడు దిగిన వెంటనే తాడు మొదలు దగ్గర భూదేవికి కల్లు ఆరబోస్తాడు. కాటమయ్య గుడి దగ్గర కల్లు ఆరబోస్తారు. ఎల్లమ్మ ముత్యాలమ్మ మారెమ్మ మైసమ్మ మొదలైన ఊర దేవతల దగ్గర కల్లు సాక పోస్తారు.
ఊరేగే దేవండ్ల కాడ
ఊదుపొగలు ఊదె కాడ
పొలిమేర దేవండ్ల కాడ
పోలుబోస్తరు కల్లుసాక
ఊరూరు సుట్టాలు ఊరంత నిండంగ వరదబారే కల్లు ఇల్లంత పండుగే
ఇది తెలంగాణా గ్రామీణ సంస్కృతి చిత్రం. ఇంతే కాదు పురుడు చేసేటప్పుడు, పెండ్లి లలో, పిల్లలు రజస్వల అయినప్పుడు, సావు మొదలైన అశుభకార్యాల్లో కూడా కల్లు సేవనం తప్పనిసరి. ఊర దేవతల పండుగలు చేసే బైండ్ల వాళ్ళు, ఒగ్గు వాళ్ళు, యక్ష గానం ఆడేవాళ్ళు, కళాకారులంతా కల్లు లేకుండా ఉండరని తన పాటలో ఆలపించారు అంబటి వెంకన్న. కల్లు చుట్టూ ఉన్న జీవితం అన్ని పార్శ్వాలను ఈ పాట స్పృశించింది. శ్రమ జీవులకు , కల్లుకు విడదీయరాని బంధం . బండలు కొట్టేవారు, బట్టలు ఉతికే వారు, చేపలు పట్టే వారు, వడ్రంగం పనిచేసేవారు, కత్తులు గొడ్డళ్ళు చేసే కమ్మరి, కుమ్మరి, బట్టలు నేసే సాలె వాళ్ళు, గొర్ల గాసే గొల్లలు, వరి కోసే వ్యవసాయ కూలీలు, నాగలి దున్నే రైతులు ఇలా సబ్బండ వర్ణాలు కల్లును ఇష్టంగా సేవించే విధానాన్ని రస స్ఫోరకంగా ఆవిష్కరించారు. తగాదా పెట్టుకున్న వాళ్లను కలిపేది కల్లు. అన్నదమ్ముల మధ్య అనురాగం పెంచేది కల్లు. బావమరదుల మధ్య అనుబంధం పెంచేది కల్లు. చుట్టం ఇంటికి వస్తే మాట దక్కించేది కల్లు. ఎంత పెద్ద పంచాయతీ అయినా కల్లుకుండ ముందు ఉంటే పరిష్కారం అవుతుంది అనే అంబటి వెంకన్న మాటలు హాస్యంగా అనిపించినా అక్షర సత్యాలు. తాటి చెట్టు మనకు ఇచ్చే మరో మధుర ఫలం ముంజలు. ఈ పాటలో ముంజల వర్ణన వాటి రుచి కంటే మధురంగా ఉన్నది. తాటి మట్టలతో బండ్లు చేసు కోవడం, తాటి గిల్లల బండ్లు చేసుకోవడం, తాటి కమ్మలతో గాలి కమ్మ చేసుకోవడం, మొదలైన ఆటలాడిన బాల్య జ్ఞాపకాలను తలపోసుకున్నాడు కవి.
ఓనీ కట్టిన పడుచు పిల్ల ఒగలు ఒలక పోసినట్లు, నగలు మెడకు వేసి నట్లు, సిగలో పువ్వులు ముడిచినట్లు, యువరాజు ఊరేగి నట్లు, నెల తప్పి ఆడే నెమలి లేత చిగురు కోరినట్లు మొదలైన అందమైన ఉపమా అలంకారాలు ఈ పాటకు మరింత శోభను కూర్చాయి. శ్రావణ మాసంలో వన వాసాలు, కాముని పున్నమి రోజులలో, కల్లు ఆ పండుగలను మరింత మధురంగా మార్చుతుంది. అంబటి వెంకన్న మాటల్లో చెప్పాలంటే తాటి చెట్టు’ బడుగుల సేదతీర్చేటి అమ్మ ’. తెలంగాణ సంస్కృతిలో తాటిచెట్టు ఇంతగా మమేకమై పోయింది అని ఈ పాట రూఢీ పరుస్తున్నది .
తాటి చెట్టు పైనుండి పడి మరణించిన వారి పట్ల ఆవేదన ఈ పాటలో కనిపిస్తుంది. తన నిండు జీవితం వెలితి అయిపోతున్నా కల్లు మాత్రం ఒలికి పోకుండా కాపాడుకుంటాడని, తాటి జగ్గలు కోసేటప్పుడు ఒంటికి గాయాలు అయినా లెక్క చేయని దృఢత్వాన్ని ప్రశంసిస్తాడు. ఆది మానవుల నుండి నేటి వరకు చరిత్రను తాళపత్ర గ్రంథంగా మనకు అందించింది తాటి చెట్టు అంటారు. సర్దార్ సర్వాయి పాపన్న యుద్ధ వ్యూహం వెనుక కల్లు తాగి పెరిగిన బుద్ధి ఉన్నదనీ అభి వర్ణిస్తాడు. ప్రభుత్వాలు నడిచింది కల్లు పైన వచ్చిన సొమ్ము తోనే అని తేల్చిచెప్తాడు. నేడు దళారుల చేతిలో మోకు ముస్తాదు వలస వెళ్లి పోతున్న దైన్య స్థితిని చూసి దుఃఖిస్తాడు. తెలంగాణ మలిదశ పోరాటంలో గౌడన్నల పాత్రను చక్కగా కీర్తించారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో ధ్వంసమవుతున్న కులవృత్తులు ఇతివృత్తంగా గొప్ప సాహిత్యమే తెలుగులో వచ్చింది. గోరేటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుందో వంటి పాట ప్రజల్ని కదిలించింది. ఆ కోవలోనిదే ఈ కల్లు పాట. దీనిని గోరేటి వెంకన్న కు అంకితమివ్వడం ఎంతో సముచితంగా ఉంది. ప్రపంచస్థాయి కార్టూనిస్టు శంకర్ బొమ్మలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. అందమైన ప్రతీకలతో సుందరమైన తెలంగాణ మాండలిక పదాలతో అలవోకగా సాగిపోయిన కల్లు పాట తెలుగు అస్తిత్వ సాహిత్యంలో ఒక మైలు రాయి వంటిది. అంబటి వెంకన్న నుండి ఇటువంటి గొప్ప సాహిత్యం మరెంతో ఆశించటం అత్యాశ కాబోదు.

– సాగర్ల సత్తయ్య
7989117415

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News