అబూధాబి: ఇతర గల్ఫ్ దేశాల వలే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఇస్లామీయ షరీయత్ సిద్ధాంతాల ప్రకారం వివాహాలు, విడాకులు పర్యవేక్షిస్తుంటుంది. కానీ ఇప్పుడు తాజాగా కొత్త చట్టం ప్రకారం ముస్లిమేతరులు కూడా వివాహం, విడాకులు వంటివి అక్కడ పొందవచ్చు. పిల్లల ఉమ్మడి కస్టడీని కూడా పొందవచ్చు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాలకుడు,ఏడు ఎమిరేట్ల సమాఖ్యకు అధ్యక్షుడు కూడా అయిన షేఖ్ ఖలీఫా బిన్ జాయెద్ అల్-నహ్యాన్ ఈ మేరకు ఆదివారం డిక్రీని ఇచ్చారు. ఈ విషయాన్ని అక్కడి డబ్లుఎఎం వార్తా సంస్థ తెలిపింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తెచ్చిన ఈ కొత్త చట్టం ధ్యేయం “ ప్రతిభ, నైపుణ్యం ఉన్న వారికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గమ్యం కావాలన్నది. ప్రతిభ, నైపుణ్యాలను ఇతర ప్రపంచ దేశాలతో పోటీపడి ఎక్కువగా ఆకర్షించాలన్న లక్షంతోనే” అని ఆ వార్తా సంస్థ వివరణ ఇచ్చింది. ఇక ముస్లిమేతరుల కుటుంబ విషయాలను పరిష్కరించడానికి ఓ కొత్త కోర్టును ఏర్పాటు చేస్తారు. అది ఇంగ్లీషు, అరబీ భాషలలో పనిచేస్తుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గత ఏడాది ఫెడరల్ స్థాయిలో అనేక న్యాయపరమైన మార్పులు తెచ్చింది. వాటిలో వివాహానికి ముందే లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, ఆల్కాహాల్ సేవనం వంటివి డీక్రిమినలైజ్ చేసింది. అలాగే పరువు హత్యల విషయంలో వైఖరిని మార్చుకుంది. ఈ సంస్కరణలతోపాటు, దీర్ఘకాలిక వీసాలు కూడా ప్రవేశపెట్టింది. విదేశీ పెట్టుబడి, పర్యాటక రంగం, ఎక్కువ కాలం అక్కడే నివసించేందుకు అనుమతి వంటి అనేక ఆకరణీయ చర్యలు చేపట్టింది. అబూధాబి ప్రపంచ దేశాల సరసన ఓ కమర్షియల్ హబ్ గా ఏర్పడేందుకు పోటీపడనుంది.