Monday, December 23, 2024

అవినీతి అనకొండ శివబాలకృష్ణ @250 కోట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అవినీతి అనకొండ శివబాలకృష్ణ ఎసిబి అధికారుల విచారణలో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూశాయి. ఎసిబి అధికారులే విస్తుపోయే రీతిలో అక్రమాస్తుల చిట్టా బహిర్గతమైంది. ఎనిమిది రోజుల కస్టడీలో భాగంగా తొలి నాలుగు రోజులు సరైన సమాధానం చెప్పని శివబాలకృష్ణ అనంతర విచారణలో అనేకానేక ఆసక్తికర విషయాలను ఎసిబి అధికారుల వద్ద వెల్లడి చేశాడు. ప్రధానంగా బినామీలు ఎవరన్నదానిపైనే ఎసిబి అధికారులు దృష్టి సారించి శివబాలకృష్ణ నుంచి పలు సమాధానాలు రాబట్టినట్టు తెలిసింది. శివబాలకృష్ణ కింద పనిచేసే దాదాపు 15 మంది ఉద్యోగులను సైతం ఎసిబి అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.

తాజాగా హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు రూ.250 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు విచారణలో గుర్తించినట్లు ఎసిబి అధికారులు వెల్లడించారు. వాటిలో బినామీల పేరిట 214 ఎకరాల భూమి ఉందని తెలిపారు. శివబాలకృష్ణ ఎనిమిది రోజుల ఎసిబి కస్టడీ బుధవారంతో ముగిసింది. ఎనిమిది రోజుల పాటు శివబాలకృష్ణను ఎసిబి అధికారులు ప్రశ్నించారు. బుధవారం కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో హజరుపరిచారు. శివబాలకృష్ణకు 14 రోజుల రిమాండ్ పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దాంతో శివబాలకృష్ణనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

అంతకుముందు శివబాల కృష్ణను ఎసిబి అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. శివబాలకృష్ణ పేరిట భారీగా ఆస్తులున్నట్లు విచారణలో గుర్తించామని ఎసిబి అధికారులు తెలిపారు. అతడి కుటుంబ సభ్యులు, బంధువుల పేరుపైనా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు వెల్లడించారు. శివబాలకృష్ణ పేరు మీద జనగామలో 102 ఎకరాల భూమి, 7 ఇళ్లు, ఒక విల్లా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ‘శివబాలకృష్ణకు రూ.250 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించాం. ఆయనకు ప్రధానంగా ముగ్గురు బినామీలు ఉన్నారు. శివబాలకృష్ణ కుటుంబం పేరిట 29 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించాం.

అలాగే హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్‌ను కూడా కస్టడీకి తీసుకుంటాం.‘అని ఎసిబి అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, మరో ఐదు రోజుల పాటు శివబాలకృష్ణను కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఎసిబి అధికారులు కోర్టును అభ్యర్థించనున్నట్లు సమాచారం. తవ్వేకొద్దీ శివబాలకృష్ణ అక్రమాస్తులు వెలుగుచూస్తున్నాయి. ప్రధానంగా బినామీల ద్వారా మొత్తం వ్యవహారాన్ని శివబాలకృష్ణ చక్కబెట్టారని తెలిసింది. ఇప్పటికే ముగ్గురు బినామీలు ఉన్నట్లు గుర్తించిన ఎసిబి మరింతమంది బినామీలు ఉండి ఉండే అవకాశం ఉండచవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.

మరికొందరు అరెస్టయ్యే ఛాన్స్…!
ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఎసిబి జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర తెలిపారు. అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. హెచ్‌ఎండిఎలో కీలక ఫైల్స్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. లాకర్స్ లోను భారీగా బంగారం, పత్రాలు గుర్తించామని వెల్లడించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలలో పెట్టుబడులపై వెరిఫై చేస్తున్నామని సుధీంద్ర వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News