Wednesday, January 22, 2025

రెవెన్యూ అధికారి ఇంట్లో నోట్ల గుట్ట

- Advertisement -
- Advertisement -

ఎసిబి వలలో భారీ తిమింగలం పట్టుబడింది. రాష్ట్ర చర్రితలోనే అత్యధిక నగదు స్వాధీనం చేసుకున్న కేసుగా అధికారులు అభివర్ణించారంటే నిందితుడు ఏమేరకు ఆస్తిపాస్తులను వెనకేసుకొచ్చాడో ఇట్టే అర్థమవుతుంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన ఇంట్లో రూ.2.93 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయన బ్యాంకు ఖాతాలో మరో కోటి రూపాయలు ఉన్నట్టు గుర్తించారు. 50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలతో పాటు విలువైన 17 ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.6.07 కోట్ల రూపాయలుగా ఎసిబి అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర చర్రితలోనే ఇది అత్యధిక నగదు స్వాధీనం చేసుకున్న కేసుగా ఎసిబి అధికారులు పేర్కొంటున్నారు. ఎసిబి డిఎస్‌పి నేతృత్వంలో శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని వినాయక్‌నగర్‌లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రెవెన్యూ అధికారి నరేందర్ ఇంటికి వెళ్లి సోదాలు మొదలుపెట్టారు.

అదే సమయంలో మూడుచోట్ల ఎసిబి అధికారులు తనిఖీలు చేశారు. ఆయా సోదాల్లో భాగంగా ఆయన ఇంట్లో భారీగా నగదు లభ్యం కావడంతో కౌంటింగ్ మిషన్‌లను అప్పటికప్పుడు తెప్పించి నగదును లెక్కించారు. నగదు నిల్వలను చూసి ఎసిబి అధికారులు సైతం నివ్వెరపోయారు. చిన్న చిన్న మూటల్లో 500 రూపాయలను కట్టలు కట్టి ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లో ఉన్న ఆభరణాలతో పాటు నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలలో విలువైన స్థలాలకు సంబంధించి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాల విలువ సుమారు 6 కోట్ల పైచిలుకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అలాగే నరేందర్‌తో పాటు ఆయన భార్య, తల్లి బ్యాంకు ఖాతాల్లోనూ కోటి రూపాయలు సైతం గుర్తించారు. నిందితుడు నరేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నరేందర్ మున్సిపాలిటీలో క్లర్క్‌గా ప్రస్థానం మొదలుపెట్టి రెవెన్యూ అధికారిగా 20 ఏళ్లుగా పాతుకుపోయి పనిచేస్తున్నాడు. గతంలోనూ అధికారులు నరేందర్ అక్రమాలను గుర్తించి ఒక్కసారి సస్పెండ్ చేశారు. తాజా దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News