Thursday, January 9, 2025

నాసిరకం తిండి.. పరిశుభ్రత లేదండి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పది ప్రభుత్వ వసతి గృహాలలో ఎసిబి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంగా వివిధ చోట్ల హాస్టల్‌లో వేర్వేరుగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలలో విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ బిసి సంక్షేమ వసతి గృహంలో తనిఖీలు చేయగా అక్కడి దుస్థితి బయటపడింది. ఎసిబితో సహా ఆహార భద్రత, శానిటరీ, ఆడిట్ అధికారులు వసతి గృహంలో తనిఖీలు చేపట్టారు. విద్యార్థులకు అందించే ఆహారం అపరిశుభ్ర వాతావరణంలో వండుతున్నారని, వంట సరుకులు సైతం వండే పరిస్థితిల్లో లేవవి నాసిరకంగా ఉన్నాయని ఎసిబి డిఎస్‌పి కృష్ణగౌడ్ వెల్లడించారు. మెనూ ప్రకారం భోజనం వండటం లేదని, విద్యార్ధులకు అందాల్సిన స్వీట్లు, అరటి పండు, కోడి గుడ్లు కూడా అందించడంలేదని తెలిపారు. హాస్టల్ పరిసర ప్రాంతమంతా శుభ్రంగా లేదని, మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా చాలారోజులుగా శుభ్రపరచుకుండా ఉంచినట్లు వివరించారు. రిజిస్టర్‌లో 120 మంది విద్యార్ధులు ఉన్నట్లుగా నమోదు చేసినా వాస్తవంగా అక్కడ 80 మంది విద్యార్ధులు మాత్రమే ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.

ఉదయం 6 గంటల తర్వాత తనిఖీలు జరిగిన సమయంలో వార్డెన్ కూడా అందుబాటులో లేరని, ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నారని చెప్పారు. జిల్లా కేంద్రంలోని బిసి సంక్షేమ శాఖ అధికారులను పిలిపించి విచారణ జరిపామని తెలిపారు.ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్ ఐటిడిఎ పరిధిలోని గురుకుల పాఠశాలలో ఎసిబి డిఎస్‌పి రమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ఈ గురుకులాల్లో 680 విద్యార్థులు ఉండగా పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో డిఎస్‌పి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల విద్యుత్ తీగల ప్రమాదకరంగా ఉన్నాయని, విద్యార్థులు ఉంటున్న గదుల బాత్రూంలకు తలుపులు కూడా సరిగా లేవని అసహనం వ్యక్తం చేశారు. అలాగే హైదరాబాద్ ప్రభుత్వ వసతి గృహాల్లోనూ ఎసిబి అధికారులు తెల్లవారుజాము నుంచి ఏకకాలంగా సోదాలు నిర్వహించారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలతో పాటు వసతి గృహాలలో మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. తనిఖీల్లో దాదాపు ప్రతి హాస్టల్‌లోనూ కాలం చెల్లిన ఆహార పదార్థాలు వినియోగిస్తునట్లు అధికారులు గుర్తించారు.

వసతిగృహాల్లోని బాత్రూంలు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయని, ఫుడ్‌మెనూ పాటించడం లేదని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో మంగళవారం ఉదయం నుంచి ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. హాస్టల్లో విద్యార్థులకు అందజేస్తున్న ప్రభుత్వ ప్రయోజనాలను పరిశీలించారు. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎసిబి తనిఖీలు నిర్వహించారు. గురుకులాలు, హాస్టళ్లలో సోదాలు చేశారు. మెస్, స్టూడెంట్స్ రిజిస్టర్‌లను స్వాధీనం చేసుకున్నారు. రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా అధికారులు పరిశీలిస్తున్నారు. పలు హాస్టల్ స్టూడెంట్స్ రిజిస్టర్‌లలో ఎక్కువమంది విద్యార్థులు ఉన్నట్టు వార్డెన్‌లు నమోదు చేశారు. ఎక్కువ మంది ఉన్నట్టు చూపి అధిక మెస్ బిల్లులు తీసుకుంటున్నట్టు చేస్తున్నట్టు గుర్తించారు. కొంతమంది హాస్టల్ సిబ్బందిని అదుపులోకి తిసుకుని విచారిస్తున్నారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా డిఎస్‌పి ఉదయ రెడ్డి ఆధ్వర్యంలో ఎసిబి తనిఖీలు నిర్వహించారు. సిరిసిల్ల పట్టణం పెద్దూర్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఎసిబి అధికారుల ఆకస్మిక తనిఖీలు చేపట్టి పలు రికార్డులను పరిశీలించారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని ఎస్‌సి,బిసి హాస్టళ్లలో ఎసిబి డిఎస్‌సి జగదీశ్ చంద్ర ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News