రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్న మోడీ
బండి, రేవంత్‌లు కెసిఆర్
కాలిగోటికి సరిపోరు కొత్త
ఓటర్లకు తెలంగాణ ఉద్యమ
ప్రస్తానం తెలియజేయడానికే
ఐప్యాక్ సంస్థతో ఒప్పందం
మోడీ ప్రభుత్వానికి
ప్రత్యామ్నయంపై కెసిఆరే
నిర్ణయం తీసుకుంటారు
గడువు ప్రకారమే రాష్ట్రంలో
ఎన్నికలు మన తెలంగాణ
ఇంటర్వూలో టిఆర్‌ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధిస్తామని కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. అసలు కెసి ఆర్ అనే మూడు అక్షరాల పేరు, టిఆర్‌ఎస్ అనే పా ర్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాద న్నారు. టిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసి 21 సంవత్సరా లు అవుతున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ లోని హెచ్‌ఐసిసి ప్రాంగణంలో పార్టీ ఆవిర్భావ వే డుకల ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మన తెలంగాణ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో కెటిఆర్ అనేక విషయాలపై స్పందించారు. ఎనిమిది సంవత్సరాల్లో టిఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో 95 శాతం నెర వేర్చామని, కేంద్రంలోని నరేండ్రమోడీ ప్రభుత్వం కనీసం ఐదు శాతం హామీలను కూడా నిలబెట్టుకోలే పోయిందని అన్నారు.
మోడీ సర్కార్ హలాల్, హి జాబ్ అంటూ మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచ ఆకలిసూచీ లో అట్టడుగున ఉండడం కేంద్ర పనితీరుకు నిదర్శ నమని చురుకలు అంటించారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరి మితి మేరకు అప్పులు తీసుకుని ఆ రుణాల ద్వారా రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాని కెటిఆర్ స్పష్టం చేశారు. ఎటువంటి సహాయ సహకారాల ను అందివ్వనప్పటికీ సిఎం కెసిఆర్ తన విజన్‌తో రాష్ట్రాన్ని బంగారుమయం చేస్తున్నారన్నారు. అసా ధారణమైన కొన్ని అద్భుతాలు సృష్టించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలనే ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రతిపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడాన్ని తాను తప్పపట్టడం లేదన్నారు. అయితే నిజంగానే తమ పాలనలో తప్పులు…అవినీతిగానీ జరిగి ఉంటే దమ్ముంటే ఆధారాలతో సహ బయటపెట్టాలని విపక్షాలకు ఆయన సవాల్ విసిరారు.
గవర్నర్‌ను అన్ని విధాలుగా గౌరవించాం
గవర్నర్‌ను అన్ని విధాలుగా గౌరవించామన్నారు. కానీ గౌరవమర్యాదలు పరస్పరం ఉండాలన్నారు. తనను తాను గొప్పగా ఊహించుకొని ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని పడేస్తాను… ఫైలు ఆపితే 15 రోజుల్లో ప్రభుత్వం పడిపోయేది అని చెప్పడం ఏమిటి?అని ప్రశ్నించారు. గత జనవరి 26వ తేదీన ఆమె చేసిన ప్రసంగానికి రాష్ట్ర కేబినెట్ నుంచి ఆమోదం పొంద లేదన్నారు. అయినప్పటికీ ఆమె ఇష్టానుసారంగా చదివారన్నారు.రాజ్యాంగంలో గవర్నర్ పాత్ర చాలా చిన్నదన్నారు. రాష్ట్రానికి రాజ్యాంగం తరఫున అధిపతియే అయినప్పటికీ. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కీలకమన్నారు. అలాంటి పదవిలో కొనసాగుతున్న వారు రాజకీయాలు చేయకాడదన్నారు. ఆమెకు రాజకీయవాసనలు పోలేదన్నారు. మోడీ గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు రాజకీయాలతో సంబంధం లేని వారే గవర్నర్లుగా ఉండాలని, సర్కారియా కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని అప్పట్లో డిమాండు చేశారన్నారు. తీరా ఆయన ప్రధాని అయ్యాక చేసిందేమిటి? తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షురాలిని గవర్నర్‌గా వేశారన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్న మోడీ
నరేంద్రమోడీ రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నాశనం పట్టిస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు. దేశ ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదలిపెట్టి ప్రత్యర్ధి పార్టీలను, ప్రభుత్వాలను బలహీనపరచడమే లక్షంగా పెట్టుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై ఇడి, ఐటి, సిబిఐ వంచి వ్యవస్థలను ప్రయోగిస్తున్నారన్నారు. ఇదేనా? ప్రజాస్వామ్యం పట్ల ప్రధానికి ఉన్న గౌరవం అని కెటిఆర్ ప్రశ్నించారు. టిడిపిలో ఉన్న సిఎం రమేశ్, సుజనాచౌదరిలపై ఇలాంటి అస్త్రాలను ఉపయోగించిన కేంద్రం….బిజెపిలో చేరిన తరువాత ఆ కేసుల విషయాన్నే మరిచిపోయిందని విమర్శించారు. ఇక బిజెపి పాలత రాష్ట్రాల్లో అసలు తప్పులే జరగడం లేదన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ఆ రాష్ట్రాల్లో ఎందుకు అరెస్టులు, కేసులు కావడం లేదని ప్రశ్నించారు. బిజెపి ఉన్న రాష్ట్రాలు తప్ప ఇతర రాష్ట్రాలు తప్పులు చేస్తున్నాయా? అంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
కాంగ్రెస్ మునిగిపోయే నావ
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని కెటిఆర్ అన్నారు. ఆ పార్టీలో ప్రశాంత్ కిషోర్ ( పికె) చేరినా…లేదా మరో నాయకుడి చేరినా పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. పికె కాంగ్రెస్‌లో చేరినా….ఐప్యాక్ సంస్థతో తాము కలిసి పనిచేస్తామన్నారు. ఆయనకు…ఐ ప్యాక్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా ప్రజల్లో ఆదరణ ఉంటేనే ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్నారు. కేవలం సర్వే సంస్థలను నమ్ముకుని ఉండదన్నారు. అదే సూత్రాన్ని టిఆర్‌ఎస్ కూడా పాటిస్తోందన్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి కొత్తగా ఓటు వేస్తున్న యువతకు కెసిఆర్ కేవలం ముఖ్యమంత్రిగా మాత్రమే తెలుసున్నారు. కానీ రాష్ట్ర సాధన కోసం పద్నాలుగు సంవత్సరాల పాటు ఆయన పడిన శ్రమ…ఎదుర్కొన్న కష్టాలు తెలియవన్నారు. ఆ అంశాలను కొత్త ఓటర్లకు సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీని మరింత చేరవుగా తీసుకపోవడం లో ఐప్యాక్ సంస్థకు మంచి అనుభవం ఉందన్నారు.
సంపద సృష్టించడానికే అప్పులు
రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. ఏ సమస్యలూ లేవన్నారు. దీంతో విపక్షాలు పనికిరాని విమర్శలు చేస్తున్నాయని కెటిఆర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులకు లోబడే అప్పులు చేస్తోందన్నారు. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జిఎస్‌డిపి)లో అప్పుల నిష్పత్తి కేవలం 22 శాతమేనని అన్నారు. అదే కేంద్ర ప్రభుత్వంలో 65 శాతం ఉందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక రూ.132 లక్షల కోట్ల అప్పులు తెచ్చారన్నారు. అప్పును ఉత్పాదక పెట్టుబడిగా భావించాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్తు సాగు, తాగునీటి రంగాలకు వెచ్చించడం ద్వారా సంపదను సృష్టిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అప్పుల కంటే మిగులు ఆదాయమే ఎక్కువని అన్నారు. దేశంలోని ఆర్థిక పరిపుష్టి కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్షా 24 వేల రూపాయలు. ఈరోజు 2లక్షల 78వేల రూపాయన్నారు. 2014లో రాష్ట్ర జిఎస్‌ఒపి 5లక్షల 6వేల కోట్లు కాగా ఈరోజు 11 లక్షల 55వేల కోట్లు అన్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోన్న నాలుగో అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ అన్నారు. శ్రీలంకలో వచ్చిన పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చే సమస్యే లేదన్నారు.
111 జీవో రద్దుపై ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నాం
111 జీవో రద్దు వెనుక ఇన్‌సైడర్ ట్రేడింగు జరిగిందని ప్రతిపక్షాలు ఆధారాల్లేకుండా మాట్లాడుతున్నారు. కెసిఆర్ కుటుంబానికి చెందిన వారికి అక్రమంగా ఎలాంటి భూములు లేవని కెటిఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తాము చెప్పిన దానికంటే ఒక్క అంగుళం భూమి ఎక్కువ ఉన్నాయని నిరూపిస్తే….వాటిని ప్రతిపక్ష నాయకులకే రాసిస్తామన్నారు.
కేంద్ర అసమర్ధత కారణంగానే పెట్రోమంట
కేంద్ర అసమర్థత కారణంగానే దేశంలో చమురు ధరలు పెరిగిపోతున్నాయని కెటిఆర్ అన్నారు. 2014లో ముడిచమురు గ్యాలన్ ధర 105 డాలర్లు ఉండగా ప్రస్తుతం కూడా అంతే ఉందన్నారు. కానీ అప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.70 నుంచి రూ. 120లకు పెరిగిందన్నారు.
ప్రభుత్వం ఎవరిని ఉపేక్షంచదు
రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలపై కెటిఆర్ స్పందించారు. వీటిపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కూడా ఖండించారు. రామాయంపేటకు చెందిన తల్లీకొడుకుల ఆత్మహత్యలకు సంబంధించి తమ పార్టీకి చెందిన నేతలపై ఆరోపణలు రాగానే స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో మాట్లాడానని అన్నారు. నిందితులు వెంటనే లొంగిపోవాలని, వారు ఎక్కడైనా ఉంటే పోలీసులకు అప్పగించాలని చెప్పానని అన్నారు. తప్పు చేసిన వారి విషయంలో తరతమ భేదాలేవని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చెప్పేదే నిజం కాదు. వాస్తవాలను ధ్రువీకరించుకోవాలి. ఖమ్మం ఘటనలో యువకుడిని ఆత్మహత్యపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. మంత్రిపై చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రాజకీయంగా పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి…. కానీ ఇష్టానుసారం అవాక్కులు చెవాక్కులు పేలవద్దన్నారు.
మతం పేరిట చిచ్చు పెడుతున్నారు
కేంద్రప్రభుత్వ విధానాలపై సునిశిత విమర్శలు చేశారు. ఏడేళ్లలో ఏ వర్గానికీ న్యాయం చేయలేదని ఆరోపించారు. ఎన్నికల హమీలను తుంగలో తొక్కిన మోదీ సర్కార్.. హలాల్, హిజాబ్ అంటూ మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచ ఆకలిసూచీలో అట్టడుగున ఉండటం కేంద్ర పనితీరుకు నిదర్శనమని చురకలు అంటించారు. దేశంలో 30 ఏళ్ల పతాకస్థాయికి దేశంలో ద్రవ్యోల్బణం పడిపోయిందని, ప్రపంచ ఆకలి సూచికలో భారత్ స్థానం 103 అని ఆయన గుర్తు చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కానీ… కష్టాలు రెట్టింపయ్యాయన్నారు. వీటి నుంచి ప్రజల దృష్టి మార్చేందుకే మతం పేర భావోద్వేగాలు రెచ్చగొడుతుందన్నారు. అభివృద్ధితో పోటీ పడలేని బిజెపి ప్రజల మధ్య మత చిచ్చు, భావోద్వేగాలు రేకెత్తించి లబ్ధిపొందే కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు
ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉండడం అత్యంత సహజమన్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఆశలు, ఆకాంక్షలు తీర్చడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. అయితే తెలంగాణలో మాత్రం టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెద్దగా లేదన్నారు. 2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 63 సీట్లు సాధించిందన్నారు. 2018లో దాదాపు 90 సీట్లు గెలిచామన్నారు. ఎన్నికల్లో మా బలం పెరుగుతోంది తప్ప తగ్గడం లేదన్నారు. ఎక్కడైనా శాసనసభ్యులపై అసంతృప్తులు ఉంటే వాటిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
వాపును బలుపు అనుకోవద్దు
ప్రతిపక్షాలు వాపును చూసి బలుపు అనుకోవద్దు అన్నారు. టివిలు, సామాజిక మాధ్యమాలు, అరుపులు, కేకలు, హడావిడిని నమ్మొద్దు అని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న అహంతో బిజెపి నేతలు అప్పుడే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఇదే విధంగా గత అసెంబ్లీ ఎన్నిక్లలో వ్యవహరించిన ఆ పార్టీ 108 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే సీన్ వచ్చేఎన్నికల్లో రిపీట్ కానుందన్నారు. ప్రస్తుతం ఆరేడు స్థానాల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ కూడా వచ్చే ఎన్నికల్లో ఒకటి, రెండు స్థానాలకే పరిమితం కానుందన్నారు.
ప్రత్యామ్నాయంపై కెసిఆరే నిర్ణయిస్తారు
సిఎం కెసిఆర్‌కు సుదీర్ఘ రాజకీయానుభవం ఉందన్నారు. అన్ని రాష్ట్రాల సిఎంలతో ఆయనకు సత్సంబంధాలున్నాయన్నారు. వారితో జాతీయ రాజకీయాలపై మాట్లాడుతున్నారన్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతికేంగా ఎలాంటి కూటమి ఉండాలన్న విషయాన్ని కెసిఆర్ వెల్లడిస్తారన్నారు. భౌగోళికంగా తెలంగాణ దేశంలో 11వ స్థానం, జనాభాపరంగా 12వ స్థానంలో ఉన్నా దేశ ఆర్థిక వ్యవస్థకు నాలుగో అతి పెద్ద భాగస్వామిగా ఉందన్నారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపేణా రూ.3,65,797 కోట్లను కేంద్రానికి చెల్లించగా… అందులో రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్రానికి వాటాగా వచ్చాయన్నారు. మరో రూ. 2 లక్షల కోట్లను జాతి నిర్మాణానికి రాష్ట్రం అందించిందన్నారు.
కెసిఆర్ నాయకత్వంలో పనిచేయడమే అదృష్టం
కెసిఆర్ నాయకత్వంలో సామాన్య కార్యకర్తగా పనిచేయడమే పెద్ద అదృష్టంగా భావిస్తానని కెటిఆర్ అన్నారు. అటువంటిది ఆయన హయంలో మంత్రిగా కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఫీలవుతున్నానని అన్నారు. సిఎం పదవిని ఎప్పుడు చేపట్టపోతున్నారని అడిగిన అంశంపై ఆయన స్పందిస్తూ… ఆశ ఉండాలి గానీ, దురాశ ఉండొద్దు అన్నారు. సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో ఎంఎల్‌ఎ అయ్యానని, వారికి శాశ్వతంగా రుణపడి ఉంటానని అన్నారు. అలాగే మంత్రిని అవుతాననుకోలేదని, కానీ కెసిఆర్ దయతో ఆ పదవి ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలన్నదే తన ఆశయమన్నారు. అంతే తప్ప సిఎం పదవిపై ఆశ పెట్టుకోలేదన్నారు. కెసిఆర్ నాయకత్వంలో మళ్లీ అవకాశం ఇస్తే మంత్రిగా ఉంటానని… లేకపోతే పార్టీ కోసం పనిచేస్తానని అన్నారు.
కేంద్రం ఇచ్చిందేమిటో చెప్పండి
తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చింది ఒక్కటి చెప్పమనండి అని కెటిఆర్ ప్రశ్నించారు. గతంలో నితిఆయోగ్ సంస్థ సిఫారసు చేసిన విధంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రాలను నిధులు ఇవ్వాలని సూచించిందన్నారు. కాని కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మంత్రి కెటిఆర్ చెప్పకొచ్చారు. ఏడేళ్లలో రాష్ట్రానికి బిజెపి చేసిందేమీ లేదు. సాగు నీటి ప్రాజెక్టులో ఏ ఒక్కదానికి కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. కు మెడికల్ కాలేజీలు, కాజీ పేట కోచ్ ఫ్యాక్టరీలు ఇవ్వలేదన్నారు.