Friday, January 24, 2025

రియల్టర్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో ఐదుగురు నిందితులను మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి, జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆరు కత్తులు, కారు, రెండు బైక్‌లు, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్‌గిరి డిసిపి జానకి తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జవహర్‌నగర్‌కు చెందిన పరంకుశం పవన్, పరాంకుశం లక్ష్మణ్ ఇద్దరు తండ్రి కుమారుడు ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.

జవహర్‌నగర్‌కు చెందిన శివరాత్రి సురేష్ అలియాస్ జంపు, గౌడి జగదీష్ అలియాస్ వికాస్, మల్లేబోయిన సాయికిరణ్ కలిసి హత్య చేశారు. జవహర్‌నగర్, స్వామి కాలనీకి చెందిన చట్ల వేణుగోపాల్ అలియాస్ వేణు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. పరాంకుశం లక్ష్మణ్, వేణు తండ్రికి కలిసి 2011లో జవహర్‌నగర్‌లోని లక్ష్మినర్సింహా కాలనీలోని పది ఎకరాలను కొనుగోలు చేశారు. రెండేళ్ల తర్వాత వేణు, లక్ష్మణ్ మధ్య వివాదం ఏర్పడింది. దీంతో లక్ష్మినారాయణ, వేణు కలిసి కోర్టున ఉంచి పవన్ అనే వ్యక్తి ఈ వివాదంలోకి రాకుండా ఉండేందుకు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుని వచ్చాడు.

ఈ క్రమంలోనే లక్ష్మణ్ వెంటనే రెవెన్యూ అధికారులను కలిసి లక్ష్మినారాయణ పేరుతో అయిన రిజిస్ట్రేషన్‌ను క్యాన్సిల్ చేయాలని కోరాడు. రెవెన్యూ అధికారులు వచ్చి భూమి ఉన్న ప్రాంతంలో సర్వే చేశారు. దీంతో పవన్, లక్ష్మణ్‌పై కోపం పెంచుకున్న వేణు వారికి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో వేణును హత్య చేయాలని పవన్, లక్ష్మణ్ కలిసి ప్లాన్ వేశారు. దానికి పవన్ స్నేహితులు శివరాత్రి సురేష్, జగదీష్, సాయికిరణ్‌ను సంప్రదించాడు. హత్య చేస్తే రూ.5లక్షలు, అందరికీ ఒక ప్లాట్ ఇస్తామని చెప్పాడు.

దీంతో అందరు కలిసి ఈ నెల 9వ తేదీ ఉదయం బాధితుడిని ఉచంపేందుకు ప్లాన్ వేసినా కుదరలేదు. సాయంత్రం తన స్నేహితుడు అనిల్‌తో కలిసి వేణు రాత్రి 7.45 గంటలకు బైక్‌పై వెళ్తుండగా కారు, బైక్‌పై వెంబడించిన నిందితులు చెన్నాపురం లేక్ వద్ద బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో బైక్‌పై నుంచి ఇద్దరు కింద పడిపోయారు. వెంటనే పట్టుకున్న సురేష్, పవన్ కలిసి నిందితుడి గొంతును కోసివేశారు. తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్లు సీతారాం, శ్రీనివాస్, రాములు, ప్రవీణ్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News