Monday, December 23, 2024

ముమ్మరంగా ‘ ఈ శ్రమ్ ’

- Advertisement -
- Advertisement -

జాతీయ డాటా బేస్ నమోదుకు కార్మిక శాఖ కసరత్తు
టోల్ ఫ్రీ నెంబర్ 14434 పై విస్తృత ప్రచారం
ఈ ఏడాదిలో కోటి మంది నమోదుకు యత్నాలు
రూ. 2 లక్షల ప్రమాద బీమా పరిహారంపైనా అవగాహన

మన తెలంగాణ / హైదరాబాద్ : అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన “ ఈ – శ్రమ్ ” వెబ్ పోర్టల్‌లో కార్మికుల నమోదు ప్రక్రియనూ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయిస్తోంది. రాష్ట్రంలో ప్రమాదాల బారిన పడి అసువులు బాస్తున్న కార్మిక కుంబాలకు తన వంతుగా చేయాల్సిన సహాయం చేస్తునే కేంద్రం నుండి ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందేలా చూస్తోంది. ఇందుకోసం కార్మిక కర్షకులంతా కూడా విధిగా ఈ శ్రమ్ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరుతోంది. ఇందుకోసం రాష్ట్ర కార్మిక శాఖకు పలు సూచనలు చేయడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేయించేందుకు తమ వంతుగా ముమ్మరంగా యత్నిస్తున్నారు.

ఈ ఏడాది కోటి మంది నమోదు !!

ఈ – శ్రమ్ పోర్టల్ 2021 ఆగస్టు నెల 26న ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు 40 లక్షల 40 వేల 397 మంది తమ పేర్లను ఈ శ్రమ్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాగా ఈ ఏడాది ముగిసేనాటికి కనీసం కోటి మంది అయినా ఈ శ్రమ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలని ప్రభుత్వం కార్మిక శాఖ ఉన్నతాధికారులకు సూచించింది. కాగా ఇప్పటి వరకు వ్యవసాయ రంగం నుండి 25,10,186 మంది, భవన నిర్మాణ రంగం నుండి 2,51,358 మంది, ఆటోమ్బైల్ రంగం నుండి 2,22,580 మంది, అప్పెరల్ రంగం నుండి 2,15,845 ఇలా మొత్తంగా 40 లక్షల 40 వేల పై చిలుకు మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో వీరందరినీ కార్మిక శాఖ అధికారులు ప్రధానమంత్రి సురక్షా భీమా యోజనతో పాటు ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్‌ధన్ యోజనలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ శ్రమ్‌లో చేరితే వచ్చే బెనిఫిట్స్.. ఏదేని పరిస్థితుల్లో ప్రమాద వశాత్తూ మృతి చెందినా, గాయ పడినా అందే పరిహారాన్ని కార్మికులకు వివరిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యంగా ఇఎస్‌ఐ, ఇపిఎఫ్ లేని సుమారు 160 కేటగిరీలకు చెందిన వారంతా ఇందులో చేరేందుకు యత్నిస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 14434 ను సంప్రదించవచ్చని వెల్లడిస్తోంది. ముఖ్యంగా 16 నుండి 59 ఏళ్ల వయస్సులోపు ఉన్న వారిని, ఆదాయపన్ను పరిధిలోకి రాని వారికి ఈ – శ్రమ్ గురించి అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అసంఘటిత రంగ కార్మికుల జాబితా పరిధిలోకి ఎవరెవరు వస్తారన్న దానిపై తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కరపత్రాలను ముద్రించి పంపిణీ చేసి మరీ వారిని చేరేలా చూస్తోంది.

అసంఘటిత రంగ కార్మికుల జాబితా పరిధిలోకి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ ఉపాధుల పనివారు, చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ దారులు, మత్సకారులు, భవన నిర్మాణ మరియు దాని అనుబంధ రంగాలలో పని చేసే వారు తాపీ, తవ్వకం, సెంట్రింగ్, రాడ్ బెండింగ్, రాళ్లు కొట్టేపని, ప్లంబింగ్, సానిటర్, పెయింటర్, టైల్స్, ఎలక్ట్రిషియన్లు, వెల్డింగ్, ఇటుక, సున్నం బట్టీలు, కాంక్రిట్ మిక్సర్లు, బావులు తవ్వడం , పూడికతీత , రిగ్గర్లు అలాగే అప్పారెల్ విభాగంలోని టైలరింగ్, డ్రెస్ మేకర్స్, ఎంబ్రాయిడరీ, ఆటొమొబైల్ రవాణా రంగంలోని డ్రైవర్లు, హెల్పర్లు, చేనేత, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, క్షౌరవృత్తి, చర్మకారులు, రజకులు, స్వర్ణకారులు, బ్యూటీ పార్లర్లలో పని చేసే వారు ఇంకా వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారస్తులు, ఇంటి వద్ద వస్తువులు తయారీ చేసుకునే వారు, చిరు వ్యాపారులు, కల్లుగీత కార్మికులు, రిక్షా కార్మికులు, బీడీ కార్మికులు, వీధుల్లో చెత్త ఎరుకునేవారు అలాగే వివిధ రంగాల కళాకారులు, ఇళ్లలో పాచిపని చేసుకుని జీవించే పనివారు ఈ కేటగిరిలోకి వస్తారని,వీరంతా విధిగా తమ పేర్లను రిజిస్ట్రర్ చేసుకోవాలని కార్మిక శాఖ చెబుతోంది.

ఈ శ్రమ్‌లో చేరేలా చూస్తున్నాం.. .. డి. గంగాధర్ ( అడిషనల్ కమిషనర్ ఆఫ్ లేబర్)

ఈ – శ్రమ్ పోర్టల్‌లో ఆయా 160 కేటగిరీలకు చెందిన వారంతా ఇందులో చేరేలా చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ కమిషనర్ ఆఫ్ లేబర్ డి. గంగాధర్ “మన తెలంగాణ”తో అన్నారు. ఈఎస్‌ఐ, ఇపిఎఫ్ లేని వారంతా నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ ఏడాది కోటి మంది వరకు చేరేలా చూస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించి సందేహాలను నివృత్తిచేసుకోవచ్చన్నారు. కార్మికులు తమ సమీప ప్రాంతాలైన గ్రామ వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్ల లో నమోదు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఈ – శ్రమ్ కు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులంతా తమ బ్యాంకు ఖాతా నెంబర్‌తో ఆధార్ కార్డును అనుసంధానించాల్సి ఉంటోందని తెలిపారు. అలా ఖాతా అనుసంధానించిన వారికి 12 అంకెలు గల ప్రత్యేక యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ రావడం ద్వారా ఆ సంఖ్య దేశ వ్యాప్తంగా ఆధార్ తరహా వాలిడ్ నెంబర్‌గా వినియోగించుకునే ఛాన్స్ ఉంటోందన్నారు.

పరిహారం ఆరు లక్షలు ఇవ్వాలి.. ఎం. నర్సింహా (ఎఐటియుసి )

ఈ శ్రమ్‌లో చేరిన వారు చనిపోయినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా కనీసం రూ. 6 లక్షల పరిహారం అయినా ఇవ్వాలని ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధానకార్యదర్శి ఎం. నర్సింహ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలాగే మహిళా కార్మికులకు రెండు ప్రసూతి సెలవులకు రూ. 50 వేలు ఇచ్చే విధంగా ఈ పథకంలో పొందుపరిస్తే బావుంటుందన్నారు. కార్మికులకు ఉచితంగా ఈ శ్రమ్‌కార్డులు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి చేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News