Monday, January 20, 2025

జననాయక్

- Advertisement -
- Advertisement -

‘నీ చుట్టూ సమాజం పూర్తిగా కలుషితం అయినపుడు, భావ దారిద్య్రంలోకి నెట్టబడుతున్నపుడు కూడా స్పందించకపోతే నువ్వు సామాజిక ద్రోహివే’ అంబేడ్కర్ మాటలు సామాజిక బాధ్యత గల ప్రతి పౌరుడినీ హెచ్చరిస్తూ ఉంటాయి. అజ్ఞానం, ఆకలి, అనారోగ్యం, సామాజిక అణచివేతలతో కునారిల్లుతున్న కాలంలో బీహార్ ప్రజల్ని ప్రభావితం చేసిన కర్పూరీ ఠాకూర్ భారతీయ సామాజిక నిర్మాత. బహుజన వర్గాలకు తిరుగులేని నేత. బీహార్ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న లాలూప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్, రాం విలాస్ పాశ్వాన్‌ల రాజకీయ గురువు. రాం మనోహర లోహియా, జయప్రకాష్ నారాయణల రాజకీయ వారసుడు. నీతిమంతమైన పాలన నిజాయితీతో కూడిన సేవ అందించిన దార్శనికుడు. బీహర్‌లోని సమస్తిపూర్ జిల్లాలో పితౌజియా గ్రామంలో కర్పూరీ ఠాకూర్ 1924 జనవరి 24 జన్మించారు. తండ్రి గోకుల్ ఠాకూర్ క్షౌర వృత్తిదారుడు. తల్లి రాం దులారి. నిరుపేద కుటుంబం. తన 15వ ఏట విద్యార్థిగా ఉండి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రసంగించి, అరెస్టయి రూ. 50 జరిమానా చెల్లించి ఒక రోజు జైలు జీవితం గడిపి చిన్ననాటి నుండి ధైర్యంగల చైతన్యవంతుడని నిరూపించుకున్నారు. ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యమాలు చేసి గుర్తింపు పొందారు.

తన కోసం, తన కుటుంబం కోసం జీవించడం అనే సాధారణ మధ్యతరగతి భావజాలం నుంచి బయటకు వచ్చి ప్రపంచంలోని అనేక సమస్యల మూలసూత్రాలను పరిశీలించారు. చరిత్ర, సమాజశాస్త్రం, రాజనీతి శాస్త్రాలు అధ్యయనం చేసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ భావాలపట్ల ప్రేరణ పొంది క్విట్‌ఇండియా ఉద్యమంలో పాల్గొని 24 నెలలు జైలులో ఉన్నారు. 1975లో ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి విధించ డంతో అజ్ఞాతంలో ఉండి ఉద్యమం చేశారు. 1952లో శాసనసభ లో ప్రవేశించి శాసన సభ్యుడుగా, మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడుగా, తన జీవిత కాలంలో ఓటమి ఎరుగని ప్రజా నాయకుడుగా సేవలందించారు. ప్రధాని నెహ్రూ ప్రతిపాదించిన అభివృద్ధి నమూనా ను ముందు నుంచి వ్యతిరేకించిన ఠాకూర్, భారత సమాజానికి సోషలిస్టు సిద్ధాంతమే సరియైనదని నమ్మారు. అదనపు సంపద పోగుపడిన సంపన్నుల నుండి పేదలకు సంపద, భూమి పంపిణీ జరిగే వరకు దేశానికి విముక్తి లేదని గుర్తించారు. అలాగే అంబేద్కర్ ప్రతిపాదించిన ‘కుల నిర్మూలన’ ఈ దేశానికి అత్యవసరమని భావించి పైరెండు లక్ష్యాల సాధనకోసం జీవితాంతం పోరాడిన నాయకుడు.

రెండోసారి ముఖ్యమంత్రిగా దేశంలోనే మొదటి సారి బీహార్‌లో బిసిలకు, మహిళలకు విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పించి చరిత్ర సృష్టించారు. ఇది రాష్ట్ర రాజకీయాలనే కాకుండా భారత సమాజాన్ని ప్రభావితం చేసింది. సాధారణంగా అగ్రవర్ణాలు దోపిడీ వర్గాలు గాను, బహుజనులు దోపిడీకిగురైన వర్గాలుగాను భావిస్త్తూ ఉంటారు. నిజానికి బహుజనుల్లో సైతం దోపిడీకి గురికావడంలో తీవ్రమైన అంతరాలున్నాయి. షెడ్యూల్డ్ తెగల్లో సైతం ఒకటి రెండు కులాలు మాత్రమే అభివృద్ధి చెంది మిగిలినవి విస్మరించబడుతున్నాయని గణాంకాలు ఆధారంగా, అస్తిత్వ ఉద్యమాలు ఏర్పడుతున్నాయి. 1978లోనే కర్పూరీ ఠాకూర్ ఈ వైరుధ్యం గుర్తించి బిసి రిజర్వేషన్లుతో పాటు ఎంబిసిలకు ప్రత్యేక కోటా కల్పించడంతో జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఎంబిసిలకు ప్రత్యేక కోటా నాటి బిసి నేతలు కూడా వ్యతిరేకించినా ఎంబిసి కోటా ఉండాలని శాసనం చేశాడు. ‘కర్పూరీ ఠాకూర్ ఫార్ములా’ గా ఇది ప్రసిద్ధమై, తదుపరి కాలంలో మండల్ రిజర్వేషన్ల విధానానికి ప్రేరణనిచ్చింది. బిందేశ్వరీ ప్రసాద్ మండల్ కూడా బీహార్ మాజీ ముఖ్యమంత్రి అని మరువరాదు.

ఈ విధాన నిర్ణయం వల్లనే తరువాత కాలంలో వివిధ రాష్ట్రాలలో బిసి వర్గీకరణకు దారి తీసింది. మన రాష్ట్రంలో కూడా బిసిలను ఎబిసిడిఇ అనే ఐదు ఉప వర్గాలుగా విభజించి అమలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో బిసి ఉపవర్గీకరణ కోసం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిణి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటయింది. దేశంలోనే తొలిసారిగా బిసిలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని తట్టుకోలేక అగ్రవర్ణాలవారు దళిత బహుజన వర్గాలపై దాడులు చేశారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించారు. తాను సంకల్పించిన బిసి రిజర్వేషన్లు విధానాన్ని రద్దు చేయడానికి అంగీకరించని ఠాకూర్ ముఖ్యమంత్రి పదవి వదులు కున్నారు.ఉచిత ప్రభుత్వ విద్య ఉండాలని ఫీజులు రద్దు విధానానికి పునాది వేశారు. దూర విద్యవిధానం పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలలో 10 తరగతిలో ఆంగ్ల భాష ఒక సబ్జెక్టుగా ఉండాలనే నిబంధన రద్దు చేశారు.ఫలితంగా ఆంగ్ల భాష ఒక సబ్జెక్టుగా ఐచ్ఛికమైంది. ఇది ఆంగ్ల మాధ్యమ పాఠ శాలు, ముఖ్యంగా విద్యారంగం ప్రైవేటుపరం కాకుండా నియంత్రించింది. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశారు. మనుషుల మలాన్ని నేరుగా ఎత్తిపోయడానికి ఏర్పరచుకొన్న భంగి కులస్థుల విముక్తికి ముఖ్యమంత్రిగా ఉండి ఉద్యమం చేశారు.

ఒక నాయకుడుగా సమాజంలో విలువలతో కూడిన ఆదర్శానికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం కర్పూరీ ఠాకూర్. వ్యక్తిగత ఆస్తిని వ్యతిరేకించడమే సోషలిజానికి మూలసూత్రమని నమ్మి ఆచరించిన నాయకుడు. జీవితకాలంలో తాను నివసించిన పెంకుటిల్లుకి పైకప్పు మార్చుకోలేని పేదరికం. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కుమార్తె రేణు వివాహానికి విచ్చేసిన వాజపేయి, చంద్రశేఖర్, జార్జ్ ఫెర్నాండెజ్, మధు దండావతే, జయప్రకాష్ నారాయణ వంటి జాతీయ నేతలకు విందు భోజనం పెట్టలేక తేనీరు, బిస్కెట్లతో సరిపుచ్చిన నిరాడంబరత. ఒక సమావేశంలో జార్జ్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ మా రాష్ట్రంలాగే ముఖ్యమంత్రి పరిస్థితి ఉంది. ఆయన చొక్కాకు ఎన్ని చిరుగులున్నాయో చూడండి. మీరంతా విరాళాలు ఇస్తే ఆయనకు కొత్త చొక్కాకొని ఇస్తాం’ అని చమత్కరించి, వెంటనే జోలెపట్టి విరాళాలు సేకరించడం, ఆ విరాళాలు స్వీకరించక ముఖ్యమంత్రి సహాయ నిధికి కర్పూరీ జమ చేయడం, మనకు జీవన విలువలు నేర్పిన సన్నివేశం. కుమారుడు ముఖ్యమంత్రిగా ఉండగా, తండ్రి తన క్షౌర శాలలో వృత్తిపని చేయడం ఏ సమాజంలో చూస్తాం? ఢిల్లీలో తన అధికార నివాసం నుంచి లోక్‌సభకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళే పార్లమెంటేరియన్ని ఎవరితో పోల్చుకోవాలి. ఇక్కడే ‘జననాయక్’ కర్పూరీ ఠాకూర్ జీవితాన్ని చరిత్ర విస్మరించలేకపోయింది.

ఇటువంటి జీవితాన్ని మనం ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యగారిలోనే చూడగలం. ఆచరణతో కూడిన ఆదర్శవంతమైన రాజకీయాలు నడిపించేందుకు అణగారిన వర్గాల ఆత్మగౌరవం పోరాటం ప్రజాస్వామీకరించినందుకు , శత్రుపక్షం సైతం పార్టీలను పక్కన పెట్టి గౌరవించే స్థాయికి ఎదిగారు. 64 ఏళ్ల వయసులో 1988 ఫిబ్రవరి 17న ఆయన తుదిశ్వాస విడిచారు. మరణానంతరం భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపు విడుదల చేయగా, బీహర్ ప్రభుత్వం ఆయన జన్మించిన గ్రామాన్ని ‘కర్పూరీ గ్రామ్’గా ప్రకటించింది. అనేక ప్రాంతాల్లో వైద్య కళాశాలలు, విద్యాలయాలు, మ్యూజియంలు, వివిధ రైళ్ళకు ఠాకూర్ పేరు పెట్టారు. బీహార్‌లో వున్న అన్ని జిల్లాల్లో కర్పూరీ ఠాకూర్ విగ్రహాలను ప్రభుత్వం నెలకొల్పింది. నీతినిజాయితీ, నిరాడంబరత మూర్తీభవించిన జననాయకుణ్ణి ‘భారత రత్న’గా గౌరవించాలని బీహార్‌లో ప్రజాఉద్యమం వచ్చింది. బీహార్ ప్రభుత్వం కూడా తీర్మానం చేసింది.ఇందుకు అనుగుణంగా కేంద్రం ఆయనకు భారతరత్న ప్రకటించింది. దేశమంతటా పాఠశాలల్లో కర్పూరీ ఠాకూర్ వంటి నేతల జీవిత చరిత్రలు పాఠ్యాంశాలుగా చేర్చి అధ్యయనం చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News