Saturday, December 21, 2024

పద పదానికి చందన చర్చ చేసినవాడు

- Advertisement -
- Advertisement -

ఆచార్య రవ్వా శ్రీహరి గారు ఒక విలక్షణమైన వ్యక్తి. విశిష్టమైన వ్యక్తి. నిఘంటు నిర్మాణానికి పర్యాయ పదంగా నిలిచిపోయారు. వ్యాకరణానికి సూత్ర భాష్యంగా వెలిగినవారు. వారు ఎం.ఎ, డిగ్రీ పొందక ముందే ప్రొఫెసర్లకు పాఠాలు చెప్పగలిగే జ్ఞాన సంపదను ఆర్జించారు. మౌలికంగా శ్రీహరిగారు జిజ్ఞాసువు. అందుకే ఒకటి సాధించగానే తృప్తిపడి ఊరుకున్న వారు కాదు. అసలు వారు ఎన్నుకున్న నిఘంటు, వ్యాకరణ రంగాలు సామాన్యమైనవి కావు. కష్టసాధ్యమైనవి. నిరంతర కృషిని అపేక్షించేవి. సంచార జీవిగా మార్చి పదాల పుట్టు పూర్వోత్తరాలను విశ్లేషించమని ఆదేశించేవి. ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. మామూలు కవులకు లభించే కీర్తి, పురస్కారాలు వారి కన్నా వెయ్యి రెట్లు గొప్పవారైన నిఘంటుకారులకు, వైయాకరణులకు లభించవు. వీరెప్పుడూ చర్చ ల్లో వుండరు. వీరిని గూర్చి చర్చించే స్థాయి వున్నవారు కొందరే వుంటారు.

తెలంగాణ కవి పండితులకు ఒక సహజ లక్షణం వుంది. వారెప్పుడూ తమను తాము గొప్పగా ప్రదర్శించుకున్న వారు కాదు. పింగళి సూరన ఒక పద్యంలో ‘నీరు కొలది తామర సుమ్మీ’ అంటాడు. అంటే నీటి మట్టం వరకే తామర పువ్వు తనను ప్రదర్శించుకుంటుందని అర్థం. తెలంగాణ పండిత ప్రకాండులు కూడా ఎదుటి వాడి స్థాయికి తగ్గట్టుగానే తమను ప్రదర్శించుకుంటారు. అంతకన్నా ఎక్కువ చెప్పుకునే అవకాశమున్నా చెప్పుకోరని అర్థం. రవ్వా శ్రీహరి గారిది కూడా అదే స్వభావం. వారు సూటిగా, సూత్రభాషలో మాట్లాడినట్టుండేది. క్లుప్తంగా, పొల్లు మాట లేకుండా సంభాషించేవారు. సాధారణంగా ఒక్క నిఘంటువును కూర్పు చేయటమే కష్టం. అలాంటిది శ్రీహరి గారు “సంకేత పదకోశం’, ‘నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం’ ‘శ్రీహరి నిఘంటువు’, ‘అన్నమయ్య పదకోశం’ తెలంగాణ మాండలికాలు కావ్య ప్రయోగాలు, ‘అచ్చతెనుగు పదకోశం’ అన్న ఆరు నిఘంటువులను స్వయంగా నిర్మించారు.

ఇవి కాక ‘వ్యాకరణ కోశం’, ‘ఆరెభాషా నిఘంటువు’, ‘అకారాది నిఘంటువు’ (సంపాదకత్వం) అన్న వాటిని ఇతరులతో కలిసి నిర్మించారు. అందరి దృష్టిలో ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ సమగ్రమైనది. కాని శ్రీహరి గారి దృష్టిలో అది అసమగ్రమైనది. ఇందులో లేని 36000 పదాలను సేకరించి ‘శ్రీహరి నిఘంటువు’ ను నిర్మించారు. ఇది మనకు గర్వకారణం. పాణిని రచించిన ‘అష్టాధ్యాయ’ ప్రపంచంలోనే గొప్ప వ్యాకరణ గ్రంథంగా ప్రఖ్యాత పొందింది. మహా వ్యాకరణవేత్త మేధకు మహా మహా పండితులే ఆశ్చర్యపోయారు. ‘This grammar is one of the greatest monuments of human intelligence’ అని ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త బ్లూంఫేల్డ్ ప్రస్తుతించారు. ఇక విశ్వవిఖ్యాత పండితుడు గేథే ‘ There is no grammar in any language that could be vied with the wonderful mechanism of paninis Asthadyayi’ అని అన్నాడు. అట్లాంటి ఉద్గ్రంథాన్ని అనువదించటానికి విశ్వ విద్యాలయాలు కూడా ముందుకు రావు.

అట్లాంటిది శ్రీహరి గారు ఒక చేతి మీదుగా 2500 పేజీల గ్రంథాన్ని రెండు భాగాలుగా తెలుగులోకి అనువదించారు! సంస్కృత భాష మీద వారికి ఎనలేని అభిమానం వుంది. ఎనిమిది సంవత్సరాలపాటు ఆకాశవాణి ద్వారా బాల బాలికలకు సులభ శైలిలో సంస్కృత పాఠాలు బోధించారు. సంస్కృతాన్ని ఆధునికీకరించటానికి, పరిధులు పెంచడానికి అనువాదాలు అవసరమని గుర్తించి సినారె ‘ప్రపంచ పది’, ‘జాషువా ఫిరదౌసి, శేషప్ప కవి ‘నరసింహ శతకం, వేమన శతకం, అన్నమయ్య కీర్తనలు సంస్కృతంలోకి అనువదించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ప్రధాన సంపాదకులుగా ఉంటూ 200 విలువైన గ్రంథాలను వెలుగులోకి తెచ్చారు రవ్వా శ్రీహరి గారు. విద్యార్థులను పుత్ర సమానులుగా ప్రేమించిన వారు శ్రీహరి గారు. ఎవరినీ, ఎప్పుడూ, దేని కోసమూ ఆదేశించని వారు. పద పదానికి చందన చర్చ చేసిన మహానుభావుడు, వందన సమర్పణ చేసి బహుశా సంస్కృతం మాట్లాడే సుర లోకానికి వెళ్లిపోయారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

అమ్మంగి వేణుగోపాల్
9441054637

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News