మనతెలంగాణ, హైదరాబాద్ : నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకుని అమెరికా వెళ్లాలని ప్రయత్నించిన యువకుడిని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నాచారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మైగ్రేషన్, ప్రొవిజినల్, కన్‌సాలిడేటెడ్ మెమోరాండం మార్క్ సర్టిఫికేట్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 17 ఓయూ నకిలీ సర్టిఫికేట్లను, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నాచారం, రాఘవేంద్రకాలనీకి చెందిన జంగా దయాకర్ రెడ్డి(25) ఇంజనీరింగ్ సివిల్ డిస్‌కంటిన్యూ చేశాడు. ఇబ్రహింపట్నంలోని ఎవిఎన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో సివిల్ బ్రాంచ్‌లో చేరాడు, కోర్సు పూర్తి చేయకుండా 2014—-2018లో మధ్యలో ఆపివేశాడు. నిందితుడికి అమెరికా వెళ్లి డబ్బులు సంపాదించాలని కోరిక ఉంది. దీనికి ఇంజనీరింగ్ పూర్తి చేయకపోవడం అడ్డుగా మారింది. యువకుడు నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకుని అమెరికా వెళ్లాలని ప్లాన్ వేశాడు.
జూలై,2021 తన స్నేహితుల ద్వారా వీసా స్లాట్ బుకింగ్ ఏజెంట్ ముద్దం స్వామితో ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. స్వామి కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నకలీ సర్టిఫికేట్ తీసుకుని అమెరికా వెళ్లాడు. అమెరికాలో పేస్ యూనివర్సిటీలో ఎంబిఏ చేస్తున్నాడు. దయాకర్‌కు ఫోన్ కంటాక్ట్‌లోకి వచ్చిన స్వామికి తను అమెరికాకు వెళ్లాలనే విషయం చెప్పాడు. ఇంజనీరింగ్ సర్టిఫికేట్‌కు రూ.1.3లక్షలు ఖర్చు అవుతాయని చెప్పాడు. దానికి అంగీకరించిన దయాకర్ డబ్బులను ఫోన్ పే ద్వారా ముద్దం స్వామికి పంపించాడు. డబ్బులు అందిన తర్వాత నిందితుడికి ఓలా రైడర్ ద్వారా నకిలీ సర్టిఫికేట్లు ఇంటికి వచ్చాయి.
నకిలీ సర్టిఫికేట్లతో అమెరికా వెళ్లేందుకు దయాకర్ ఎంఎస్ చేసేందుకు అక్కడి యూనివర్సిటీలకు అప్లికేషన్ పెట్టుకుని వీసా కోసం ముంబాయి, ఢిల్లీ, హైదరాబాద్‌లో ఇంటర్వూలకు హాజరయ్యాడు కానీ వీసా పొందడంతో ఫెయిల్ అయ్యాడు. ఈ విషయం నాచారం పోలీసులకు తెలియడంతో పోలీసులు ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. ముద్దం స్వామి నకలీ సర్టిఫికేట్లతో అమెరికా వెళ్లడంతో ఓయూ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రస్తుతం ఎస్‌ఐటికి బదిలీ చేశారు. నాచారం, ఎల్‌బి నగర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ముద్దం స్వామి పరారీలో ఉన్నాడు. ఇన్స్‌స్పెక్టర్లు సుధాకర్, కిరణ్‌కుమార్, ఎస్సై ఎండి తకియుద్దిన్, సారంగపాణి తదితరులు పట్టుకున్నారు.