Wednesday, January 22, 2025

కరువును తరిమికొట్టే మల్కపేట రిజర్వాయర్

- Advertisement -
- Advertisement -

ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకప్పుడు కరువు ప్రాంతం. నేడు ఎటు చూసినా ఆకుపచ్చని చెట్లు పచ్చని పంటలు, నిండిన చెరువులు, కుంటల్లో పెరిగిన భూగర్భ జలాలు. మనందరి కళ్ళ ముందు కనబడుతున్న ప్రకృతి రమణీయ దృశ్యం.సంకల్ప సిద్ధి ఉన్న పాలకులు ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని రుజువు చేసిన అపర భగీరథ ప్రయత్నం. చరిత్ర పుటలను పరిశీలిస్తే మానవజాతి అభివృద్ధి ప్రధానంగా నది పరీవాహక ప్రాంతాల్లోనే జరిగిందని మనకు అవగతం అవుతుంది. సింధులోయ నాగరికత, నైలు నాగరికత, బాబిలోనియా నాగరికత మానవ అభివృద్ధి సూచికలకు ఉదాహరణలు. నీటి లభ్యత కారణంగా ప్రజల జీవనవిధానాలు సమూల మార్పులకు లోనవుతున్నాయని చరిత్ర ఆధారంగా తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో కరువును తరిమికొట్టి సస్యశ్యామలం చేసే దిశగా అపరభగీరథుడు సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన ప్రయత్నమే నాటి డా. బి.ఆర్ అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం, నేటి కాళేశ్వరం ప్రాజెక్టు. దీని ద్వారా 16.40 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే బృహత్తర ప్రణాళిక అమల్లోకి వచ్చింది.

నాటి ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి గురై తెలంగాణలోని అనేక ప్రాజెక్టులు నిరాదరణకు గురైతే ఉద్యమకారులే పాలకులు అయితే వారికి చిత్తశుద్ధి ఉంటే ఏ విధంగా లక్ష్యసాధన చేయవచ్చో నిరూపించారు ముఖ్యమంత్రి కెసిఆర్. నాడు మధ్య మానేరు నుండి 6 టిఎంసిల నీటిని ఎత్తిపోయడానికి జివొ ఎంఎస్ 238 తేది 17 డిసెంబర్ 2008 ద్వారా పరిపాలన అనుమతి మంజూరు చేసింది. దీని ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో కేవలం 0.35 టిఎంసిల నీటి సామర్థ్యంలో నూతన జలాశయ నిర్మాణానికి (ప్యాకేజీ 9లో భాగంగా) ప్రతిపాదన జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మెట్ట ప్రాంతం, ఇక్కడ నీటి సౌకర్యం కరువై రైతన్నలు సాగు నీటి, తాగునీటి కోసం వారి భూముల్లో ఎన్నో బోర్లు వేసిన సందర్భాలు ప్రత్యక్షంగా చూశాం. అనేక బోర్లు వేసి ఆ బోర్లు ఫెయిల్ అయి అప్పుల బాధలు భరించలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఇక్కడ పంటలు ప్రధానంగా వర్షాలు, బావులపై మాత్రమే ఆధారపడి ఉండేది. యువత ఉపాధి కోసం బొంబాయి, గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు. ఆనాడు ఈ పరిస్థితులన్నింటినీ ప్రత్యక్షంగా చూసి చెలించిపోయిన స్వర్గీయ మాజీ సిరిసిల్ల ఎంఎల్‌ఎ చేన్నమనేని రాజేశ్వరరావు ఈమెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి రైతాంగ ఉపాధి కోసం ఎత్తిపోతల పథకమే శరణ్యమని ప్రతిపాదించారు. మల్కపేట వాస్తవ్యులు, ఉమ్మడి సిరిసిల్ల ఎంఎల్‌ఎ కీర్తిశేషులు కామ్రేడ్ కర్రోళ్ల నర్సయ్య స్థానిక యువకులతో చాలా సందర్భాల్లో మాట్లాడుతూ పాలకులు మారినా ఈ ప్రాంత బతుకులు మారవని ఎత్తిపోతలు ఎప్పుడూ ఎన్నికల హామీగానే మిగులుతాయని దిగులు చెందేవారు. ఈ మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సాగునీరు ఉండాలని బలంగా కాంక్షించేవారు. ఏండ్లు గడిచిన ఆనాటి ఆంధ్ర పాలకులు ఎత్తిపోతల ప్రాజెక్టును పట్టించుకోలేదు, రైతుల కష్టాలు తీరలేదు. కరువు నివారణ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆనాడు రైతులు పడుతున్న బాధలు యువత ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టడం చూసి వారికి శాశ్వతమైన పరిష్కారం లభించాలని

మంత్రి కెటిఆర్ మల్కపేట జలాశయం సామర్ధ్యం 0.35 టిఎంసిల నుండి 3 టిఎంసిలకు పెంచాలని నీటి పారుదల శాఖకు సూచించారు.జలాశయ సామర్థ్యం 3 టిఎంసిలకు పెంచడం వల్ల ఆయకట్టు చాలా పెరుగుతుందని, తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించి కెటిఆర్ ఈ సూచనలు చేశారు. ఆయన ఆదేశాలతో మల్కపేట జలాశయం రీ ఇంజినీరింగ్‌లో భాగంగా జలాశయం సామర్ధ్యం 3 టిఎంసిలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జిఎంఆర్ టి 448 తేదీ 21 -ఏప్రిల్ -2017 ద్వారా 553.1 0 కోట్ల పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేసింది. 2017 నుండి అనేక సందర్భాల్లో ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో రివ్యూ నిర్వహించి తొందరగా ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కెటిఆర్ కృషి హర్షనీయం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 9లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న మల్కపేట్ జలాశయం జిల్లాలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట్,

ముస్తాబాద్, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట మండలాలలో దాదాపు 90,000 ఎకరాల మెట్ట భూమి ఈ రిజర్వాయర్ ద్వారా మాగాణిగా మారనుంది. భూగర్భ జలాలు పెరగడంతో పాటు వ్యవసాయరంగ అభివృద్ధి, అనుబంధ రంగాలైన మత్స్య, పారిశ్రామిక రంగం, పాడి పరిశ్రమ పర్యాటక రంగం అభివృద్ధి చెంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సాయుధ రైతాంగ పోరాట యోధుడిగా, ఎంఎల్‌ఎగా స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వరరావు ఈ ప్రాంతానికి చేసిన సేవలు మరువలేవని, ఇటీవల ఆయన శతజయంతి ఉత్సవాలు జరుపుకున్నాము.కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్-9 మల్కపేట ప్రాజెక్టుకు చెన్నమనేని రాజేశ్వరరావు పేరు పెట్టారు ముఖ్యమంత్రి కెసిఆర్. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలకు సాగునీరు అందించాలని ఎన్నో పోరాటాలు చేసిన ఘనత ఆయనది. ఈ ప్రాంతంలో సాగునీరు కోసం ఎత్తిపోతల పథకమే శరణ్యమని ఆనాడే పోరాటాలకు రూపకల్పన చేసిన దార్శనికుడు. గొప్ప వ్యక్తుల జీవితాలే చరిత్ర అంటారు కార్లైల్.

నాడు త్యాగాలు, పోరాటాలు చేసి వారి సేవల ద్వారా సమాజ మొత్తాన్ని ప్రభావితం చేసిన చెన్నమనేని రాజేశ్వరరావు పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టడంలో మననం చేసుకుంటున్నాం. మల్కపేట్ రిజర్వాయర్ పూర్తి కావడంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పీడిత ప్రజల కోసం పెత్తనందారులపై అనేక పోరాటాలు చేసిన కమ్యూనిస్టు నేత రాజేశ్వరరావు పేరు పెట్టడం వల్ల ఆయన చరిత్రలో నిలిచిపోనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News