Thursday, January 23, 2025

ఏసిబి అధికారులకు పట్టుబడ్డ ఆర్‌డబ్లుఎస్ డిఈ

- Advertisement -
- Advertisement -

తాండూరు : తాండూరు ప్రభుత్వ కార్యాలయాలపై ఏసిబి అధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వం ద్వారా వేలాదిగా వేతనాలు వస్తున్నప్పటికి అధికారుల ఆశలకు హద్దులు లేకుండా పోతున్నాయి. అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడుతుండటంతో బాధితులు ఏసిబి అధికారులను ఆశ్రయించక తప్పడం లేదు. తాండూరు డివిజన్ పరిధిలో ప్రతి ఏడాది ఒకరిద్దరు ఏసిబి అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా డిసెంబరు నెలలో తాండూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ రిజిస్ట్రార్ జమీరుద్దిన్ ఏసిబి అధికారులకు పట్టుబడ్డారు. గతంలో తాండూరు మండల రెవిన్యూ కార్యాలయంలో ఇద్దరు ఆర్‌ఐలు ఏసిబి అధికారులకు పట్టుబడ్డారు.

ఆ తరువాత పెద్దేముల్ మండలం ఎండిఓపై ఏసిబి అధికారులు దాడులు జరిపి రెడ్‌హండెడ్‌గా పట్టుకున్నారు. యాలాలలో నాలుగేళ్ల క్రితం తహాశీల్దారు చిన్నప్పలనాయుడు ఇసుక వ్యాపారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డారు. గత రెండేళ్ల క్రితం తాండూరు ఆర్‌డబ్లుఎస్ డిఈ శ్రీనివాస్‌ను ఏసిబి అధికారులు రెడ్‌హండెడ్‌గా పట్టుకున్నారు. గత సంవత్సరం జనవరి నెలలో తాండూరులోని విద్యుత్ కార్యాలయంపై ఏసిబి అధికారులు దాడులు నిర్వహించగా కంప్యూటర్ ఆపరేటర్ పట్టుబడ్డాడు. అదే విధంగా సెప్టెంబరు 30న తాండూరులోని పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న యాలాల ఏఈ మధు రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డారు. ఇలా ప్రతి సంవత్సరం తాండూరులో ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నారు.

పట్టణంలో, గ్రామాల్లో అభివృద్ది పనులు కొనసాగుతుండగా చేపట్టిన పనులకు గ్రామ కార్యదర్శులు, ఇంజనీయరింగ్ శాఖ అధికారులు కమీషన్లకు అలవాటు పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కమీషన్లు ఇవ్వనిదే ఫైల్స్ ముందుకు కదలడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అప్పులు చేసి పనులను చేపడుతుంటే అధికారులు కమీషన్లు వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే చేసిన పనులకు ఎప్పటికపుడు రికార్డులు చేయాల్సిన అధికారులు కమీషన్లకు అలవాటు పడి కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అధికారుల బాధ పట్టించుకోలేక చివరకు బాధితులు ఏసిబి అధికారులను ఆశ్రయించక తప్పడం లేదు. తాండూరులో ప్రతి ఏడాదికి ఒకరిద్దరు లంచం తీసుకుంటూ అధికారులకు దొరికపోతున్నప్పటికి మిగితా అధికారుల్లో భయం కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News