సిటిబ్యూరోః కానిస్టుబుల్‌ను లంచం తీసుకోమని చెప్పిన మియాపూర్ ఎస్సై ఇంకా పరారీలోనే ఉన్నాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న యాదగిరిరావు కేసు దర్యాప్తు విషయంలో ఎపిలోని విశాపట్టణానికి వెళ్లాడు. అదే సమయంలో స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డిని ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి రూ.20,000 లంచం తీసుకోవాలని చెప్పాడు. ఓ వ్యాపారి కేసు విషయంలో ఎస్సై యాదగిరి రావు డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు.
Also Read: ఆర్టీసీ బస్సు ఢీకొని మత్స్యకారుడు మృతి
వారి సూచనల మేరకు బాధితుడు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డికి డబ్బులు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఎస్సై యాదగిరి రావు సూచనల మేరకు డబ్బులు తీసుకున్నానని హెడ్ కానిస్టేబుల్ చెప్పడంతో ఎస్సైపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన ఎస్సై యాదగిరి రావు విశాఖపట్టణం నుంచి పరారయ్యాడు. ఎసిబి కేసును మాఫీ చేయించుకునేందుకు యాదగిరి రావు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.