Monday, December 23, 2024

ఎంపి ప్రజ్వల్ డిప్లొమాట్ పాస్‌పోర్టు రద్దుకు చర్యలు

- Advertisement -
- Advertisement -

సస్పెండ్ అయిన జెడి(ఎస్) ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ చర్యలు ప్రారంభించింది. పాస్‌పోర్టు చట్టం ప్రకారం సెక్షన్ 6 లోని సబ్‌సెక్షన్ (1) నిబంధన కింద లేదా సెక్షన్ 19 లోని ఏదైనా నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోఈ దౌత్యపాస్‌పోర్టును లేదా ట్రావెల్ డాక్యుమెంట్లను రద్దు చేయవచ్చు. ఈమేరకు చట్ట ప్రకారం దౌత్యపాస్‌పోర్టును రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం తెలియజేశారు. డిప్లొమాటిక్ (దౌత్య) పాస్‌పోర్టును ఎందుకు రద్దు చేయకూడదో పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ ఇప్పటికే ప్రజ్వల్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. లైంగిక వేధింపులు, అపహరణ, అత్యాచారం తదితర ఆరోపణలతో తన పేరు బయటపడిన ఒక రోజు ముందే ప్రజ్వల్ నెల రోజుల క్రితం డిప్లొమాటిక్ పాస్‌పోర్టుపై విదేశాలకు వెళ్లిపోయాడు.

ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు (సిట్) బృందాన్ని నియమించింది. ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నుంచి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు అభ్యర్థన రావడంతో చర్యలు ప్రారంభమయ్యాయి. ఈనెల 31న ఉదయం 10 గంటలకు సిట్ ముందు విచారణకు హాజరు కావడానికి ప్రజ్వల్ జర్మనీలో మ్యూనిచ్ నగరం ఎయిర్‌పోర్టు నుంచి గురువారం ఉదయం 11.20 గంటలకు బెంగళూరుకు బిజినెస్ క్లాస్ విమానంలో బయలుదేరాడు. బెంగళూరుకు చేరుకోగానే అవసరమైతే విమానాశ్రయం లోనే ప్రజ్వల్ అరెస్ట్ కావచ్చునని కర్ణాటక హోం మంత్రి చెప్పారు. ఇదిలా ఉండగా గురువారం వందలాది మంది ప్రజ్వల్ బాధితులకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ హసన్‌లో నిరసన ర్యాలీ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News