మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో 2021 మార్చిలో ఎసిబి తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ సీనియర్ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు మంగళవారం నాడు ఎపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరికరాల కొనుగోలు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుచేసింది లేదని, ఒక్క పైసా ఎవరికి చెల్లించలేదన్నారు. ఎపి విజిలెన్స్ కమిషన్ ఆమోదం పొందకుండా సాధారణ విచారణ జరిపి తనపై కేసు పెట్టారన్నారు. తప్పుడు ఆరోపణలతో నమోదు చేసిన ఈ కేసును రద్దు చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంలో తుది నిర్ణయం వెల్లడించే వరకు ఎఫ్‌ఐఆర్ ఆధారంగా చేపట్టే తదుపరి చర్యలను నిలువరించాలని కోరారు. భద్రత పరికరాల కొనుగోలు నిర్ణయంలో తన పాత్ర లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన వల్ల ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదన్నారు. సేవలందించినందుకు తన వద్ద ఉంచుకున్న రూ.10 లక్షలను ఎస్‌టిసిఐఎల్ (స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంస్థ వెనక్కి ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.