కల్వకుర్తి : వెంచర్ రిజిస్ట్రేషన్ విషయంలో రూ.75 వేలు లంచం తీసుకుంటూ తహసీల్దార్ నాగమణి, ధరణి ఆపరేటర్ రాజు, విఆర్‌ఎ భర్త వెంకటయ్య ఎసిబి అధికారులకు పట్టుబడిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏసిబి డిఎస్పి శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ మండలం సంకటోనిపల్లికి చెందిన తాళ్ల రవీందర్ శ్రీపతిరావుకు చెందిన మాతృశ్రీ డెవలపర్స్‌లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. చారకొండ మండల కేంద్రంలోని శేరి అప్పారెడ్డిపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 120, 121, 122 లో గల 12 ఎకరాల భూమిని ఈ నెల 7వ తేదిన 12 మంది పేర్ల మీద స్లాట్ బుక్ చేశారు.
ఎంఆర్‌ఓ నాగమణి స్లాట్ ఇవ్వకుండా ఈ నెల 14వ తేది వరకు జాప్యం చేసి ఒక్కొక్క డాక్యుమెంట్‌కు 25 వేల చొప్పున లక్ష రూపాయలు లంచం ఇవ్వాల్సిందిగా ఒప్పందం చేసుకున్నారు. అనుకున్న విధంగా శుక్రవారం మధ్యాహ్నం రూ. 75 వేలు లంచంగా తహసీల్దార్ నాగమణికి ఇవ్వడానికి సిద్ధం కాగా సిరసనగండ్ల విఆర్‌ఏ వందన భర్త వెంకటయ్యకు ఇవ్వాల్సిందిగా తహసీల్దార్ నాగమణి సూచించారు. ఆమె సూచన మేరకు నగదు మొత్తాన్ని విఆర్‌ఏ భర్త వెంకటయ్యకు ఇచ్చిన బాధితులు ఎసిబికి సమాచారం అందించారు.
దీంతో ఎసిబి అధికారులు తహసీల్దార్ నాగమణిని, ధరణి ఆపరేటర్ రాజు, విఆర్‌ఏ భర్త వెంకటయ్యను అదుపులోకి తీసుకుని విచారించి వారి నుంచి రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకుని, తహసిల్దార్ నాగమణి, ధరణి ఆపరేటర్ రాజు, విఆర్‌ఏ భర్త వెంకటయ్యపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని ఏసిబి డిఎస్పి శ్రీకృష్ణ గౌడ్ తెలిపారు. ఈ ముగ్గురిని శనివారం ఏసిబి ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామని ఆయన తెలిపారు.