Thursday, January 23, 2025

ప్రపంచ ప్రఖ్యాత నైరూప్య చిత్రకారుడు

- Advertisement -
- Advertisement -

డా. ఎస్‌వి రామారావు పరిచయం అక్కరలేని ప్రపంచ ప్రఖ్యాత నైరూప్య చిత్రకారుడు. ఆధునిక చిత్రకళలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మన తెలుగువాడు. నైరూప్య చిత్రకళలో సంపూర్ణత్వాన్ని సాధించారు. నవ్యచిత్రకారుడే కాకుండా, కళావిమర్శకుడు, వ్యాస రచయిత, కవిత్వంలో కూడా చేయితిరిగిన దిట్ట ఎస్‌వి. తైలవర్ణంలో ఆయన గీసిన అద్వితీయమైన చిత్రాలు ఓ సంచలనం. రంగులు, ఆ రంగుల గీతల భాష తెలిసిన మేధావి. దానికితోడు పుస్తకపఠనంతో మేధోశక్తిని పొందారు. తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. వివిధ సంస్కృతులను ఆకళింపు చేసుకున్నారు. వీటన్నిటి మేళవింపుతో రూపొందించినందునే ఎస్‌వి చిత్రాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. ఆయన మద్రాస్‌లో ఉన్న సమయంలో భారతి, మురళి, ఆంధ్ర మహిళ, ఆంధ్ర పత్రిక వంటి పత్రికలకు చిత్రకళతోపాటు వివిధ అంశాలపై వ్యాసా లు రాసేవారు. ఎస్‌వి రామారావు 1936లో కృష్ణా జిల్లా గుడివాడలో శిరందాసు గంగయ్య, లక్ష్మయ్యలకు జన్మించారు. ఆయన పూర్తి పేరు శిరందాసు వెంకట రామారావు. 12 ఏళ్ల వయసులోనే ఆయనకు చిత్రకళపై ఆసక్తి పెరిగింది.

దానికి తోడు ఆ వయసులోనే ఆయనకు గుడివాడలోనే ప్రముఖ చిత్రకారుడు కె.వేణుగోపాల్ గురువుగా దొరికారు. ఆయన ప్రోత్సాహంతో చిత్రకళలో మెళకువలు తెలుసుకున్నారు. చిత్రాలు గీయడం పట్ల ఆసక్తిని పెంచుకున్న ఎస్‌విని చూసి తండ్రి ఆందోళన చెందారు. తండ్రి కోరిక మేరకు 1954లో బికాం పూర్తి చేశారు. చరిత్రపై ఆసక్తితో బిఎ డిగ్రీ పూర్తిచేశారు. 1955 నాటికి చిత్రకళలో నాలుగు డిప్లొమాలు సంపాదించారు. కలకత్తాలోని శాంతినికేతన్‌లో శిక్షణ పొందాలనుకున్నారు గానీ, అది సాధ్యం కాలేదు. చిత్రకళపట్ల కుమారుని ఆసక్తిని గమనించిన ఆయన తండ్రి గంగయ్య చివరకు మద్రాస్‌లోని ఓ సినిమా సంస్థలో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా చేర్పించారు.సినిమా ఆర్ట్ డైరెక్టర్ మాధవపెద్ది గోఖలే సలహాతో 6 ఏళ్ల గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్ ఫైన్ ఆర్ట్ కోర్సు ఎంట్రన్స్ రాశారు. ఆ పరీక్షలో ఎస్వీ ప్రతిభను గుర్తించిన ఆ కళాశాల ప్రిన్సిపాల్ అతన్ని నేరుగా మూడవ సంవత్సరంలోకి ప్రవేశం కల్పించారు. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు పికాసో, డాలి వంటి వారి చిత్రాల సరసన ఎస్‌వి రామారావు చిత్రాలకు స్థానం లభించింది.

1965లో కామన్ వెల్త్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ‘ఆ ఏడాది మేటి చిత్రకారుడు’ వంటి అంతర్జాతీయ అవార్డులు, 2001లో పద్మశ్రీ వంటి జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత అనేక దేశాలలో పర్యటించారు. తన చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆయన వెయ్యికి పైగా చిత్రాలు గీశారు. అమెరికాలోని ఒహాయో రాష్ట్రం సిన్సనాటిలో యూనివర్సిటీ ఆఫ్ సిన్సనాటిలో టీచింగ్ అసిస్టెంట్‌గా పని చేశారు. కెంటకీ రాష్ట్రం బౌలింగ్ గ్రీన్‌లోని వెస్ట్రన్ కెంటకీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆఫ్ ఆర్ట్‌గా చేసి పదవీ విరమణ చేశారు. పుస్తకాలు చదవడానికి అలవాటుపడిన ఆయన చిత్రకారుడైనా లైబ్రరీ సైన్స్‌పై మక్కువతో టెన్నెసీ రాష్ట్రం నేషవిల్ సిటీలోని వేండర్ బిల్ట్ యూనివర్సిటీలో లైబ్రరీ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. 1980 నుంచి చికాగోలోనే ఉంటున్నారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం 5 నిమిషాలు మాత్రమే అపాయింట్‌మెంట్ ఇచ్చి, ఆయనతో ఆ కొద్ది సమయం మాట్లాడిన తర్వాత ఆ రోజంతా తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఆయనతోనే గడిపారు. చిత్రకళ ద్వారా తెలుగు ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన ఎస్‌వి రామారావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్‌ఆర్ జీవిత సాఫల్య పురస్కారం -2023కు ఎంపిక చేసింది. నవంబరు 1న విజయవాడలో ఆయనకు ఈ అవార్డు అందజేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News