హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కీలక ఘట్టాన్ని కౌంట్ డౌన్ మొదలైంది. రేపటి (శుక్రవారం) నుంచి.. 2023 నవంబర్ 3వ తేదీన నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. దీంతో అన్ని పార్టీలు అభ్యర్థులను నియోజకవర్గాల అభ్యర్థులుగా ఖరారు చేసే పనిలో బిజీ అయ్యాయి. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల రెండో, మూడో జాబితాలను విడుదల చేశాయి. కొన్ని సీట్లలో మాత్రమే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇదే సమయంలో నామినేషన్ల దాఖలుకు సమయం దగ్గర పడుతుండటంతో.. అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి.. బీఫాంలు ఇవ్వాలని నిర్ణయించాయి. సమయం ఎక్కువగా లేకపోవటంతోపాటు ప్రచారంపై దృష్టి పెట్టటానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. టికెట్ రాని అభ్యర్థుల బుజ్జగింపులతోపాటు పొత్తుల్లోని పార్టీలతో చర్చలను.. వీలైనంత త్వరగా ముగించాలని నిర్ణయించాయి.
ఈ క్రమంలోనే నామినేషన్ల గడువునను దృష్టిలో పెట్టుకుని.. గురువారం సాయంత్రంలోగా అన్ని పార్టీలు.. అభ్యర్థులను ప్రకటించే పనిలో కసరత్తులు చేస్తున్నాయి. 3వ తేదీ నుంచి10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు కాగా.. 13న నామినేషన్ల పరిశీలన, 15న నామినేషన్ల ఉపసంహరణ ఉండనున్నాయి. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు. అభ్యర్థితో కేవలం ఐదు మంది మాత్రమే నామినేషన్ కేంద్రాల వద్దకు రావాల్సి ఉంటుంది. ఈ నెల 30న పోలింగ్ నిర్వహిస్తుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు బీ ఫాంలు ఇచ్చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. సగం నియోజకవర్గాలను ఇప్పటికే కవర్ చేశారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇంకా పొత్తులు, అభ్యర్థుల జాబితాతోనే సతమతమవుతున్నాయి.
కాంగ్రెస్ వంద మంది అభ్యర్థులను ప్రకటించి మరో 19 మందిని ఖరారు చేసే పనిలో పడింది. ఇంకా సిపిఐ, సిపిఎంతో పొత్తులు లెక్కకు రాలేదు. ఇక 55 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించిన బిజెపి.. జనసేనతో పొత్తు, సీట్లు సర్దుబాటుపై చర్చలు జరుపుతుంది. మరోవైపు తెలంగాలో అన్ని స్థానాల్లో బరిలో నిలుస్తామని ప్రకటించిన వైఎస్ షర్మిల ఇప్పటిదాకా అభ్యర్థుల ప్రకటన చేయలేదు. బిఎస్‌పి సైతం ఇంకా 70కి పైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.