నేను పాటలకు ప్రాణం పోసి పావురాళ్లుగా ఎగరేసిన వాణ్ణి
యాకూబ్ గురించి నేను చెప్పాలనుకున్నది ఏమైనా వుంటే అది కచ్చితంగా అదిగో ఆ వాక్యం దగ్గిరే మొదలు కావాలి. ఎందుకంటే, యాకూబ్ తో నా ఎడతెగని ప్రయాణం మొదలైన తొలిమెట్టు అదే కాబట్టి. అప్పటికి యాకూబ్ కి జీవితం ఎలా ప్రవహిస్తుందో ఇంకా తెలీదు. బహుశా వొక చీకటి ద్వారం ముందు నిలబడి, తనని తాను వెతుక్కుంటూ వున్నాడు. కాలేజీ బతుకులోని సౌందర్యమేదో అందమైన పుటగా తెరచుకుని వొక పాట దగ్గిర మమ్మల్ని కలిపింది. తాను పాటకు దూరమయ్యాయన్న బాధని తాను తరచూ వ్యక్తం చేస్తూ వుంటాడు కానీ, ఇప్పటికీ పాటలోని ప్రవాహగుణమే యాకూబ్ బతుకుదారిని సాఫీ చేస్తూ వుందని నా నమ్మకం. ఎన్ని కష్టాలు అనుభవించాడో, ఎన్ని కన్నీళ్లు దిగమింగుకున్నాడో, ఏ భుజమూ దొరకని కాలాల్లో ఎక్కడ దిగులు తలని దాచుకున్నాడో నాకు కొంత తెలుసు. బహుశా, చాలా మటుకు తెలుసు అని కూడా చెప్పగలను.
అట్లాంటి అన్ని కాలాల్లో యాకూబ్ ని నిలబెట్టింది పాటలోని ప్రవాహమే. పాట ఆసరా. పాట భరోసా. పాట తీర్చిదిద్దిన బాట. కవిత్వ వాక్యాలకు వూపిరి వూదుతున్నప్పుడు ఇప్పుడు కూడా పాటే అందులోకి నడుచుకుంటూ వస్తుంది. ప్రతి కవీ తనని తాను వొక రూపంలో వూహించుకుంటాడు. యాకూబ్ తనని తాను గాయకుడిగా చూస్తూ కవిత్వంలోకి అడుగుపెట్టి, అదే దారిన సాగిపోయాడనడానికి ప్రవహించే జ్ఞాపకం నుంచి తీగలచింత దాకా చాలా ఆధారాలు కనిపిస్తాయి. అయితే, అక్కడితోనే ఆగిపోతే అది యాకూబ్ కవిత్వం కాదు. ప్రతిసారీ ఇంకో రెండు మూడు మైళ్ళు అదనంగా పరుగెత్తి, బతుకు సూత్రాన్ని పట్టుకునే ఇంకో గట్టి ప్రయత్నం కూడా తను చేస్తాడు. అనేక ఏళ్ల సాహచర్యం వల్ల తనలోని అనేక కోణాలు నాకు తెలిసినప్పటికీ, ఈ రెండీటీ మధ్యా సమతూకాన్ని గురించి చెప్పడానికి నేను ఈ వ్యాసంలో ప్రయత్నిస్తున్నాను.
ఈ సందర్భంలో సాధారణంగా కవి తొలినాళ్ళ కవిత్వ దశ గురించి మనలో ఏర్పడి వున్న కొన్ని myth లను break చేయవచ్చు. చాలా మంది కవులు వాళ్ళ వాళ్ళ తొలి కవితల్ని గురించి టక్కున చెప్పేస్తారు. అది టక్కున చెప్పే విషయం కాదని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. ఎందుకంటే, మొదటి కవిత అని కవి claim చేసుకునేది ఎప్పుడూ మొదటి కవిత కాదని నాకు గట్టి నమ్మకమే. నా సొంత అనుభవంలోంచి కూడా అది చెప్పగలను. బహుశా, శివారెడ్డి, నగ్నముని, దేవీప్రియలాంటి కవులూ, గద్దర్, గోరటి లాంటి వాగ్గేయకారులూ, ఇప్పటి తరంలో కవుల్ని అడిగినా తొలి కవిత ఏది అనేదానికి వాళ్ళు ఇచ్చే సమాధానం సరైంది కాదనే అనుకుంటా. ఎందుకంటే, తొలి కవిత కంటే ముందే కవి పుడతాడు. ఆ పుట్టిన క్షణాలను డాక్యుమెంట్ చేసే ఆధారాలేవీ మనకు దొరకవు. అవి దొరికాయీ అనుకుంటాం కానీ, దొరికినవి నిజమైన ఆధారాలు కానే కావు.
యాకూబ్ మొదటి కవిత 1983లో ఏ ప్రజాశక్తి పత్రికలోనో అచ్చు అవడం వొకానొక documentation మాత్రమే! కానీ, అదే మొదటి కవిత అయివుండదని నేను అంటాను. ఆ కవిత కవిత రూపంలో వొదిగి, పత్రికకి పంపించేది గా మారడానికి ముందు కవి రాసి, పడేసిన లేదా పారేసిన అనేక చిత్తు కాగితాల మధ్య ఎక్కడో వుంటుంది అచ్చంగా తొలి కవిత. ఆ లెక్క ప్రకారం యాకూబ్ కవిగా ఏ 1980 ప్రాంతాల్లోనో పుట్టి వుంటాడు. తాను కవి అని తెలుసుకోవడానికి అతనికి కొంత వ్యవధి పట్టి వుంటుంది. అతను రాసేది కవిత్వమే అనుకోడానికి అతని స్నేహితులకు ఇంకాస్త వ్యవధి పట్టి వుంటుంది. వీటన్నీటి మధ్యా ఎక్కడో ప్రవాహ రూపంలో యాకూబ్ అనే కవి జన్మ సాధ్యపడి వుంటుంది.
అందుకే, యాకూబ్ కవిత్వాన్ని మనం బేరీజు వేసేటప్పుడు అతని కాల నిర్ణయాన్ని కాలెండర్ తో కాకుండా అప్పటి వామపక్ష విద్యార్థి వుద్యమాల activism అనే ఘట్టంతో మొదలుపెట్టాలి. వొకానొక మారుమూల పల్లెలో పుట్టి, ఏదో చదువుకొని, ఇంకేదో వెతుక్కుంటూ పట్నం చేరిన వలస జీవి వేదనతో మొదలుపెట్టాలి. వీటన్నీటికీ మించి, అక్షరం అనేది అచ్చంగా తాయెత్తు లాంటిదే అన్న నమ్మకాన్ని పెంచిన తొలి అడుగుల బాటలతో మొదలుపెట్టాలి. ఇవన్నీ ఈ చిన్న వ్యాసంలో సాధ్యం కాకపోవచ్చు. కానీ, వాటిని ముందుతరాల వాళ్ళు బలంగా చెప్పగలిగే కొన్ని అంశాలు మాత్రం ఇక్కడ తడిమే వీలుంది. ఎందుకంటే, తన కవిత్వంలో ఆత్మకథాత్మకతని సమర్ధంగా ప్రతిపాదించే అతితక్కువ మంది కవుల్లో నాకు తెలిసీ యాకూబ్ మొదటి వరసలో వుంటాడు. బహుశా, బలమైన ముద్ర కనబరచిన మిగిలిన ఖమ్మం కవులనుంచి అతన్ని విడిగా నిలబెట్టే లక్షణం ఇదే కావచ్చు.
2
అందరి అమ్మల్లాగే మా అమ్మకూడా /నన్ను కన్నది పురిటినొప్పులు పడుతూ / కాకపోతే / నా కుడిచేతిమీద ముద్దుపెట్టుకొని / లాలనగా నిమిరిందేమో / బహుశా,
అందుకే ఈ కవిత్వం
పల్లెరుకాయలమీంచి జొన్నకొర్రులమీంచి / నడిచినడిచి మోపులుమోసి నన్నుపెంచింది / కాబట్టే, / ఈ అక్షరాలకు ఇంత కన్నీటితడి / మా అమ్మతో నా పేగుబంధాన్ని
కొడవల్లిక్కితో బరబరా కోశారప్పుడు / అందుకేనేమో,
ఈ అక్షరాలకు ఇంత గరుకు
గొడ్లుమేపుతూ బుజ్జావు తప్పించుకున్నపుడు / ఎనకాల ఊరికి మర్లెసేది ధైర్యంగా / అందుకేనేమో,
ఈ అక్షరాన్ని మర్లేస్తూ నేను !
మొత్తం కవితని వుదహరించక తప్పలేదు ఇక్కడ! కారణం మీకు అర్థమయ్యే వుండాలి. ఇది మొత్తంగా యాకూబ్ జీవన ప్రయాణాన్ని పట్టిచ్చే కవిత. ఇందులో ఆత్మకథాత్మకత బలమైన లక్షణం అయితే, ఆ కథ వెనక నిలబడిన ధీర శక్తులని తన memory లో చెక్కే ప్రయత్నం కనిపిస్తుంది. తెలంగాణ భాషలో సదాశివ గారిలాంటి మోడల్స్ కళ్ల ముందు కనిపిస్తున్న కాలంలో అట్లాంటి మెమొరీ- యాది- వొక కవిత్వ నిర్మాణ వ్యూహం. అయితే, తెలంగాణ పల్లె కవికి యాది కేవలం యాది కాదు. అది జీవన దృక్పథాన్ని నిర్మించే వ్యూహం. యాకూబ్ కవిత్వం మొదటి సంపుటి ప్రవహించే జ్ఞాపకం అనే శీర్షికే దీన్ని బలంగా ప్రతిపాదిస్తుంది. సామాజిక రంగంలో, రాజకీయ పోరాటాల మధ్య యాదిని స్థిరీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఉదాహరణకు తెలంగాణ సాయుధ పోరాటం అనేది వొక solid memory గా స్థిరపడిపోయింది మన ఆలోచనల్లో, చరిత్రలో- స్త్రీ శక్తి సంఘటన ముందుకు వచ్చి, స్త్రీల పోరాటాన్ని కూడా సాక్ష్యంగా చూపించిన మనకు తెలియని మన చరిత్ర వెలువరించాక, ఆ యాది ఇంకొక fluid – ప్రవాహ రూపం తీసుకుంది.
యాకూబ్ తో సహా మాలో కొంతమంది 1980 లలో అట్లాంటి స్థిరీకరించబడిన యాది నుంచి ప్రవాహ సదృశమైన యాది లోకి ప్రయాణించాం. అంటే, అప్పటిదాకా బలమైన రాజకీయ నేపథ్యాన్నిచ్చిన ధోరణులని కూడా ప్రశ్నించే శక్తి పుంజుకున్న 1980 లలోకి వచ్చాం. అయితే, జీవన తాత్వికతని గుర్తించే శక్తినిచ్చిన వామపక్ష భావాలు అట్లాగే వుంచుకొని, ప్రత్యామ్నాయ దారుల్లోకి కూడా ప్రయాణించాం. అది మొదట అనుభవవాదంతోనూ, తరవాత స్త్రీవాదంతోనూ, ఆ తరవాత దళిత వాదంతోనూ, ఆ వెంటనే ముస్లిం వాదంతోనూ శక్తి పుంజుకున్న దారి. యాకూబ్ కవిత్వంలో అనుభవం ప్రధానమైన resource గా మిగిలి వుండడానికి అతను 1980 లలో ఎదుర్కొన్న అనుభవాలూ, వైయక్తిక సంఘర్షణలూ, చదువుకున్న పుస్తకాలూ, చూసిన సినిమాలూ, నడిచిన వుద్యమాల దారులూ, కలిసిన స్నేహితుల భిన్న దృక్పథాలూ ప్రవహించే జ్నాపకం document చేస్తుంది. ఆ మొదటి సంపుటిలో రెండు మౌలికమైన themes వున్నాయి: వొకటి: ప్రవాహం, రెండు: జ్నాపకం. యాకూబ్ ఆ రెండు మాటల్లో పెట్టిన శక్తి గురించి ఆలోచిస్తున్నపుడు సచ్చిదానందన్ వాక్యాలు గుర్తొస్తున్నాయి.
I am no more than an echo;
All poets are. They together build
A bridge of echoes.
It encompasses the whole earth.
Leaves, flowers, snow and moonlight
Fall on it one after another’
All the living and the non-living
Pass through that bridge,
With their reflections
Falling on the river.
బతుకు వంతెన మీద కాసేపు నిలబడి, నిన్న దాటేసిన ప్రవాహాన్నీ, రేపు దాటబోయే ప్రవాహాన్నీ అంచనా వేసుకునే reflective phase లో కవిత్వం పుడుతుంది. పైన చెప్పిన కవితలోని ప్రతి ప్రతీకా, వాటి ప్రతిధ్వనీ కవికి అనుభూతమయ్యే దశ అది. యాకూబ్ మొదటి సంపుటి నిండా నాకు అట్లాంటి అనుభూతుల సమ్మేళనమే కనిపిస్తుంది. పైన కవితలో సచ్చిదానందన్ ఇంకొక లక్షణాన్ని కూడా గుర్తిస్తారు. దాన్ని మనం సులభమైన భాషలో చెప్పాలంటే -overlapping లేదంటే వొకరకమైన interconnected history. యాకూబ్ కవిగా మొదలైన కాలంలో అనేక మార్పులు overlapping గా జరిగాయి. వాటన్నీటితోనూ సంభాషణ అతనికి అనివార్యమే అయింది. తప్పించుకునే దారి లేదు. క్యా కరూ… అని వేగుంట మోహన ప్రసాద్ వొక సందిగ్ధ సందర్భాన్ని చెప్తారే, అట్లాంటి self-doubt moments కూడా వున్నాయి. అయితే, అక్కడితో ఆగలేదు. హద్దుల్ని గుర్తించి, సరిహద్దు రేఖల్ని గుర్తించడంతో యాకూబ్ లో ఇంకొక దశ మొదలయింది.
3
అవ్వల్ కలిమా కవితతో సరిహద్దు రేఖ కవిత్వ సంపుటి మొదలు కావడం యాదృచ్ఛికం కాదు. ఈ పుస్తకానికి యాకూబ్ తను రాసుకున్న నాలుగు మాటల్లో మొదటి మాట నెరూడా memories తో మొదలవడం కూడా యాదృచ్ఛికం కాదు. ఆ ప్రవహించే మెమొరీ నుంచే మళ్ళీ సరిహద్దు రేఖల్ని కొలిచే cartographer అవుతున్నాడు యాకూబ్. కొత్త సామాజిక సందర్భాలను map గీసే పని సరిహద్దు రేఖలో ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ కేవలం యాది కాకుండా, దాని వెనక రాజకీయాలూ, సామాజిక సంఘర్షణలూ కవి ప్రపంచాన్ని విస్తృతం చేస్తూ వెళ్తాయి. ఇక్కడి నుంచి నిన్నమొన్నటి కవిత దాకా యాకూబ్ లోని నిలకడ – వస్తుపరంగానూ, శిల్పపరంగానూ- కుదురుగా కనిపిస్తూ వుంటుంది. అటుగా ఎడతెగని ప్రయాణానికి సిద్ధమవుతాడు. ఈ రెండు సంపుటాలూ యాకూబ్ లోని వైవిధ్యాన్ని చూపిస్తాయి. కవిత్వం అనేది వ్యక్తికీ, సమూహానికీ మధ్య జరిగే crossover అని ఇప్పటికీ నమ్మే నాకు ఈ మలుపుల్లోని భిన్నత్వం నచ్చింది. యాకూబ్ అట్లాంటి మలుపుల్ని కవిత్వీకరిస్తూ అంటాడు:
అక్కడొక జీవితం వుంది.జీవించిన క్షణాలున్నాయి.
నిత్యం సంఘర్షించిన సందర్భాలున్నాయి
పెంచి పోషించిన కాలం వుంది.
వెళ్ళలేక చింతిస్తున్న,దుఃఖిస్తున్న కల ఇంకా నాలోనే వుంది.
చాల చోట్లకు వెళ్ళలేక పోవడం క్షమించలేని నేరమే,
మరీ ముఖ్యంగా నదీ మూలంలాంటి ఆ యింటికి.
ఈ వాక్యాల్లో కేవలం యాకూబ్ మాత్రమే నాకు కనిపించడం లేదు. ఈ కాలాన్ని తలదాల్చి నడుస్తున్న ప్రతికవీ కనిపిస్తున్నాడు. ఆ ఇల్లు చేరుకోవాల్సిన గమ్యమే ప్రతి కవికీ!