మరిపెడ: మండలంలోని పాంబండ తండా గ్రామ పంచాయితీ పరిధిలోని కుంటను ధ్వంసం చేసి, సదును చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అదే తండాకు చెందిన గిరిజన రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జెసిబితో ధ్వంసం చేసిన కుంట వద్ద గిరిజన రైతులు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు భూక్య వీరన్న, అజ్మీర కిషన్, భూక్య మేగ్యా, పెద్ద వీరన్న, రూప్ల, యాకసాయిలు, గజ్జి నాగయ్యలు మాట్లాడుతూ పాంబండ తండా శివారులోని మూడు ఎకరాల విస్తీర్ణంలో కుంట నిర్మించి 40 ఏళ్ల క్రితం నుంచే నిర్మించి ఉందని, ఇట్టి కుంటను ప్రక్క గ్రామమైన మండలంలోని గిరిపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుంట నాకు పట్టా ఉందని, కుంట చుట్టు ప్రక్కల రైతులు, తండావాసులు లేని సమయంలో జెసిబితో కుంట కట్టను పూర్తిగా ధ్వంసం చేసి కుంట లోతట్టు ప్రాంతాన్ని మట్టితో సదును చేశారని వారు ఆరోపించారు.
మరునాడు విషయం తండావాసులు కుంట వద్దకు వచ్చి సదరు వ్యక్తితో ఘర్షణకు దిగడంతో అక్కడి నుంచి జెసిబిని తీసుకుని వెళ్లిపోయాడని తెలిపారు. ఎనుకట 40 సంవత్సరాల కింద నిర్మించిన ఈ కుంట క్రింద సుమారు 30 ఎకరాలు పంట భూములకు సాగునీరు అందుతుందన్నారు. అదేవిధంగా జీవాలకు ఈ కుంటలో దాహాం తీర్చుకుంటాయని తెలిపారు. తాము లేని సమయంలో చాటుమాటున వచ్చి కుంట కట్టను పూర్తిగా ధ్వంసం చేశాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కుంట ధ్వంసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, అదే కుంటను పునర్నిర్మాణం చేసేలా చర్యలు చేపట్టాలని గిరిజన రైతులు అధికారును వేడుకుంటున్నారు. ఈ విషయంపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్‌కు పిర్యాదు చేయనున్నట్లు బాధిత రైతులు తెలిపారు.