Wednesday, January 22, 2025

బిల్కిస్ బాధలకు న్యాయ నాగరత్నం

- Advertisement -
- Advertisement -

పెద్ద నోట్ల ప్రవేశం, మధ్య లింగుల పెళ్ళి, కశ్మీర్ 370 అధికరణ రద్దు, అదానీ అవినీతి కేసులో సెబి విచారణ పొడిగింపు, హిండెన్ బర్గ్‌పై చర్య వంటి తీర్పులతో సుప్రీం కోర్టుకు గ్రహణం పట్టిందనిపించింది. బిల్కిస్ బానో కేసులో న్యాయమూర్తులు నాగరత్న, ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం తీర్పుతో మహిళా న్యాయమూర్తుల విలక్షణత, సుప్రీం కోర్టు నమ్మకం మరో మారు వెలిశాయి. బాబ్రీ మసీదు కూల్చివేత దశాబ్ది వేడుకలకు వెళ్ళిన 2200 మంది కర సేవకులు అయోధ్య నుండి తిరిగొస్తూ 27 ఫిబ్రవరి 2002న గోధ్రా స్టేషన్‌లో ముస్లిం అంగళ్ళను ధ్వంసం చేశారు. ఒక వ్యక్తి కిరోసిన్ క్యాన్లతో ఎస్6 పెట్టె చివరి (72) సీట్లో కూర్చున్నాడు. స్టేషన్ శివార్లలో కిరోసిన్ కుమ్మరించి నిప్పుపెట్టి దూకేశాడు. 58 ప్రయాణీకుల శవాలను ముఖ్యమంత్రి మోడీ గోధ్రా నుంచి అహ్మదాబాద్ దాకా ఊరేగించారు. దారి పొడుగునా ఉద్రేక ఉపన్యాసాలతో రెచ్చగొట్టారు. నరమేధాన్ని ప్రోత్సహించారు. మంత్రులు, పోలీసులు, అధికారులు అల్లర్లను నిర్దేశించారు.

గుజరాత్ ముస్లింలపై 3 నెలలు కాష్టం కాలింది. 2,500 ల మంది చనిపోయారు. 223 మంది కనిపించలేదు. వందలకోట్ల ఆస్తినష్టం జరిగింది. చారిత్రక సమాధులు, మసీదులు, లక్ష ఇళ్ళు, 1,100 హోటళ్ళు, 15 వేల వాణిజ్య సంస్థలు, 3 వేల తోపుడు బళ్ళు, 5 వేల వాహనాలు, 274 దర్గాలు, 241 మసీదులు, 19 గుళ్ళు, 3 చర్చీలు ధ్వంసమయాయి. విధ్వంసంలో సంఘ్ సంస్థలన్నీ పాల్గొన్నాయి. హిందు స్త్రీలు ముస్లిం అంగళ్ళను దోచుకున్నారు. 1.5 లక్ష మంది ఊర్లొదిలారు. 250 మంది బాలికలపై సామూహిక అత్యాచారం చేసి కాల్చారు. గర్భవతుల కడుపులు కోసి పిండాలను, తల్లులను చంపేశారు. విద్యుదాఘాతంతో ఇళ్ళలో వారిని కాల్చారు. స్త్రీలపై యాసిడ్ పోశారు. మర్మాంగాల్లో వస్తువులు దూర్చారు. వక్షోజాలు కోశారు. కేంద్రంలో బిజెపి అధికారానికి రాగానే నిఘా విభాగాలు, దర్యాప్తు సంస్థలపై వత్తిడితో తారుమారు నిర్ణయాలు చేయించారు. 2014 డిసెంబర్‌లో సిబిఐ స్పెషల్ కోర్టు అమిత్ షా, మోడీలను వదిలేసింది.

దాడుల నుంచి తప్పించుకోడానికి 3 మార్చి 2002న అహ్మదాబాద్ దగ్గరి రంధిక్ పుర్ గ్రామం నుండి పారిపోతున్న వారిలో 5 నెల్ల గర్భవతి, 19ఏళ్ళ బిల్కిస్ బానో ఉన్నారు. గర్భవతినని చెప్పినా 20 మంది హిందు మతోగ్రవాదులు ఆమెను సామూహిక అత్యాచారం చేశారు. ఆమె మూడేళ్ళ బిడ్డను నేలకు బాది చంపారు. 14 మంది బానో కుటుంబ సభ్యులను చంపేశారు. నలుగురు బానో బంధువులను, తల్లి, చెల్లిని సామూహిక అత్యాచారం చేసి చంపారు. బతికిన ఆమె భర్త, బానో సంఘీయులకు భయపడి బాలింత పిల్లిలా 20 ఊర్లు మారారు. మానవ హక్కుల సంఘం కార్యకర్తలు బానోకు బాసటగా నిలిచారు. మోడీ అధీన గుజరాత్, కేంద్ర ప్రభుత్వాలు ఈ మద్దతుదార్లపై కక్ష, ప్రతీకార చర్యలకు పాల్పడ్డాయి. గుజరాత్‌లో న్యాయం జరగదని విచారణను ముంబైకి మార్పించుకున్నారు బానో. ముంబయి ట్రయల్ కోర్టు 2008 లో 8 మంది నిందితులను నిర్దోషులుగా వదిలేసింది. ఒక ముద్దాయి విచారణ సమయంలోనే చనిపోయాడు.

11 మందికి జీవిత ఖైదు విధించింది. 2017లో బాంబే హైకోర్టు ఈ శిక్షను ధ్రువీకరించింది. న్యాయమూర్తి ఆర్ భానుమతి రాసిన బానో కేసు 23 ఏప్రిల్ 2019 సుప్రీం కోర్టు తీర్పులో మాతృ మహిళా హృదయం ద్రవించింది. బానోకు రూ. 50 లక్షల పరిహారం, ఇల్లు, ఉద్యోగం ఇమ్మని కోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనేక అర్జీల తర్వాత గుజరాత్ ప్రభుత్వం బానోకు డబ్బు ఇచ్చింది. ఇతర పరిహారాలు ఇవ్వలేదు. మైనారిటీల మారణ హోమం హిట్లర్ నీతి. ఇదే గుజరాత్ నమూనా. మెజారిటీ మతస్థుల సమీకరణ, ఓటు బ్యాంకుగా మార్చు సంఘ్ పాలకుల లక్ష్యాలు.
బిల్కిస్ బానో కేసులో ముద్దాయి రాధే శ్యామ్ భగవాన్ దాస్ షా తనను ముందుగా వదిలిపెట్టమని అడిగారు. ఈ అభ్యర్థనను విచారించమని మహారాష్ట్ర గృహ మంత్రిత్వ శాఖ సిబిఐని, సిబిఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. జనవరి 2020లో అవి ఈ షా అభ్యర్థనను తోసిపుచ్చాయి. అయితే (నేటి విశ్రాంత) న్యాయమూర్తి అజయ్ రస్తోగి సుప్రీం కోర్టు ధర్మాసనం, సుప్రీం కోర్టు 2014 తీర్పుకు వ్యతిరేకంగా, షా అభ్యర్థనను పరిశీలించమని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరింది.

రద్దయిన 1992 గుజరాత్ ప్రభుత్వ ఉపశమన నియమాల ప్రకారం 11 మంది ముద్దాయిలను సత్ప్రవర్తన కారణంతో విడిచిపెట్టమని 10 ఆగస్టు 2022 న గుజరాత్ ప్రభుత్వం సిఫారసు చేసింది. శిక్షా కాలంలో ఈ ముద్దాయిలు పెరోల్ కింద బయటే తిరిగారు.గుజరాత్ ప్రభుత్వ సిఫారసుతో 75 ఏళ్ల భారత స్వాతంత్య్ర అమృతకాల కానుకగా 15 ఆగస్టు 2022 న వారిని వదిలేశారు.ముద్దాయిలను బిజెపి నాయకులు సత్కరించారు. విజయోత్సవాలు జరిపారు. సుసంస్కార బ్రాహ్మణులయిన ఈ 11 మంది నేరం చేసేవారు కాదని కితాబిచ్చారు. 2014 సుప్రీం కోర్టు ఉపశమన విధానం ఇద్దరి కంటే ఎక్కువ మందిని చంపిన, సామూహిక అత్యాచార హత్యల ముద్దాయిలకు ఉపశమనాన్ని నిషేధించింది. ఉపశమనానికి కనీస శిక్షాకాలాన్ని 14 ఏళ్ల నుండి 28 ఏళ్ళకు పెంచింది. జీవిత ఖైదీల విడుదలను విడిగా పరిగణించాలి. గంపగుత్తగా తీసుకోరాదు. ఇక్కడ షా అభ్యర్థన ఫలితంతో మొత్తం 11 మందిని వదిలారు.

ముద్దాయిల మానవత్వ దృక్పథం, రాజ్యాంగం, చట్టాలకు లోబడిన ప్రవర్తన, సామాజిక కట్టుబాట్ల పాటింపు, సంస్కరణ ఉపశమన విధానానికి హేతుబద్ద కొలమానాలు. హత్యలు, మానభంగాలు అమానవీయాలు. ఉపశమనానికి అనర్హాలు. ఈ 11 మంది ముద్దాయిలలో ఈ లక్షణాలేవీ లేవు. విడుదల తర్వాత పాత అలవాట్లను, పద్ధతులను పాటిస్తూ బిజెపి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజలను అవమానించిన, పౌరులు నిరసించిన ముద్దాయిల విడుదలను ప్రశ్నిస్తూ బిల్కిస్ బానో తిరిగి సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేశారు.ఆజాద్ హింద్ ఫౌజ్ కెప్టన్ కీ.శే. లక్ష్మి సెహగల్ కుమార్తె సుభాషిణి అలి, లక్నో విశ్వవిద్యాలయ పూర్వ కులపతి ఆచార్య రూపరేఖా వర్మ, పాత్రికేయురాలు రేవతి లాల్, పార్లమెంటు సభ్యురాలు మహువా మొయిత్ర ఈ కేసులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. 8 జనవరి 2024న న్యాయమూర్తులు నాగరత్న, ఉజ్జల భూయాన్‌ల సుప్రీం కోర్టు ధర్మాసనం అత్యాచార హంతక ముద్దాయిలను విడిపించిన గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. 2 వారాల్లో 11 మంది ముద్దాయిలు జైలు అధికారులకు లొంగిపోవాలని ఆదేశించింది.

శిక్షపడింది బాంబే హైకోర్టులో. మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ కేసులో సిఫారసు చేసే అవకాశం ఉంటుంది కాని గుజరాత్ ప్రభుత్వానికి లేదంది. ఈ తీర్పును రాసిన న్యాయమూర్తి నాగరత్న న్యాయ విచక్షణ, మహిళా సమానత దృక్పథం మరోమారు ప్రపంచానికి తెలిశాయి. ముద్దాయిలు మరలా మహారాష్ట్ర ప్రభుత్వ తలుపు తట్టవచ్చు. బిజెపి ఆధీన మహారాష్ట్ర ప్రభుత్వం తమ పాత నిర్ణయానికి కట్టుబడుతుందా, 2014 ఉపశమన నియమాలతో మానవత్వాన్ని ప్రదర్శిస్తుందా, న్యాయ వ్యవస్థ నమ్మకాన్ని పెంచుతుందా? అన్నీ అనుమానాలే. బానోతో సహా మానవ హక్కుల కార్యకర్తల ఆనందం ఆవిరికావచ్చు. అధికారం దుర్వినియోగం కారాదు. దోపిడీ, ఆక్రమణ, అన్యాయం, ఆశ్రిత పక్షపాతాలకు పాల్పడరాదు. కొందరు మతస్థులను ఇతరులుగా చూడరాదు. ప్రభుత్వాల లక్ష్యం ప్రజాశ్రేయస్సు, రాజ్యాంగ ఆచరణ. కోర్టుల పరిధి రాజ్యాంగం. ఇవి రెండు పౌరులలో క్రమశిక్షణ, మానవత్వం నింపాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News