మూడు లింకులుగా డిపిఆర్ డ్రాఫ్ట్‌పై చర్చ
తొలిదశలో 247 టిఎంసీల నీటిమళ్లింపు
రూ.65 వేల కోట్లకు అంచనా వ్యయం
నిధుల వాటాలో కేంద్రం 90శాతం..రాష్ట్రాలు 10శాతం
డిసెంబర్ తొలివారంలో ఎంఓయు
మనతెలంగాణ/హైదరాబాద్: జాతీయ స్థాయిలో నదుల అనుసంధాన ప్రక్రియకు చిక్కుముడులు వీడిపోతున్నాయి. భాగస్వామ్య రాష్ట్రాలకు ఈ ప్రక్రియపట్ల ఉన్న సందేహాలను తొలగించి ,నీటి వినియోగం పట్ల అవగాహన కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్యుడిఏ) గోదావరికావేరి నదుల అనుంసధాన ప్రక్రియపై శుక్రవారం నాడు జలసౌధలో కీలక సమవేశాలను నిర్వహించింది. నదుల అనుసంధానపథకంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన టాస్క్‌ఫోర్స్ , కన్సల్టేషన్ సమావేశాల్లో నేషనల్ వాటార్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ , ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే పాల్గొనగా, ఇతర భాగస్వామ్యరాష్ట్రాల అధికారులు వర్చువల్ విధానంలో సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో గోదావరికావేరి నదుల అనుసంధానంపై రూపొందించిన డిపిఆర్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై చర్చించారు. వెదిరే శ్రీరాం తొలుత డిపిఆర్‌ను భాగస్వామ్య రాష్ట్రాల ముందుంచారు. నదుల అనుసంధానంలో భాగంగా మహానదిగోదావరికావరి నదులను అనుసంధానించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అయితే ఇందులో తొలిదశ కింద గోదావరికావేరి నదులను అనుసంధానించాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఈ పథకాన్ని మూదు దశలుగా చేపట్టనున్నట్టు వివరించారు. తొలిదశ కింద గోదావరి నదీజాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ వద్ద కృష్ణానదిలోకి కలిపేందుకు లింక్ పనులు చేపడతారు. కృష్ణానదీజలాలను నాగార్జున సాగర్ నుంచి పెన్నానదిలోకి సోమశిల వద్ద కలిపేస్తారు. సోమశిల నుంచి కావేరి నదికి అనుసంధానిస్తారు. తమిళనాడులో గ్రాండ్ అనికట్ వద్ద ఈ నీటిని మళ్లించనున్నారు. మూడు దశలుగా చేపట్టే ఈ నదుల అనుసంధానం ప్రక్రియ ద్వారా మొత్తం 247 టిఎంసీల నీటిని మళ్లించనున్నారు. ఇందుకోసం రూ.65వేలకోట్లు వ్యయం కాగలదని ప్రాధమికంగా అంచనా వేశారు. ఈ నిధుల వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 90శాతం తనవంతు వాటాను భరించనుంది.మిగిలిన 10 శాతం నిధులను భాగస్వామ్యరాష్ట్రాలు భరించాల్సివుంది.
వినియోగించుకోలేని జలాలే మళ్లింపు :
గోదావరి ట్రిబ్యునల్ అవార్డు మేరకు ఆయా రాష్ట్రాలకు కేటాయింపులు ఉన్న నీటి వాటాల్లో చుక్కనీటికి కూడా నదులు అనుసంధాన పథకంలో ఉపయోగించమని సమావేశంలో ఎన్‌బడ్యుడిఏ అధికారులు స్పష్టం చేశారు. నికర జలాలే కాకుండా మిగులు జలాల జోలిక కూడా వెళ్లబోమని వివరణ ఇచ్చారు. రాష్ట్రాలు ఉపయోగించుకోకండా వృధాగా సముద్రం పాలవుతున్న నదీజలాలనే గోదావరి కావేరి నదుల అనుసంధానంలో ఉపయోగించుకోనున్నట్టు స్పష్టత ఇచ్చారు.డిపిఆర్ డ్రాఫ్టులో కూడా ఇవే అంశాలను పొందుపరిచినట్టు వెల్లడించారు. గోదావరి నదీజాలాల కేటాయింపులో బేసిన్ పరిధిలోని చత్తిష్‌గఢ్ రాష్ట్రానికి కేటాయించిన నీటిలో ఏ మాత్రం ఉపయోగించుకోకుండా ఉన్న నీటిలో ప్రతియేటా 300టిఎంసీలు వృధాగా సముద్రం పాలవుతున్నట్టు గత రెండు దశాబ్ధాల గణాంకాలకు సంబంధించిన నివేదికలను డిపిఆర్‌లో పొందు పరిచారు. ఈ నీటిలో సింహభాగం నదుల అనుసంధానం కోసం ఉపయోగిస్తున్నట్టు వివరించారు. అంతే కాకుండా రెండవ దశకింద మహానదిగోదావరి నదుల అనుసందాన పథకం చేపట్ట నున్నట్టు వెల్లడించారు. మహానది ద్వారా పెద్ద మొత్తంలో మిగులు జలాలు గోదావరి నదిలో కలవనున్నట్టు వివరించారు.
నీటి మళ్లింపులో 66శాతం తెలుగు రాష్ట్రాలకే !
గోదావరికావేరి నదుల అనుసంథాన పథకం కింద మళ్లించే నీటిలో 66శాతం వాటా తెలుగు రాష్ట్రాలకే దక్కేవిధంగా డిపిఆర్ డ్రాఫ్టును రూపొందించారు. మొత్తం 247టిఎంసీలను మళ్లిస్తున్నందున ఇందులో తెలంగాణ రాష్ట్రానికి 33శాతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 33శాతం ,కర్ణాటక రాష్ట్రానికి 17శాతం , తమిళనాడు రాష్ట్రానికి 17శాతం కేటాయిస్తూ డ్రాప్టు సిద్దం చేశారు.
డిసెంబర్‌లో ఒప్పందంపత్రంపై సంతకాలు:
గోదావరికావేరి నదుల అనుసంధాన పథకానికి సంబంధించిన ఒప్పంద పత్రాలపైన డిసెంబర్ మొదటివారంలో భాగస్వామ్య రాష్ట్రాలు సంతకాలు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు టాస్క్‌ఫోర్స్ కమిటి చైర్మన్ వెదిరె శ్రీరామ్ వెల్లడించారు. సమావేశం అనంతం అయన మీడియాతో మాట్లాడుతూ నదుల అనుసంధాన ప్రక్రియలో వేగం పెరిగిందని తెలిపారు. చత్తిస్‌గఢ్ , ఒరిస్సా, తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారని నదుల అనుసంధానం డిపిఆర్ డ్రాఫ్టులోని అన్ని అంశాలను చర్చించినట్టు తెలిపారు. బాగస్వామ్య రాష్ట్రాలు డ్రాప్టుకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చినట్టు తెలిపారు. డిఆపిర్ డ్రాప్టు పట్ల సూత్రప్రాయ అంగీకారం తెలిపాయిని వెల్లడించారు. అందరి అభిప్రాయాలను క్రోడికరించి ఆ మేరకు ఫైనల్ డిపిఆర్ సిద్దం చేస్తామని టాస్క్‌ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరామ్ వెల్లడించారు. సమావేశంలో ఎన్‌డబ్యుడిజి భోపాల్‌సింగ్ , చీఫ్‌ఇంజనీర్ సంకువా ఎస్‌ఇ ఎస్.ఏ నాయుడు తదితరులు పాల్గొన్నారు.