సిటిబ్యూరోః ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టుయిన హెచ్‌ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఎసిబి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శనివారం అధికారులు శివబాలకృష్ణ రేరా ఆఫీస్‌లోని నాలుగో ఫ్లోర్‌లోని లాకర్లను తెరిచారు. లాకర్లలో రూ.12లక్షల విలువ చేసే చందనపు చీరలు,రూ.20లక్షల నగదు, ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, భూములకు సంబంధించిన పాస్‌బుక్కులు లభ్యమైనట్లు తెలిసింది. శివబాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు తెలుసుకున్న ఎసిబి అధికారులు దానిపై దృష్టి సారించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులపై ఎసిబి అధికారులు విచారణ చేస్తున్నారు. బాలకృష్ణకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బినామీలుగా ఉన్నవారి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే శివబాలకృష్ణ సోదరుడు శివసునీల్‌కుమార్‌ను ఎసిబి అధికారులు కార్యాలయానికి రప్పించి విచారణ చేశారు. బాలాజీ అనే వ్యక్తి పేరుపై కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. బినామీలుగా వ్యవహరించిన వారి లిస్టును ఎసిబి అధికారులు తయారు చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే వారిని ఎసిబి కార్యాలయానికి పిలిపించి విచారణ చేయనున్నట్లు తెలిసింది. దీంతో బినామీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి, తాము ఎక్కడ ఈ కేసులో ఇరుక్కుంటామోనని భయపడుతున్నట్లు తెలిసింది. బినామీలు నోరి విప్పితే శివబాలకృష్ణ మరింత చిక్కుల్లో పడనున్నట్లు తెలిసింది.