Saturday, December 21, 2024

మహువాపై వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాపై వేటు పడింది. పార్లమెంటులో ప్రశ్న లు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారని ఆమెపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. బిజెపి ఎంపి నిషికాంత్ దూబేఇచ్చిన ఫిర్యాదు మేరకు లో క్‌సభ ఎథిక్స్ కమిటీ ఆమెపై విచారణ జరిపింది. ఆమె తప్పు చేసినట్లుగా నివేదిక ఇచ్చింది.ఈ నివేదిక ఆధారంగా ఆమెను సభనుంచి బహిష్కరించా రు. మహువా మొయిత్రాను లోక్‌సభ బహిష్కరించాలని కోరే తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. ఎంపి మహువా మొయిత్రా అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డారని, ఐడి, పాస్‌వర్డ్‌లను గుర్తు తెలియని వ్యక్తులతో షేర్ చేసుకున్నారని, అందుకు ఆమెను పార్లమెంటునుంచి సస్పెండ్ చేయాలని తీర్మానంపై చర్చ సం దర్భంగా మంత్రి కోరారు. ఎథిక్స్ కమిటీ నివేదికపై సభలో వాడి వేడి చర్చ జరిగింది. కమిటీ నివేదికపై మాట్లాడేందుకు మొయిత్రాను అనుమతించాలని తృణమూల్ కాంగ్రెస్‌తో పాటుగా విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఆమె మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించలేదు. తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించింది. ‘ఎంపి మహువా మొయిత్రా అనైతికంగా, అమరర్యాదకరంగా ప్రవర్తించారని కమిటీ చేసిన తీర్మానాన్ని ఈ సభ ఆమోదించింది. అందువల్ల ఇకపై ఆమె ఎంపిగా కొనసాగడం తగదు’ అని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూమెను సభనుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది. అంతకు ముందు ఎథిక్స్ కమిటీ నివేదికను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తీర్మానాన్ని అధ్యయనం చేసేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని, నివేదికపై ఓటింగ్‌కు ముందు సభలో చర్చించాలని టిఎంసి సహా విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నివేదికపై చర్చించేందుకు స్పీకర్ కొంత సమయం ఇచ్చారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని మహువా కోరగా స్పీకర్ అందుకు నిరాకరించారు.

ఈ సందర్భంగా స్పీకర్ గతంలో జరిగిన ఇలాంటి ఘటననే గుర్తు చేశారు. 2005లో అప్పటి లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఇలాగే డబులకు ప్రశ్నలు అడిగినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది సభ్యులను మాట్లాడేందుకు అనుమతించలేదని ఆయన అన్నారు. అంతేకాదు ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజే ఆ పదిమంది సభ్యుల బహిష్కరణకు సంబంధించిన తీర్మానాన్ని అప్పుడు సభా నాయకుడుగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ ప్రవేశ పెట్టారని కూడా ఓం బిర్లా గుర్తు చేశారు. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందానినుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదయిన కానుకలు తీసుకున్నారని, ఆమె పార్లమెంటు లాగిన్ వివరాలను దుబాయినుంచి యాక్సెస్ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్ కమిటీ మహువా మొయిత్రాతో పాటుగా ఆమెపై ఫిర్యాదు చేసిన బిజెపి ఎంపి నిషికాంత్ దూబే, న్యాయవాది అనంత్ దెహద్రాయ్ (మహువా మాజీ మిత్రుడు)ను విచారించింది. అనంతరం 500 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది. మహువా అనైతిక ప్రవర్తనకు, సభా ధిక్కరణకు పాల్పడ్డారని ఎథిక్స్ కమిటీ పేర్కొంది. నిబంధనలకు వ్యతిరేకంగా తన పార్లమెంటు లాగిన్ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చిట్లు నిర్ధారించింది.
రేపటి నుంచి నా ఇంటికి సిబిఐని పంపిస్తారేమో : మొయిత్రా
పార్లమెంటునుంచి తన బహిష్కరణను తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా తీవ్రంగా వ్యతిరేకించారు. శుక్రవారం సభనుంచి తనను బహిష్కరించిన తర్వాత పార్లమెంటు వెలుపల ఆమె విలేఖరులతో మాట్లాడుతూ.. ‘ఎథిక్స్ కమిటీ ప్రతి నిబంధనను ఉల్లంఘించింది. మమ్మల్ని అణగదొక్కేందుకు ఈ కమిటీని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా కేవలం ఇద్దరు వ్యక్తులు చెపిన మాటలను నమ్మి నన్ను దోషిగా నిర్ధారించారు. నన్ను వేధించేందుకు రేపటినుంచి నా ఇంటికి సిబిఐని పంపిస్తారేమో’ అని అన్నారు.
ఈ యుద్ధంలో మొయిత్రా విజయం సాధిస్తారు : మమత
కాగా, తమ పార్టీ ఎంపి మహువా మొయిత్రాను లోక్‌సభనుంచి బహిష్కరించడాన్ని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు.ఈ చర్యను దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు జరిగిన ద్రోహంగా అభివర్ణించారు.‘ ఈ ఘటన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సిగ్గుచోటు. మహువా మొయిత్రా బహిష్కరణను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సమయంలో ఆమెకు పార్టీ అండగా ఉంటుంది. ఎన్నికల్లో మమ్మల్ని ఓడించలేక బిజెపి ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోంది. ఇలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇది విచారకరమైన రోజు. ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం’ అని మమత విలేఖరులతో అన్నారు.‘ లోక్‌సభలో చర్చ సందర్భంగా మహువాకు కనీసం తన వాదనను వినిపించుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడం చాలా అన్యాయం. మెజారిటీ ఉంది కనకు తాము ఏమైనా చేయవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. కానీ వారు అధికారం దిగే రోజు వస్తుంది.ఆ విషయం వారు గుర్తు పెట్టుకోవాలి’ అని కేంద్రాన్ని దుయ్యబట్టారు. ఈ యుద్ధంతో మహువా తప్పకుండా విజయం సాధిస్తారని, వచ్చే ఎన్నికల్లో మరింత మెజారిటీతో మళ్లీ పార్లమెంటులో అడుగుపెడతారని మమతా బెనర్జీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News