మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిసి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. గురువారం జరిగిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేయడానికి కొందరు కుట్ర పన్నడాన్ని 14 బిసి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ సందర్భంగా జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజకీయంగా వ్యతిరేకించే వారు ఎన్నికల ద్వారా ఎదుర్కోవాలి తప్ప, హత్య రాజకీయాల సంస్కృతి సరియైనది విధానం కాదన్నారు.
ఇలాంటి ఘటనలు సమాజంలో అనేక పరిణామాలకు దారి తీస్తుందన్నారు. బిసి కులాల నుంచి వచ్చి స్వశక్తితో ఉద్యమాల ద్వారా ఎదుగుతూ వచ్చిన శ్రీనివాస్‌గౌడ్‌ను ఓర్వలేక హత్య రాజకీయాలకు పాల్పడాలనే ఆలోచన రావడం దుర్మార్గం అన్నారు. ఈ కేసును లోతుగా విచారించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో గ్రామాలలో బిసి కులాలపై దౌర్జన్యాలు, అత్యాచారాలు పెరిగాయని వీటిని అరికట్టడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బిసి సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, రాజేందర్, నీలం వెంకటేష్,.అనంతయ్య, గోరిగె మల్లేష్ యాదవ్, కృష్ణయాదవ్, కూనూరు నర్సింహగౌడ్, జిల్లపల్లి అంజి, బర్క కృష్ణ ,ముత్యం వెంకన్న గౌడ్ ,మధుసూదన్, వెంకన్న, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.