మనతెలంగాణ, హైదరాబాద్ : వాట్సాప్ ద్వారా మహిళకు వీడియోలు, ఫొటోలు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం, వెల్లురూ, ద్రపడవేడు, భారతీనగర్‌కు చెందిన సి. కబిలాన్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. నిందితుడు ఇక్కడ బాధితురాలి ఇంటి పక్కన ఉండేవాడు ఆ సమయంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ సమయంలో నిందితుడు ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత నిందితుడు బాధితురాలికి అశ్లీల వీడియోలు, ఫొటోలు పంపించాడు. తనకు రూ.5,00,000 ఇవ్వాలని లేకుంటే స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో మానసికంగా ఇబ్బందులు పడిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ శంకర్ కేసు దర్యాప్తు చేశారు.