Saturday, November 23, 2024

కొత్త సాహిత్య సిద్ధాంతం ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు

- Advertisement -
- Advertisement -

About Pracchanna vasthu Silpalu

 

‘ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు‘, సాగర్ శ్రీరామకవచం వెలువరించిన పరిశోధనాపూర్వక , విమర్శనాత్మక సిద్ధాంత గ్రంధంపై ప్రముఖ సమీక్షకుడు కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు ఓ సాహిత్య సిద్ధాంతమా? అనే ప్రశ్నతో ఓ వ్యాసాన్ని ప్రజాశక్తి ’అక్షరం’ ( 4.-1.-21 ) లో రాశాడు. అందుకు ప్రతిస్పందనగా ’ అది సిద్ధాంతమే ’ అని మంజు యనమదల ప్రజాశక్తిలో ( 18.-1.-21) చర్చకు సమాధానమిచ్చింది.
అంతేకాదు ప్రముఖ విమర్శకులు బొల్లోజు బాబా మరో దినపత్రికలో ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు ఓ నూతన సిద్ధాంతంగా పేర్కొంటూ రాశారు. దాదాపు ఎంతోమంది విమర్శకులు ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు సిద్దాంతం ఏ భాషలోనూ లేదని అంగీకరించారు.

‘శ్రీరామకవచం సాగర్ గారు ప్రతిపాదించిన ’ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు’ అనే చారిత్రాత్మకమైన భావనపై లోతైన చర్చ, పరిశోధన జరగాల్సిన అవసరం వుంది. ఆ ఎరుక సాహిత్యాభివృద్ధికి మరింత దోహదం చేస్తుంది‘ అని వెన్నెలకంటి రామారావు అభిప్రాయపడ్డాడు. ఆయనతో పాటు ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు పుస్తకంలో ముందు మాట రాసిన ప్రఖ్యాత రచయిత సలీం ‘ పాశ్చాత్య సాహితీ ‘ విమర్శలో కూడా ఎక్కడా ప్రచ్ఛన్న వస్తు శిల్పాల గురించిన ప్రస్తావన లేదు. సాగర్ గారు చేస్తున్న ఈ ప్రతిపాదన సరికొత్తది. గ్రౌండ్ బ్రేకింగ్ సిద్ధాంత ప్రతిపాదన అనడంలో సందే హం లేదు. సాహితీ క్షేత్రంలో ఈ ప్రతిపాదన ప్రకంపనలు సృష్టించడం ఖాయం అని నిర్ ద్వందంగా ప్రకటించారు.

ఈ క్రమంలోనే ప్రముఖ దినపత్రిక ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు పుస్తకంపై సాగర్ ‘పలకరింపు‘ని ( 28-12-20) ప్రకటించింది. మిత్రులు కొండ్రెడ్డి, ప్రముఖుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా; పుస్తకంలోని విషయాలపై ఆధారపడకుండా; ఎక్కువగా సాగర్ ఇంటర్వ్యూని ఆధారంగా తీసుకొని తన వ్యాసం అంతా నింపి కొన్ని ప్రశ్నలు అవగాహనా రాహిత్యంతో సంధించాడు. ఆయన ప్రశ్నలకి సమాధానంగా ఈ వ్యాసంలో క్లుప్తంగా కొన్ని జవాబులు యిస్తున్నాను.

అసలు సాహిత్య సిద్దాంతం అంటే ఎమిటి అని ముందుగా ఒక అవగాహనకి వద్దాము. సాహిత్యాన్ని చదవటానికి, రాయటానికి వుండే భావాలని, పద్ధతులని, వాటిని అర్ధం చేసుకోవటానికి, విశ్లేషించటానికి వినియోగించే మార్గాలని [ గతితార్కిక భౌతికవాద దృక్పధాన్ని అనుసరించే తీరులని ] సాహిత్య సిద్ధాంతంగా గుర్తిస్తారు. ఆ సిద్ధాంతం భాష అభివృద్ధికి దోహదం చేసి తీరాలని కూడా ఓ నియమం పెద్దలు షరతు పెట్టారు. అదేవిధంగా అర్థం చేసుకోవటానికి, విస్తృతం చేసుకోవటానికి, అమలుకి, అవగాహనకి, సదరు ప్రక్రియ ఒక సాధనంగా ఉపయోగపడాలని మనం గమనించాలి. పోతే ఆధునికానంతర వాద రచయితలు అసలు ఏ సిద్ధాంతాలు వుండవని, వాటిని సంపూర్తిగా తృణీకరించి, రద్దు చేయాలని, నమ్మమని వారు భావిస్తారు.

సత్యాన్ని వెతుక్కునే క్రమం అంతా సిద్ధాంతంగా పరిగణించాలని ప్రాచీనులు నొక్కి వక్కాణించారు. తెలుగు సాహిత్యంలో వస్తు శిల్పాల పట్ల ‘ ప్రాచీన సిద్ధాంతాన్ని వల్లె వేయటం ఏ మాత్రం అంగీకారం కాదు, యోగ్యం కాదు ‘ అని సాగర్ ప్రకటించి ప్రచ్ఛన్న వస్తు శిల్పాల అభిప్రాయాన్ని ముందుకు తీసుకువచ్చాడు. నిజానికి వస్తు శిల్పాలు ఆధునికానంతర రచనల్లో కేంద్ర స్థానాన్ని యేనాడో కోల్పోయాయి. ఆ విషయం మన కనవసరం. వస్తువు కేంద్ర స్థాన విస్ఫోటన మూలంగా శకల రూపం ధరించినట్టే, శిల్పం కూడా కేంద్ర స్థాన విస్ఫోటన మూలంగానే శకల రూపం ధరించటానికి ఉవ్వుళ్ళూరుతుంది.

ఇదంతా ప్రధాన వస్తు శిల్పాల కేంద్ర స్థాన విస్ఫోటన మూలంగా ప్రచ్ఛన్న వస్తు శిల్పాల ఆవిష్కరణ జరుగుతుంది. ఫలితంగా రచనలో గొప్ప పరిపూర్ణత సాధ్యమవుతుంది. వస్తు శిల్పాలపై నా ఈ ప్రతిపాదనని, నా ఈ సూచనని, లేదూ అభిప్రాయాన్ని విమర్శకులు అంగీకరించినా, అంగీకరించకపోయినా, ప్రతి అద్భుత రచనలోనూ ఈ వినిర్మాణ ప్రక్రియని నేను నిలబెట్టి చూపగలను.అయితే లోకం మాత్రం నా ఈ అభిప్రాయాన్ని స్వీకరిస్తుందనే నమ్మకం నాకు వుంది. (ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు – పేజి 28) అని సాగర్ శ్రీరామకవచం తన బహిరంగ వ్యాసం లో తొట్ట తొలుత ప్రకటించాడు. ( మనం దినపత్రిక 07-05-2018) . ఆ తరువాత తన అభిప్రాయ ప్రకటనకి అనుకూలంగా 19 వ్యాసాలు వివిధ పత్రికలలో యిచ్చాడు. ఆ సిద్ధాంత వ్యాసాలతో పాటు, సాగరవచనం, విభిన్న తదితర 20 వ్యాసాలు అదనంగా చేర్చి ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు పుస్తకంగా ముందుకు తెచ్చాడు. ఇదొక పరిశోధన గ్రంథం.

సాగర్ పైన నేను ఉటంకించిన అభిప్రాయ ప్రకటన చేస్తూ, దీన్ని ఓ సిద్ధాంతంగా అంగీకరించే బాధ్యతను విమర్శకులకిస్తూ; అదే సమయంలో ఇదో సిద్ధాంతంగా రాజీలేని ప్రకటన చేసి, ఏ భాషలోనూ యిలాంటి సిద్ధాంతం రాలేదని చెప్తున్నాడు. “సాగర్ గారు గొప్పవాడు అస్తిత్వవాద రచయిత, విమర్శకుడు, దార్శనికుడు. ఆయన రచనలని ఏదో ఒక చట్రంలో యిరికించి చదవకూడదు. భౌతికవాద భౌద్ధ సిద్ధాంత కర్త ఆచార్య నాగార్జునుడి శూన్యవాదం వెలుగులో మన తత్వశాస్తాలను పునర్మూల్యాంకనం చేయాలనే భావనతో వున్న కొద్దిమంది మేధావుల్లోసాగర్ గారు ఒకరు” — అని నా అభిప్రాయాన్ని ముందు మాటలో నేను వెలువరించాను.

కొండ్రెడ్డి ‘ఏది ఏమైనా ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు ఒక సాహిత్య సిద్ధాంతంగా వ్యక్తీకరించడంలో రచయిత తగిన ఆధారాలు చూపిన దాఖలాలు ఈ వ్యాసంలో కనిపించవు‘ అని తేలికగా కొట్టి పారేశాడు. సాగర్ మొదటి వ్యాసంలోనే ఆధారాలు చూపించాడు. ఆ తర్వాత సుందరకాండలో హనుమంతుడి పాత్ర వరకూ వివరాలు గుప్పించాడు. కొెండ్రెడ్డి ఆ వ్యాసాలు మరో సారి చదివితే తన ఆరోపణలు నిరాధారమని తేలిపోతాయి. నిజానికి యధాతధవాదం సాహిత్యానికి ఏ మాత్రం మేలు చేయదు. అందుకే సాగర్ మరో అడుగు ముందుకు వేసి వస్తు శిల్పాల మధ్య వైరుధ్యం వుంటుందని తన అవగాహనని స్పష్టం చేసి; ఆవంత్స సోమసుందర్‘ వస్తు శిల్పాల మధ్య వైరుధ్యాలు వుండవనే ప్రాచీన అవగాహనని కొట్టి వేశాడు, తృణీకరించాడు. (ప్ర. వ. శి పేజి 38,39). పైగా వస్తు స్వభావం నిస్వభావం అవుతుందని తెలియజేశాడు.

అంతేకాదు అందరు రచయితలకి ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు అనుభవైకవేద్యమే. ఆ సిద్ధాంతానికి నేను పేరు తగిలించాను అని స్వయంగా సాగర్ చెప్పాడు. ప్రపంచ సాహిత్య వారసత్వంగా ఈ సిద్ధాంతం తనద్వారా బైటపడిందని సాగర్ చెప్పాడు. ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు సాగర్ ప్రతిపాదించినా, దానిని మరింత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం, పరిశోధన కొనసాగించాల్సిన బాధ్యత అందరి విమర్శకుల మీద; సాహిత్య రంగంపైన వుంది. ఒక యూనివర్సిటీ నిర్వహించాల్సిన పరిశోధనని సాగర్ ఒంటిచేత్తో చేశాడు. దాన్ని మరింతగా విస్తృతం చేయడానికి కృషి చేస్తూ మరిన్ని సమీక్షలు ఈ సిద్ధాంతంపై రావాలని ఆశిస్తూ అందుకు సహకరిస్తున్న పత్రికా సంపాదకులకు అభినందనలు తెలియచేస్తూ రచయితను అభినందిస్తూ….

                                                                              ఏటూరి నాగేంద్రరావు
                                                                                7416665323

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News