Wednesday, January 22, 2025

తీర్థం పేరిట యాసిడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నాగర్ కర్నూల్ ప్రతినిధి : గుప్త నిధుల పేరుతో క్షుద్ర పూజలు చేస్తూ.. తీర్ధం పేరిట యాసిడ్, జిల్లేడు పాలను కలిపి పలువురిని కడతేర్చిన నర హంతకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బాధితుల నుండి అందినంత దోచుకొని పరారైన సీరియల్ కిల్లర్‌ను ఎట్టకేలకు అరెస్టు చేశామని జోగులాంబ గద్వాల జోన్ డిఐజి ఎల్ ఎస్ చౌహాన్ వెల్లడించారు. జిల్లా ఎస్‌పి గైక్వాడ్ వైభవ్ రఘునాధ్, అడిషనల్ ఎస్‌పి సిహెచ్ రామేశ్వర్ తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రoలోని శ్రీపురం రోడ్డున గల ఇంద్రానగర్ కాలనీకి చెందిన రామటి సత్యనారాయణ యాదవ్ అనే వ్యక్తి క్షుద్ర పూజల పేరుతో అమాయకులను గుప్త నిధులను తవ్వి ఇస్తానని నమ్మబలికి ఇప్పటివరకు 11 హత్యలు చేసినట్లు తెలిపారు. నిందితుడిని విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టారు. ఆయన కథనం ప్రకారం&అమాయకుల స్థిరాస్తులపై ఈ కరడుగట్టిన రాక్షసుడి కన్ను పడిందంటే వారి ప్రాణాలు పోయినట్లేనని అన్నారు. క్షుద్ర పూజల సమయంలో జిల్లేడు పాలు, ఇతర విష పదార్థాలతో కలిపిన ద్రవాన్ని పాలల్లో కలిపి తీర్ధంగా ఇచ్చేవాడని అన్నారు. హతమార్చాలనుకున్న వ్యక్తి స్పృహ తప్పిన తర్వాత హత్య చేయడమే ఇతని టెక్నిక్ అన్నారు. కొందరిపై యాసిడ్ కూడా పోసినట్లు, మరికొందరిని రాళ్లతో మోది చంపినట్లు వెల్లడించారు.
నాటు వైద్యంతో మొదలై.. తాంత్రిక పూజల వరకు…
నిందితుడు సత్యనారాయణ గత కొన్నేళ్లుగా నాగర్‌కర్నూల్ లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని వారి కుటుంబ నేపథ్యంలో ఉన్న తాంత్రిక పూజలు, ఆకులు అలములతో కూడిన నాటు వైద్యం చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే, అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధితో అమాయకుల నుంచి భూములను నమ్మించి రిజిస్ట్రేషన్ చేసుకుని తదుపరి గుప్తనిధుల పేరిట వరుస హత్యలకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని అన్నారు. వనపర్తి జిల్లా ..బొల్లారం గ్రామానికి చెందిన గోవుల వెంకటేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యం కావడంతో అతని భార్య నాగర్‌కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని అన్నారు. ఎస్‌పి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సారధ్యంలో పోలీసులు గతంలో ఇక్కడ జరిగిన హత్యలకు, వెంకటేష్ హత్యకు దగ్గరి పోలికలు ఉండడంతో ఛాలెంజ్ గా తీసుకొని ఈ కేసును దర్యాప్తు చేయగా సంచలన నిజాలు బయటపడ్డాయని అన్నారు. నిందితుడు సత్యనారాయణ ఒంటరిగానే ఒక్కొక్కరిని హతమారుస్తూ ఒక ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు, జిల్లాలు, రాష్ట్రాల హద్దులు దాటించి ఎవరికీ అనుమానం రాకుండా ఈ వరుస హత్యలకు పాల్పడినట్లు ఆయన వివరించారు. ని నిందితుడిని పట్టుకోవడంలో ప్రధాన భూమిక పోషించిన అధికారులు పోలీసు సిబ్బందికి రివార్డు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News