* రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన కంప్యూటర్ ఆపరేటర్
* వెల్లడించిన ఏసీబి డిఎస్పీ సయ్యద్ ఫయాజ్
రంగారెడ్డి: తాండూరు విద్యుత్ శాఖ ఎడి కార్యాలయంలో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. విద్యుత్ ఎడి కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ రూ.20వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన గురువారం వికారాబాద్ జిల్లా తాండూరులో కలకలం లేపింది. తాండూరు పట్టణానికి చెందిన ఎం.డి కాలిద్‌కు మండలంలోని మల్కాపూరు గ్రామ సమీపంలో గని ఉంది. గనిలో 73 హెచ్‌పిల కరెంట్ ఉండగా అంత అసవరం మేరకు కరెంట్ వాడటం లేదని 43 హెచ్‌పిల కరెంటు కావాలని గత నవంబరు నెలలో తాండూరులోని ఏడి కార్యాలయంలో ధరఖాస్తు పెట్టుకున్నాడు. అలా కరెంట్ సరఫరా మంజూరు చేయాలంటే డబ్బులు కావాలని కంప్యూటర్ ఆపరేటర్ సాబేల్ డిమాండ్ చేశారు. బాధితుడు ఎన్ని సార్లు ప్రాదేయపడినా విద్యుత్ శాఖ అధికారులు ఒప్పుకోకపోవడంతో ఈ నెల 23న ఎసిబి అధికారులను ఆశ్రయించాడు.
ఏసీబి డీఎస్పీ ఫయాజ్ సమక్షంలో తాండూరు విద్యుత్ శాఖ ఎడి కార్యాలయంపై రెక్కీ నిర్వహించారు. బాధితుడు సమాచారం మేరకు తాండూరు విద్యుత్ శాఖ కార్యాలయాన్ని గుర్తు తెలియకుండా చుట్టుముట్టారు. గని యజమాని కాలిద్ రూ.20వేలు కంప్యూటర్ ఆపరేటర్ సాబేల్‌కు అందజేస్తున్న సమయంలో ఏసీబి అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఆపరేటర్ సాబేల్‌ను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. బాధితుడి వద్ద డబ్బులు డిమాండ్ చేసింది ఎవరు, ఎందుకు లంచం తీసుకున్నాడనే విషయాలను పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితుడిని ఏసీబి కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ ఫయాజ్ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. డబ్బులు విద్యుత్ శాఖ ఎడి రామ్‌దాస్ డిమాండ్ చేశారా లేక కంప్యూటర్ ఆపరేటరే తీసుకున్నారా అన్న ప్రశ్నకు విచారణ చేపట్టాక వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. ఏసీబి దాడుల్లో సిఐలు సతీష్‌కుమార్, నాగాచారి, సుదర్శన్, హరిష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ఫోన్‌లు స్విచ్‌డ్ ఆఫ్ చేసిన విద్యుత్ శాఖ అధికారులు
విద్యుత్ శాఖ కార్యాలయంపై ఏసీబి దాడులు జరగడంతో తోటి ఉద్యోగులు, అధికారులు ఫోన్‌లు స్విచ్‌డ్ ఆఫ్ చేశారు. ఏసీబి అధికారులు విద్యుత్ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న కొందరి సిబ్బందిని కూడా వేరు వేరుగా విచారణ చేపట్టారు. ఏసీబి అధికారులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించడంతో విద్యుత్ శాఖ అధికారులు ఆందోళన చెందారు.