మోడీ, చంద్రబాబు నాయకత్వంలో మూడింతల ప్రగతి సాధిస్తాం
ఏపీలో కూటమికి చరిత్రాత్మక విజయం అందించారు
ఆరు నెలల్లో ఏపీకి రూ.3లక్షల కోట్ల విలువైన సహకారం అందించాం
ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
మన తెలంగాణ / అమరావతి : విపత్తుల వేళ ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని చూస్తే ప్రజలు నిశ్చింతగా ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ సేవలను ఇతర దేశాల నేతలూ ప్రశంసించారని గుర్తుచేశారు. ఆదివారం విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో అమిత్‌షా పాల్గొని ఇక్కడ నూతనంగా నిర్మించిన ఎన్‌ఐడీఎం ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అనూహ్య విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు.
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏవిధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలిసిందే. అప్పుడు జరిగిన విధ్వంసం గురించి చింతించకండి. ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ అండదండలు ఉన్నాయని, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మూడింతల ప్రగతి సాధిస్తామని స్పష్టం చేశారు. ఆరు నెలల్లో ఏపీకి రూ.3లక్షల కోట్ల విలువైన సహకారం అందించాం. విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్లు ప్రకటించామని, ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ముందుకు తీసుకెళ్తామన్నారు. గత ప్రభుత్వం రాజధాని అమరావతిని బుట్టదాఖలు చేసిందని, హడ్కో ద్వారా అమరావతికి రూ.27వేల కోట్ల సాయం అందిస్తున్నామన్నారు.
ఏపీకి జీవనాడి అయిన పోలవరంపై సీఎం చంద్రబాబుతో చర్చించానని, 2028లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పారిస్తామన్నారు. విశాఖలో రూ.2 లక్షల కోట్ల గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడులు వస్తున్నాయని, విశాఖ రైల్వేజోన్‌ను కూడా పట్టాలెక్కించామని అమిత్ షా అన్నారు. తెలుగులో ప్రసంగించలేకపోతున్నందుకు అందరూ తనను క్షమించాలని నవ్వుతూ అన్నారు. ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని వెల్లడించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎల్లవేళలా సహకారం అందిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలుసని, గత ప్రభుత్వం చేసిన విధ్వంసం మానవ విపత్తుకు సంబంధించినదని, ఆ విపత్తు నుంచి రక్షించేందుకు ఎన్డీయే కూటమి వచ్చిందని అమిత్ షా పేర్కొన్నారు.
కేంద్రం సహకారంతో ‘వెంటిలేటర్’ నుంచి బయటపడ్డాం : సీఎం చంద్రబాబు నాయుడు
ఏ విపత్తు వచ్చినా ఎన్డీఆర్‌ఎఫ్ మొదట గుర్తొస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జపాన్, నేపాల్, తుర్కియేలో ప్రకృతి విపత్తులు వచ్చినపుడు సేవలు అందించిందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర యంత్రాంగం పరిష్కరించలేని సమస్యలను ఎన్డీఆర్‌ఎఫ్ పరిష్కరించిందని చెప్పారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. 5 రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చేలా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) ప్రాంగణాన్ని ఏర్పాటు చేశాం. ఎన్డీఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్, ఎన్‌ఐడీఎం ప్రాంగణాలకు 50ఎకరాల భూమి కేటాయించామని, వీటిని పూర్తిచేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
దేశంలో సమస్యల పరిష్కారానికి అమిత్‌షా పట్టుదలతో కృషిచేస్తున్నారని, శాంతిభద్రతలు కాపాడటం సహా చాలా విషయాల్లో ఆయన వినూత్నంగా ఆలోచిస్తారన్నారు. కొన్నిసార్లు అమిత్‌షా పనితీరు చూస్తే తనకు అసూయ కలుగుతుందని, ఏపీ పునర్నిర్మాణంలో వినూత్నంగా ముందుకెళ్లాలని అమిత్‌షా సూచించారని, ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించామన్నారు. ఎన్నికల సమయానికి రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ స్థితి నుంచి బయటపడింది. ఏపీ ఇంకా కోలుకోలేదు. రాజధాని అమరావతికి కేంద్రం నుంచి రూ.15వేల కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ఆర్థికసాయం చేసి ప్రాణం పోశారన్నారు. ఇటీవల విశాఖ రైల్వేజోన్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారని, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కేంద్రం మద్దతు ఇంకా కావాలన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్నాయని, కేంద్రం మద్దతుతో ఏప్రిల్ 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని చంద్రబాబు తెలిపారు.
లక్షల మంది ప్రాణాలు కాపాడారు : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది లక్షల మంది ప్రాణాలు కాపాడారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. మనుషులతో పాటు మూగజీవాల ప్రాణాలనూ రక్షించిందని చెప్పారు. ఇప్పటి వరకు వారు 18,000లకు పైగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించినట్లు వివరించారు. విజయవాడ వరదల్లో ఎన్డీఆర్‌ఎఫ్ అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం ప్రాజెక్టులకు భూమి కేటాయించిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌కు సహాయం ప్రకటించినందుకు, అదేవిధంగా గత ఆర్నెళ్లలో రాష్ట్రానికి కేంద్రానికి అందించిన సహాయానికి థ్యాంక్స్ చెబుతున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రమాదాల నుంచి లక్షల మందిని ఎన్డీఆర్‌ఎఫ్ కాపాడిందన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్, అచ్యుతాపురం సెజ్ ఘటనలు, విజయవాడ వరదల సమయాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అందించిన సేవలను పవన్ గుర్తుచేశారు. దక్షిణ భారత్‌కు సంబంధించి ఎన్డీఆర్‌ఎఫ్ ప్రధాన కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఎన్డీఆర్‌ఎఫ్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేష్ : కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో నిర్వహించిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం 20వ వ్యవస్థాపక దినోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తో పాటు రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా నూతన ఎన్‌ఐడీఎం భవనంతో పాటు 10వ బెటాలియన్ ఎన్డీఆర్‌ఎఫ్ ప్రాంగణాన్ని హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులతో కలిసి నారా లోకేష్ పరిశీలించారు.
సంస్థకు సంబంధించిన విషయాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. అనంతరం ఎన్‌ఐడీఎం భవనంతో పాటు 10వ బెటాలియన్ ఎన్డీఆర్‌ఎఫ్ ప్రాంగణ ప్రారంభోత్సవంలో ఇతర నేతలతో కలిసి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో మొక్కనాటారు. విపత్తుల సమయంలో ఎలా ఎదుర్కోవాలో విన్యాసాల రూపంలో ఎన్డీఆర్‌ఎఫ్ ప్రదర్శనను వీక్షించారు. అనంతరం తిరుపతి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇతర నేతలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు దగ్గరుండి మంత్రి నారా లోకేష్ వీడ్కోలు పలికారు