హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి చైత్రను దారుణంగా హత్య చేసిన నిందితుడు రాజు గురువారం ఉదయం జనగాం జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడు రాజు ఆత్మహత్యకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులైన ఇద్దరు రైల్వే కీమెన్లు పూర్తి వివరాలను అందించారు. తామిద్దరం ఉదయాన్నే డ్యూటీకి ఎక్కామని… ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి పొదల్లోకి పారిపోయాడని వారు చెప్పారు. అప్పుడు అక్కడ తమతో పాటు మరికొందరు కూడా ఉన్నారని తెలిపారు.
అనుమానం వచ్చి చెట్లలోకి వెళ్లి చూడగా అతను కనిపించలేదని తెలిపారు. ఆ తర్వాత తామిద్దరం ఒక 200 మీటర్ల దూరం వరకు ట్రాక్ పై నడుచకుంటూ వచ్చామని.. ఆ సమయంలో హైదారాబాద్ వైపుగా వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ కు ఎదురుగా వెళ్లి అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. అనంతరం దగ్గరకు వెళ్లి పరిశీలించగా రాజు అనే అనుమానం తమకు వచ్చిందని, ఆ తర్వాత 100కు డయల్ చేసి సమాచారం అందజేశామని తెలిపారు. ఉదయం 8.40 గంటలకు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. మరోవైపు రాజు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తున్నారు.
Accused Raju suicide by confronting to train: eye witnesses