Friday, December 20, 2024

అబ్దుల్లాపూర్‌మెట్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః తనకు స్క్రాప్ విక్రయించకుండా వేరే వారికి అమ్ముతున్నాడని కక్ష పెంచుకుని వరుసకు సోదరుడిని హత్య చేసిన ముగ్గురు నిందితులను అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఈ నెల 6వ తేదీన బాటసింగారం గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. ఎల్‌బి నగర్ డిసిపి సాయిశ్రీ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, మీర్జాపూర్ గ్రామానికి చెందిన తూరుపాటి శ్రీశైలం స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. తూరుపాటి ధశరథ, తూరుపాటి లింగస్వామి, తూరుపాటి రామచందర్, తూరుపాటి వెంకటేష్ అందరు ఒకే సామాజిక వర్గానికి చెందడమే కాకుండా వరుసకు సోదరులవుతారు. తూరుపాటి రామచందర్, వెంకటేష్ స్క్రాప్‌ను సేకరించి శ్రీశైలానికి రెగ్యులర్‌గా విక్రయిస్తుంటారు.ఐదు రోజుల నుంచి ఇద్దరు బాధితులు శ్రీశైలానికి విక్రయించకుండా వేరే వారికి అమ్ముతున్నారు. దీనిని గ్రామంలోని మిగతా వారు చేస్తే తన వ్యాపారంలో నష్టం వస్తుందని భావించాడు.

దీంతో రామచందర్, వెంకటేష్‌పై శ్రీశైలం కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారిని హత్య చేయాలని ప్లాన్ వేశాడు. దీనికి మిగతా వారిని సహకరించాలని కోరాడు. ఈ నెల 6వ తేదీన నిందితులు బాటసింగారం గ్రామంలో బాధితులతో గొడపడ్డారు, చంపివేస్తామని హెచ్చరించారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బాధితుల కదలికలపై కన్నేసిన నిందితులు అదే రోజు రాత్రి 7 గంటలకు బాధితులు బైక్‌పై గ్రామానికి వెళ్తుండగా ఆటోను వేగంగా నడుపుకుంటూ రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేసుకుంటు వచ్చి బాధితుల బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో రామచందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూసినా, పోలీసులు దర్యాప్తు చేయడంతో హత్య విషయం బయటపడింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ మన్మోహన్, ఎస్సై సునీల్‌కుమార్ నిందితులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News