కనకదుర్గమ్మ గుడిలో మెగా అభిమానుల అల్లరి
ఆలయంలో సెల్ ఫోన్లతో ఫొటోలు, వీడియోలు
దైవనామ స్మరణకు బదులు అభిమాన హీరోకు జేజేలు
ఇబ్బంది పడిన చిత్ర బృందం, ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో అపచారం జరిగింది. సెక్యూరిటీ లోపంతో మెగా అభిమానులు అత్యుత్సాహంతో ఇంద్రకీలాద్రిలో కనకదుర్గమ్మ ఆలయంలోకి దూసుకొచ్చి నానా హంగామా సృష్టించారు. ఈ నెల 29న ఆచార్య చిత్రం విడుదల కానున్న నేపధ్యంలో, గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సినీ బృందం అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రి దుర్గాదేవి గుడికి వచ్చారు. ఆ బృందంలో సినీనటుడు రామ్ చరణ్ తేజ ఉండడంతో మెగా అభిమానులు హద్దుమీరి అత్యుత్సాహం ప్రదర్శించారు. దుర్గాదేవి గుడి అంతరాలయం అనే కనీస మర్యాద లేకుండా ఆలయంలోకి మొబైల్ ఫోన్లు తీసుకువచ్చి ఫొటోలూ, వీడియోలు తీశారు. అంతటితో ఆగకుండా జై చరణ్ అంటూ నినాదాలు చేశారు. దేవాలయ ప్రాంగణంలో దేవతా నామానికి బదులు అభిమాన హీరో పేరుతో అరుస్తూ చిత్ర బృందాన్ని ఇబ్బందికి గురయ్యైలా చేశారు. అభిమానుల తాకిడి ఎక్కువవ్వడంతో ఆలయం లోపల రైలింగ్ రాడ్లు విరిగిపోయాయి. దాని పరిణామంగా క్యూలైన్లలో తొక్కిసలాట కూడా జరిగడంతో అభిమానం పేరుతో చిరంజీవి అభిమానుల చేష్టలను ఖండిస్తూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకూ, దుర్గాదేవి ఆలయ అధికారుల మధ్య సమన్వయం లోపం కారణంగా ఈ గందరగోళం నెలకొంది.