Saturday, January 11, 2025

ఎసిబి వలలో యాదాద్రి ఆర్‌టిఒ..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి  : ఎసిబి వలలో అవినీతి తిమింగలం చిక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఆర్‌టిఒ అధికారి యాస సురేందర్ రెడ్డి బాగోతం బయటపడింది. ఇటీవల భూదాన్ పోచంపల్లి మండలం, ఖప్రాయపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ ఈనెల 2న తన లారీ పర్మిట్ రద్దు చేయాలని ఆర్‌టిఒను కోరారు. అయితే ఆయన 29 వేల రూపాయల లంచం డిమాండ్ చేయడంతో చేసేదేమీ లేక ప్రవీణ్ మరోసారి పర్మిట్ రద్దు చేయాలని, అంత డబ్బు తనవద్ద లేదని కోరాడు. దీంతో 12 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ఐదు వేల రూపాయలు తొలుత ఇచ్చేందుకు బాధితుడు నిర్ణయించుకున్నాడు. ముందుగా ఎసిబి అధికారులను ఆశ్రయించి, ఆర్‌టిఒను శుక్రవారం కలిసి ఐదు వేలు ఇస్తున్న తరుణంలో తన డ్రైవర్ మల్లిఖార్జున్, ఇద్దరు ఏజెంట్లు సురేష్ అనిల్‌కు ఇవ్వాలని అన్నారు.

దీంతో వారికి ఐదు వేల రూపాయలు ఇస్తున్న క్రమంలో ఎసిబి అధికారులు ఆయన చాంబర్లో ప్రవేశించి అకస్మాత్తుగా సోదాలు నిర్వహించారు. డబ్బులతో పట్టుబడటంతో ఆర్‌టిఒతోపాటు ఇద్దరు ఏజెంట్‌లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కాగా, ఆర్‌టిఒ సురేందర్ రెడ్డి డ్రైవర్ మల్లిఖార్జున్ పరారీలో ఉన్నట్లు సమాచారం. కాగా, పట్టుబడిన ఆర్‌టిఒ సురేందర్ రెడ్డి, ఏజెంట్లు సురేష్ అనిల్‌పై కేసు నమోదు చేసి హైదరాబాద్ ఎసిబి కోర్టుకు తరలించినట్లు ఎసిబి డిఎస్‌పి శ్రీనివాస్ రావు తెలిపారు. గత పదేళ్ల నుంచి భారీగా ఆస్తులు కూడబెట్టిన ఆర్‌టిఒ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో పాటు భారీగా అవినీతికి పాల్పడినట్లు సమాచారం తెలుసుకున్న ఎసిబి అధికారులు ఆయన ఇల్లుతోపాటు అతని బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News