ఈశాన్య భారతంలోని రాష్ట్రాల పురోభివృద్ధికోసం 1991 లో భారత ప్రభుత్వం చేపట్టిన లుక్ ఈస్ట్ పాలసీ (ఎల్‌ఇపి ), 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించిన యాక్ట్ ఈస్ట్ పాలసీ (ఎఇపి) కోరుకున్న లక్ష్యాలను సాధించలేకపోయాయి. ఈశాన్య భారతంతో తూర్పు, ఆగ్నేయాసియా సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో భారత విదేశాం గ విధానంలో రూపుదిద్దుకున్న కీలక విధానాలు ఇవి. భారతదేశ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యతల దృష్టితో ఈ విధానాలను రూపొందించారు. ఆసియాలో బలమైన ఆర్థిక వ్యవస్థలతో దేశాన్ని అనుసంధానం చేయడానికి, ప్రాంతీయ శక్తులను సమతుల్యం చేయడానికి, దాని వ్యూహాత్మక ప్రభావం పెంచేందుకు ఈ విధానాలు తోడ్పడతాయి.
తూర్పు దేశాలతో భారత దేశ సంబంధాల పటిష్టతకు ఎల్‌ఇపి పునాది వేసినా, ఎఇపి ఈ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, అమలుకు కృషి చేసింది. రెండు విధానాలు ఈశాన్య భారతాన్ని ఆగ్నేయాసియాకు కీలకమైన ద్వారంగా నిలిపాయి. ఈశాన్యంలో 8 రాష్ట్రాలు- ఆసోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, నేపాల్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటాయి. దీంతో ఈ ప్రాంతం భౌగోళికంగా, రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.
భౌగోళికంగా ఒంటరితనం, మౌలిక సదుపాయాల లేమి, తిరుగుబాట్ల కారణంగా ఈశాన్యప్రాంతం చరిత్రాత్మకం గా అణచివేతకు గురైంది. అటువంటి ప్రాంతం ఎల్‌ఇపి, ఎఇపి విధానాలకు కేంద్ర బిందువు అయింది. ఈ ప్రాంతాలను ఆర్థిక కార్యకలాపాలు, కనెక్టివిటీ, వ్యూహాత్మకంగా స్పష్టమైన కేంద్రంగా మార్చాలని ఈ విధానాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం రెండు విధాల లక్ష్యాలు, సాధించిన విజయాలు, లోపాలను విమర్శనాత్మకంగా పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రాష్ట్రాలు భారతదేశ ప్రాంతీయ ఉనికిని గణనీయంగా విస్తరించినా, వాటి విజయం, అమలులో సవాళ్లు, దేశీయపరమైన పరిమితులు, భౌగోళిక, రాజకీయ క్లిష్ట పరిస్థితులు వల్ల పెద్దగా లక్ష్యాలు నెరవేరలేదేమో.
1990వ దశకం ప్రారంభంలో ప్రధాని పివి నరసింహారావు హయాంలో భారతదేశ ఆర్థిక సరళీకృత విధానంతో సమానంగా లుక్ ఈస్ట్ పాలసీ రూపుదిద్దుకుంది. అదే సమయంలో భారతదేశానికి అత్యంత మిత్రదేశమైన సోవియెట్ యూనియన్ పతనంతో మన దేశం ప్రత్యామ్నాయ ఆర్థిక భాగస్వామ్య దేశాలను వెతుక్కోవలసిన అవసరం ఏర్పడింది. దీంతో మన దేశం సింగపూర్, మలేషియా, థాయిలాండ్ వంటి ఆగ్నేయాసియా దేశాలతో పాటు, జపాన్, దక్షిణకొరియా వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు గల తూర్పు ఆసియా దేశాలపై దృష్టి సారించాల్సివచ్చింది. అలాగే, మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలకమైంది. ఎఇపి కింద బంగ్లాదేశ్‌తో అగర్తల అఖౌరా రైలు లింక్, మణిపూర్, అసోంలో రహదారుల అభివృద్ధి వంటి ప్రాజెక్టులు చేపట్టారు. దీంతో అంతర్ ప్రాంతీయ, సరిహద్దు కనెక్టివిటీ కొంతమేరకు మెరుగుపడింది.
మోడీ సర్కార్ చేపట్టిన ఎఇపి విధానం కింద ఈశాన్య కనెక్టివిటీ విజన్ 2020 అమలుతో రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలలో పెట్టుబడులకు వీలుకలిగింది. భారతదేశంతోపాటు, పొరుగు దేశాలనుంచి ఈశాన్య భారతం ఒంటరితనం కాస్తతగ్గింది. అయితే, మణిపూర్‌లో ఇండో మయన్మార్ సరిహద్దుకు కంచెవేయాల్సి రావడం, మయన్మార్ భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య విధానాన్ని భారతదేశం రద్దు చేయడం వంటి చర్యలు ఎల్‌ఇపి, ఎఇపి విధానాల అమలుపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత ఇండో బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బ తినడం కూడా కీలక అవరోధంగా పనిచేశాయి. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఎల్‌ఇపి పునాదులపై నిర్మించినప్పటికీ, ఎఇపి నిష్క్రియాత్మక దశనుంచి చురుగ్గా అభివృద్ధి పై దృష్టి పెట్టింది.
ఎఇపి తన భౌగోళిక పరిధిని ఆగ్నేయాసియాకు మాత్రమేకాక, తూర్పు ఆసియా, ఇండో- ఫసిఫిక్, ఆస్ట్రేలియా, పసిఫిక్ దేశాలకు కూడా విస్తరించింది. అయితే రెండు విధానాలు అమలులో లోటు ఆందోళన కల్గిస్తోంది. భారతదేశం- మయన్మార్, థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి వంటి భారీ కార్యక్రమాలు తీవ్ర అసమర్థత, నిధుల కొరతవల్ల తీవ్రజాప్యాన్ని ఎదుర్కొంటున్నందువల్ల ప్రాజెక్టుల అమలు దెబ్బతింది. ఎఇపి విధానం ప్రతిష్ఠాత్మకంగా దార్శనికతతో చేపట్టినా, ఆచరణలో ఇబ్బందులు ఎదురయ్యా యి. ఉదాహరణకు జపాన్‌తో ప్రతిపాదించిన ఆసియా -ఆఫ్రికా గ్రోత్ కారిడార్ పురోగతి చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్‌ఐ) ప్రాజెక్టుతో పోలిస్తే నత్తనడకగా సాగింది. మన దేశం దేశీయ మౌలిక సదుపాయాలలో అడ్డంకులు, ఇతర లోపాలు, విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపకపోవడం మరింత నిరుత్సాహపరచాయి. దీంతో ఎఇపి లక్ష్యమైన కనెక్టివిటీ దెబ్బతింది.
నిజానికి దేశీయంగా, ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, కనెక్టివిటీ ప్రాజెక్టులను వేగవంతం చేయడం వల్ల ఆగ్నేయాసియాకు ప్రవేశద్వారంగా ఈ ప్రాంతం సామర్థ్యం ఎంతగానో పెరుగుతుంది. చైనా ఆర్థిక ఆధిపత్యాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు భారతదేశం విలువలతో కూడిన ప్రజలతో పరస్పర సంబంధాలను నిర్మించుకునేందుకు, సాంసృ్కతిక సంబంధాలను మరింత పటిష్టపరచుకునేందుకు కృషిచేయాలి. ఎఇపి విజయం స్థిరమైన రాజకీయ సంకల్పం, సమర్థంగా అమలు, ఈ ప్రాంతం భౌగోళిక రాజకీయ సంక్లిష్టతలను పరిష్కరించేందుకు స్పష్టమైన వ్యూహాన్ని అనుసరించడంపై ఆధారపడి ఉంటుంది. ఈశాన్య ప్రాంతాన్ని ఆగ్నేయాసియాకు వారధిగా నిర్మించేందుకు భారత విస్తృత విదేశాంగ విధానాల లక్ష్యాలతో ఎఇపి, ఎల్‌ఇపిలను అనుసంధారపరచడం కీలకం.
ఆగ్నేయాసియా దేశాలతో ముఖ్యం గా మయన్మార్, థాయిలాండ్లతో సరిహద్దు వాణిజ్యం, కనెక్టివిటీ ప్రోత్సహించడం ద్వారా ఈశాన్య ప్రాంతాన్ని ఆర్థిక నెట్ వర్క్‌లతో అనుసంధానం చేసేందుకు ఎల్‌ఇపి విధానం తోడ్పడింది. ఆర్థిక వ్యవహారాలకు అతీతంగా ఈ విధానాలు భద్రతాపరమైన సహకారాన్ని పెంపొందించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాల వ్యూహాత్మక ఔచిత్యాన్ని పెంచుతాయి. ఎఇపి మయన్మార్‌తో సంబంధాల ద్వారా సరిహద్దు తిరుగుబాట్లు, అక్రమ రవాణాను ఎదుర్కొనడానికి ప్రాధాన్యత ఇచ్చింది. అయితే వియత్నాం వంటి ఆసియన్ దేశాలతో భారతదేశ రక్షణ సంబంధాలు ప్రాంతీయ భద్రత విస్తరణలో ఈశాన్య రాష్ట్రాల పాత్రను పరోక్షంగా బలోపేతం చేస్తాయి.
ఇలాంటి ప్రాధాన్యం ఉన్నా, ఎల్‌ఇపి, ఎఇపి ఈశాన్య ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొన్నాయి. అమలులో జాప్యం క్లిష్టమైన అడ్డంకిగా మారింది. మయన్మార్‌లో ప్రభుత్వం అసమర్థతలు, నిధుల కొరత, రాజకీయ అస్థిరత కారణంగా ట్రైలేటరల్ హైవే, కలడాన్ ప్రాజెక్టులకు పెను సవాళ్లు ఎదురయ్యాయి. విపరీతమైన జాప్యం కారణంగా ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ వాణిజ్య నెట్ వర్క్ అమలు దెబ్బతింది. ఈశాన్య రాష్ట్రాలలో ఆర్థిక అసమానతలు కూడా సవాళ్లుగా నిలిచాయి. అసోం, త్రిపుర వంటి రాష్ట్రాలు కనెక్టివిటీ, వాణిజ్య కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందగా, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ వంటి కొండ ప్రాంత రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అభివృద్థి చెందలేదు. కేవలం పెద్ద ప్రాజెక్టులపైనే దృష్టి సారించి, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయకపోవడం, స్థానిక మార్కెట్‌లను ప్రోత్సహించకపోవడంతో సమగ్ర అభివృద్ధి దెబ్బతింది. ఇవి ప్రాంతీయ అభివృద్ధిలో కీలకమైనవి. దేశీయపరమైన ఇబ్బందులు, పరిమితులు, విధానాల ప్రభావాన్ని తగ్గిస్తాయి.
నిరంతర విద్యుత్ సరఫరా, బలమైన పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడమే కాక, మౌలిక సదుపాయాలు మరీ దారుణంగా ఉండడంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ ప్రాంతం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులపై పూర్తిగా ఆధారపడడం, అవినీతి, పాలనాపరమైన సమస్యలు ప్రాజెక్టుల అమలుకు పెద్ద అవరోధం అయ్యాయి. ఆగ్నేయాసియాలో దూసుకుపోతున్న చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టుతో పోల్చినప్పుడు భారతదేశం అమలు చేస్తున్న ఎఇపికి తగినంత ఆర్థిక వనరులు అందలేదు. ఈ లోపాలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలి.
అంకితభావంతో నిధుల కేటాయింపు చేపట్టి పాలనా యంత్రాంగాన్ని మరింత క్రమబద్ధీకరించి ప్రాజెక్టు అమలును వేగవంతం చేయాలి. ఎఇపి కింద ఈశాన్య ప్రాజెక్టులకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు సకాలంలో అవి పూర్తయ్యేలా చూడాలి. మయన్మార్ సహకారంతోపాటు సరిహద్దు భద్రత పెంచడం ద్వారా అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మెగా- ప్రాజెక్టులతోపాటు వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమలు, హస్తకళలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వరా సమగ్ర అభివృద్ధిని సాధించవచ్చు. దీనివల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు మారుమూల ప్రాంతాలకు కచ్చితంగా చేరతాయి.
విధానాల లోపం.. ఈశాన్యానికి శాపంవృత్తి శిక్షణ, ఆసియాన్, కేంద్రీకృత విద్యా కార్యక్రమాల ద్వారా మూలధనం పెట్టుబడి పెట్టడం వల్ల సాధికారత లభిస్తుంది. ఈశాన్య ప్రాంతాన్ని ఆగ్నేయాసియాతో అనుసంధానించే సాంసృ్కతిక ఉత్సవాలు, పర్యాటక సర్క్యూట్ లవంటి వాటిని ప్రోత్సహించడం వల్ల ప్రజలమధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. చివరిగా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులకు దీటైన, స్థిరమైన, పారదర్శకమైన ప్రత్యామ్నాయాలను అందించడంతో పాటు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో భాగస్వామ్యాలను పెంచుకోవాలి. దీని ద్వారా భారతదేశం, చైనా ఈ ప్రాంతంలో చూపే ప్రభావాన్ని తగ్గించగలదు. ఈ లోపాలన్నింటినీ పరిష్కరించడం ద్వారా మరింత సమగ్రమైన, సుస్థిరమైన అభివృద్ధికి కృషి చేయాలి. అప్పుడే, భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎల్‌ఇపి, ఎఇపి విధానాలు ఈశాన్య భారతాన్ని ఆగ్నేయాసియాతో అనుసంధానించడమే కాక, ఈ ప్రాంతాన్ని సుసంపన్నమైన ప్రాంతంగా అభివృద్ధి చేయగలదు.
(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)
గీతార్థ పాఠక్
ఈశాన్యోపనిషత్