Sunday, December 22, 2024

ఎసిబి వలలో ఇద్దరు విద్యుత్ అధికారులు

- Advertisement -
- Advertisement -

ACB caught Two electrical officers

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ సర్కిల్‌లోని సనత్‌నగర్ ఎఇ అవినాష్, లైన్ ఇన్స్‌స్పెక్టర్ కృపానందరెడ్డిలు రూ. 10 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం నాడు ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే..కూకట్‌పల్లిలోని ప్రగతినగర్‌కు చెందిన భాస్కర్‌రెడ్డి అనే ప్రైవేట్ కాంట్రాక్టర్ 20 విద్యుత్ మీటర్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఈక్రమంలో విద్యుత్ మీటర్లు ఇచ్చేందుకు సనత్ నగర్ ఎఇ అవినాష్ రూ. 25 వేలు, లైన్ ఇన్స్పెక్టర్ కృపానందరెడ్డి రూ. 7,500 లంచం డిమాండ్ చేశారు. విద్యుత్ మీటర్ల కోసం ఎఇ అవినాష్‌కు రూ. 15 వేలు, లైన్ ఇన్సెక్టర్ కృపానంద్‌కు రూ. 3,500 నగదును కాంటాక్ట్రర్ భాస్కర్‌రెడ్డి ముట్టజెప్పారు. అనంతరం ఎఇ, లైన్‌ఇన్సెక్టర్‌లు భాస్కర్‌రెడ్డికి మొత్తం 20 విద్యుత్ మీటర్లకు గాను 5 మీటర్లు మాత్రమే మంజూరు చేశారు.

ఈ నేపథ్యంలో లంచం మొత్తాలలో మిగిలిన డబ్బులిస్తేనే మరో 15 మీటర్లు మంజూరు చేస్తామని సదరు విద్యుత్ అధికారులు కాంట్రాక్టర్ భాస్కర్‌రెడ్డికి తేల్చిచెప్పారు. విద్యుత్ అధికారులు తీరుపై కాంట్రాక్టర్ భాస్కర్‌రెడ్డి ఎసిబి అధికారులను ఆశ్రయించి లంచం డిమాండ్ చేసిన అధికారులపై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు మంగళవారం నాడు కాంట్రాక్టర్ భాస్కర్‌రెడ్డి నుంచి రూ. 10 వేలు ఎఇ అవినాష్, లైన్ ఇన్స్‌స్పెక్టర్ కృపానందరెడ్డిలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటు పట్టుబడిన ఎఇ అవినాష్, లైన్ ఇన్స్‌స్పెక్టర్ కృపానందరెడ్డిల చేతి వేళ్లకు కెమికల్ పరీక్షలు నిర్వహించిన ఎసిబి అధికారులు నిందితులను ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. ఎసిబికి పట్టుబడిన ఇద్దరు అధికారులకు ఎసిబి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News