Monday, December 23, 2024

హత్య కేసులో నిందితుడి అరెస్ట్..పథకం ప్రకారమే హత్య

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామానికి చెందిన నీరడి శ్రీనివాస్ (ఆర్టీసి డ్రైవర్) అనుమానస్పద స్థితిలో మృతి చెందడంతో నస్రుల్లాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారని, నిందితులను పట్టుకున్నట్లు బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ రెడ్డి తెలిపారు. బుధవారం బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించారు. శంకిరి కిషన్ గౌడ్ (అంకోల్), బసోల బాలయ్య (అంకోల్), యిరుపాజి సురేష్ (మల్లారం, వర్ని మండలం), కేతావత్ రవి (మల్లారం, వర్ని మండలం), గొట్టం శ్రీకాంత్ (మల్లారం, వర్ని మండలం) ఐదుగురిని దర్యాప్తులో భాగంగా విచారించడం జరిగిందన్నారు.

పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో పారిపోదామని వెళుతుండగా, ఇద్దరిని అంకోల్ క్యాంపు గ్రామ శివారులో, మరో ముగ్గురిని బాన్సువాడలో అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. మృతుని భార్యతో కిషన్ గౌడ్‌కు వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయమై నీరడి శ్రీనివాస్, కిషన్ గౌడ్‌ల మధ్య చాలాసార్లు గొడవలు సైతం అయ్యాయన్నారు. దీంతో శ్రీనివాస్‌ను చంపివేస్తే అడ్డు తొలగిపోతుందని భావించి పథకం వేసి జనవరి 29న రాత్రి సమయంలో తనతో పాటు నలుగురు నిందితులను అంకోల్ గ్రామ శివారులో పిలిపించాడన్నారు. బసోల బాలయ్య శ్రీనివాస్‌ను అక్కడికి తీసుకుని రాగా, అందరూ కలిసి మృతుడికి మద్యం తాగించి మద్యం సీసాలను నోటిలోకి బలవంతంగా కుక్కి కాలితో తన్ని హత్య చేశారన్నారు.

నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో వారి వద్ద నుంచి రెండు మోటార్ సైకిళ్లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీన పర్చుకున్నామన్నారు. ఈ కేసు చేధించడంలో బాన్సువాడ డీఎస్పీ, రూరల్ సిఐ మురళి, నస్రుల్లాబాద్ ఎస్సై రంజిత్ రెడ్డి, సహకరించిన ఎఎస్సై, పీసీ ప్రమోద్, సుభాష్, హరిచంద్, సంగమేశ్, శ్యాంలను ఎస్పీ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News