అమ్ ఆద్మీపార్టీ నేత, గతంలో పబ్లిక్ వర్క్స్ శాఖమంత్రి సత్యేంద్ర జైన్ పై అవినీతి నిరోధక శాఖ లంచానికి పాల్పడ్డారని కేసు పెట్టింది. రూ. 571 కోట్ల రూపాయల సిసిటివి కెమెరాల ప్రాజెక్టు కేసులో సత్యేంద్ర జైన్ అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది. ఢిల్లీ వ్యాప్తంగా సిసిటివి కెమెరాల ఏర్పాటులో జాప్యం చేసినందుకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కు విధించిన రూ. 16 కోట్ల రూపాయల జరిమానాను సత్యేంద్ర జైన్ రద్దు చేశారని,అందుకు బదులుగా ఏడు కోట్ల రూపాయలు లంచం అందుకున్నారని, ఆవిధంగా ఆయన కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్గించారని కేసు నమోదయింది.
అవినీతి నిరోధకచట్టం సెక్షన్ 7, సెక్షన్ 13(1) (ఏ) కింద , ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120(బి) కింద క్రిమినల్ కుట్రకు పాల్పడినట్లు ఎఫ్ ఐ ఆర్ దాఖలైంది. ఏసీబీ జాయింట్ కమిషనర్ మాధుర్ వర్మ ఈ విషయాన్ని వెల్లడించారు.సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయడంలో జరిగిన జాప్యానికి బిఇఎల్ కు 16 కోట్ల రూపాయల జరిమానాను రద్దు చేసినందుకు ఆయనకు రూ.7 కోట్లు లంచంగా అందిందని అన్నారు. ప్రాజెక్టులో విపరీతమైన జాప్యం జరిగినా,అదనంగా మరో లక్షా 40 వేల సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్ట్ ను పొడిగించారని ఏసీబీ పేర్కొంది.ఈ స్కామ్ వెనుక ప్రధాన సూత్రధారి సత్యేంద జైన్ అని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ సచ్ దేవ ఆరోపించారు.